యుపిఐని వినియోగించి ఈ సదుపాయం కల్పిస్తాం: ఆర్‌బిఐ
దేశంలోని అన్ని ఎటిఎంలలో కార్డ్‌లెస్ విత్‌డ్రాయల్ సదుపాయం త్వరలో అందుబాటులోకి రానుంది. మోసాలకు చెక్ పట్టే ప్రయత్నంలో భాగంగా త్వరలో అన్ని బ్యాంకుల ఎటిఎంలలో కార్డు రహిత డబ్బు ఉపసంహరణను ప్రవేశపెట్టనున్నామని ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. డెబిట్ కార్డ్ లేకుండానే ఎటిఎంల నుంచి డబ్బులు డ్రా చేసుకునే సదుపాయం ప్రస్తుతం కొన్ని బ్యాంకులకు మాత్రమే ఉంది. యుపిఐని ఉపయోగించి అన్ని బ్యాంకులు, ఎటిఎం నెట్‌వర్క్‌లలో కార్డ్‌లెస్ క్యాష్ విత్‌డ్రా సౌకర్యాన్ని అందించనున్నామని దాస్ తెలిపారు.
దీని వల్ల వినియోగదారుల సౌలభ్యం పెరగడంతోపాటు కార్డ్ స్కిమ్మింగ్, కార్డ్ క్లోనింగ్ వంటి మోసాలను అరికట్టవచ్చని తెలిపారు. అన్ని బ్యాంకులు, అన్ని ఎటిఎం నెట్‌వర్క్‌లలో కార్డ్-లెస్ నగదు ఉపసంహరణను సులభతరం చేయడానికి యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (యుపిఐ) ద్వారా కస్టమర్ ఆథరైజేషన్ చేస్తారు. అయితే అలాంటి లావాదేవీలను ఎటిఎం నెట్‌వర్క్ ద్వారా పరిష్కరిస్తారు. ఆర్‌బిఐ తాజా ప్రకటన తర్వాత మరిన్ని బ్యాంకులు కార్డ్‌లెస్ సదుపాయంతో కనెక్ట్ అవుతాయి. ఎన్‌పిసిఐ, ఎటిఎం నెట్‌వర్క్, బ్యాంకులకు సేవల నిర్వహణ కోసం రెగ్యులేటర్ త్వరలో మార్గదర్శకాలను జారీ చేయనుంది.
ప్రస్తుతం కొన్ని బ్యాంకుల్లోనే..
ప్రస్తుతం కొన్ని బ్యాంకులు కార్డు లేకుండా విత్‌డ్రా చేసుకునే సదుపాయాన్ని కలిగి ఉన్నాయి. ఎస్‌బిఐ, ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా వంటి బ్యాంకులు కార్డ్‌లెస్ సేవలు అందిస్తున్నాయి. ప్రస్తుతం మొబైల్ బ్యాంకింగ్ యాప్ కార్డ్‌లెస్ విత్‌డ్రా కోసం ఉపయోగపడుతోంది. అయితే ఈ సదుపాయం కూడా రూ.10,000 నుండి రూ.20,000 వరకు లావాదేవీలకే పరిమితం చేశారు. దీని కోసం కొన్ని బ్యాంకులు తమ ఖాతాదారుల నుంచి అదనపు చార్జీలను కూడా వసూలు చేస్తున్నాయి.