5 కోట్ల డోసులకు కేంద్రం ఆర్డర్
నెలాఖరుకల్లా సరఫరా చేయనున్న బయోలాజికల్‌ఇ
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేసేందుకు కేంద్రం చర్యలు చేసడుతూనే ఉంది. ఇందులో భాంగానే ప్రికాషనరీ డోసు పంపిణీని విస్తరించాలని యోచిస్తోంది. ఇందుకోసం మరిన్ని డోసుల కొనుగోలును ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్ ఇ అభివృద్ధి చేసిన కార్బివాక్స్ టీకా 5 కోట్ల డోసుల కోసం కేంద్రం ఆ సంస్థకు ఆర్డర్ పెట్టినట్లు అధికార వర్గాలు శనివారం వెల్లడించాయి. ఒక్కో డోసును రూ.145(జిఎస్‌టి అదనం) చొప్పున వీటిని కొనుగోలు చేయనుంది. ఈ డోసులను ఫిబ్రవరి చివరి నాటికి సంస్థ సరఫరా చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ టీకాను ఎవరికి ఇవ్వాలనే దానిపై కేంద్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదు.అయితే ప్రికాషనరీ డోసుగా దీన్ని పంపిణీ చేసే అవకాశముందని విశ్వసనీయ వర్గాలుపేర్కొన్నాయి.
ప్రస్తుతం ఫ్రంట్‌లైన్ వర్కర్లు, ఆరోగ్య కార్యకర్తలు, 60 ఏళ్లు పైబడి ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ప్రికాషనరీ డోసును పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. రానున్న రోజుల్లో 60 ఏళ్ల లోపు వారికి కూడా మూడో డోసు ఇవ్వాలని కేంద్రం భావిస్తోంది. వీరికి ప్రికాషనరీ డోసుగా కార్బివాక్స్‌ను ఇచ్చే అవకాశం ఉన్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. ఆర్‌బిడి ప్రొటీన్ ఆధారిత తొలి స్వదేశీ వ్యాక్సిన్ అయిన కార్బివాక్స్ అత్యవసర వినియోగానికి ఇటీవల కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. అయితే ఈ టీకాకు ఆమోదం రాక ముందే 30 కోట్ల డోసుల కొనుగోలుకు కేంద్రం బయోలాజికల్ ఇ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకోసం రూ.1500 కోట్లు చెల్లించింది కూడా. ఇందులో భాగంగానే 5 కోట్ల డోసుల కొనుగోలుకు తాజాగా ఆర్డర్ పెట్టినట్లు తెలుస్తోంది.