బోనకల్ ః సాగరు పరిధిలో రబీలో సాగుచేసిన మొక్కొజొన్న పంటలకు సాగునీరు అందకపోవటంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా బోనకల్ బ్రాంచీ కెనాల్ పరిధిలోని బోనకల్, ఆళ్ళపాడు, రాయన్నపేట, గోవిందాపురం (ఏ) నారాయణపురం, రావినూతల తదితర గ్రామాలలో వేలాది ఎకరాలలో సాగుచేసిన మొక్కజొన్న పంట కంకి దశలో ఉంది. మండుతున్న ఎండలకు త్వరగా పైరుకు నీటి తడులు ఇవ్వవలసి ఉంటుంది. కాని సాగరు అధికారులు రైతులు పంటలను కాపాడేందుకు సక్రమంగా నీటి సరఫరాచేయకపోవటంతో పంటలు ఎండిపోతున్నాయి. లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టి సాగునీరు అందక కళ్ళముందే పైరు ఎండిపోతుండటంతో రైతుల గెండెలు పగిలిపోతున్నాయి.
దీంతోసాగునీరు అందించాలని సాగరు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. అంతేకాకుండా నాగార్జున సాగరు నిర్మాణం నాడు ఉమ్మడి రాష్ట్రంగా ఉండటంతో బోనకల్ వద్ద నుండి కాలువలు ఆంధ్రాలోకి వెళ్తున్నాయి.సరిహద్దు వద్ద నీటి నియంత్రించే రెగ్యులేటర్ నిర్మించలేదు. అందువలన తెలంగాణ రైతుల కోసం సరఫరా చేసిన నీరు ఆంధ్రాకు తరలిపోతోంది. ఏ నీళ్ళకోసం ఉద్యమం చేసి తెలంగాణ సాధించుకొన్నారే ఆ నీరే తెలంగాణ రైతులకు అందని పరిస్తితి దాపురించింది. అంతేకాకుండా సాగరు పరిధిలో పనిచేస్తున్న అనేక మంది ఉన్నత స్దానాలలో ఉన్న ఆంధ్రా అధికారులు తమ సహజ ఆంధ్రా పక్షపాతం చూపిస్తు తెలంగాణ రైతులను ఇబ్బంది పెడుతున్నారు.
ఎన్ని సార్లు రైతులు ఆందోళనలు చేసినా స్దానిక ప్రజాప్రతినిధులు మాత్రం పట్టించుకోవటంలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా ప్రజాప్రతినిధులు స్పందించి సాగునీరు అందక ఇబ్బంది పడుతున్న రైతులను ఆదుకోవాలని రైతులు, రైతు సంఘాల నేతలు డిమాండు చేస్తున్నారు.