రూ. 840 నుంచి రూ. 250 కు తగ్గింపు
న్యూఢిల్లీ : హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్ ఇ తయారు చేసిన కార్బెవాక్స్ టీకా ధరను ఆ సంస్థ భారీగా తగ్గించింది. ఇప్పటివరకు డోసుకు ధర రూ.840 గా ఉండగా, దీన్ని రూ.250 ( పన్నులతో కలిపి ) కి తగ్గించినట్టు ప్రకటించింది. అయితే వ్యాక్సిన్ కేంద్రాల్లో అదనపు ఛార్జీలతో కలిపి దీని ధర రూ. 400 గా ఉండనుంది. ఐదు నుంచి 12 ఏళ్ల వయసు చిన్నారుల వినియోగానికి అనుమతి వచ్చిన కొన్ని వారాల్లోనే బయోలాజికల్ ఇ ఈ నిర్ణయం తీసుకుంది. కార్బెవాక్స్ టీకాను ప్రస్తుతం 12 నుంచి 17 ఏళ్ల పిల్లలకు అందిస్తున్నారు.
ఇప్పటివరకు 4 కోట్ల 90 లక్షల డోసులను పంపిణీ చేశారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి దాదాపు 10 కోట్ల డోసులను బయోలాజికల్ ఇ సరఫరా చేసింది. మరోవైపు తేలికగా ఇవ్వడంతోపాటు వ్యాక్సిన్ వృధా అరికట్టేందుకు ఒక్క డోసును ఒకే వయల్ (బాటిల్) లో అందుబాటు లో తీసుకువచ్చింది. ప్రస్తుతం 12 నుంచి 17 ఏళ్ల పిల్లల కోసం ఈ వ్యాక్సిన్‌ను కొవిడ్ యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే టెక్సాస్ చిల్డ్రన్ హాస్పిటల్, బేలర్ కాలేజీ ఆఫ్ మెడిసిన్ సహకారంతో బయోలాజికల్ ఇ కార్బెవాక్స్ టీకాను అభివృద్ధి చేసింది. దేశంలో వినియోగానికి ముందు రెండు, మూడో దశల ప్రయోగాలను భారత్ లో చేపట్టింది. 5 నుంచి 12,12 నుంచి 18 ఏళ్ల వయసు ఉన్న మొత్తం 624 మందిపై తుది దశ ప్రయోగాలను పూర్తి చేసింది.