Friday, November 15, 2024

రెండో దశను నివారించడంలో ఘోర వైఫల్యం

- Advertisement -
- Advertisement -

 హెర్డ్ ఇమ్యూనిటీపై తొందరపాటు సూత్రీకరణలు 

 కొవిడ్ నియంత్రణ నిబంధనల పట్ల నిర్లక్షం
 దేశంలోకి దిగుమతైన వేరియంట్లు 

 భారత్‌లో సెకండ్‌వేవ్ కారణాలపై నిపుణుల విశ్లేషణ

న్యూఢిల్లీ: గతేడాది ప్రారంభంలో భారత్‌లోకి చొరబడిన కరోనా మహమ్మారి ప్రభావం ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇక చివరి దశకు వచ్చిందని అంతా భావిస్తున్న తరుణంలో… సెకండ్‌వేవ్‌గా మహమ్మారి మరోసారి విజృంభించిన పరిస్థితులపై అంతర్జాతీయ వైద్య నిపుణలు విశ్లేషించారు. కొవిడ్19 మహమ్మారి నుంచి పూర్తిగా బయటపడే చివరిదశకు భారత్ చేరుకున్నదంటూ ఈ ఏడాది మార్చి ప్రారంభంలో స్వయానా కేంద్ర ఆరోగ్యశాఖమంత్రి హర్షవర్ధన్ ప్రకటించారు. మహమ్మారిని ఎదుర్కోవడంలో అంతర్జాతీయంగా ప్రధాని మోడీ అందిస్తున్న సహకారం ప్రపంచానికే ఆదర్శమంటూ హర్షవర్ధన్ కొనియాడారు కూడా.. భారత్ తన దౌత్యనీతిలో భాగంగా ఈ ఏడాది జనవరిలో విదేశాలకు కొవిడ్19 నియంత్రణ టీకాలను సరఫరా చేయడం ప్రారంభించింది. గతేడాది సెప్టెంబర్ మధ్యలో సగటు కేసుల సంఖ్య రోజుకు 93,000గా నమోదై, ఈ ఏడాది ఫిబ్రవరి మధ్యలో సగటు కేసుల సంఖ్య 11000కు పడిపోయింది. దాంతో, హర్షవర్ధన్ ఆ ప్రకటన చేసి ఉంటారు. రోజుకు సగటు మరణాల సంఖ్య కూడా 100కు దిగువకు చేరడంతో హర్షవర్ధన్ మాటలకు విశ్వసనీయత ఏర్పడింది. దాంతో, రాజకీయ నేతలు, విధాన రూప కర్తలతోపాటు మీడియా కూడా ఇక మహమ్మారి అంత్యదశకు చేరిందంటూ విశ్లేషించడం గమనార్హం. మరోవైపు గతేడాది డిసెంబర్‌లోనే భారత కేంద్రబ్యాంక్(ఆర్‌బిఐ) కూడా కొవిడ్ కేసుల గ్రాఫ్ పడిపోవడం ప్రారంభమైందంటూ, అందుకు సాక్షాధారాలను కూడా చూపింది. శరద్‌కాలంలో కమ్ముకున్న నీడలు, వెలుగుదారుల వైపు పయణిస్తున్నాయంటూ, మహమ్మారి కరోనా కనుమరుగవుతున్నదంటూ కవితాత్మకంగా వర్ణించింది. ప్రధాని మోడీకి వ్యాక్సిన్ గురూ అంటూ కితాబిచ్చింది.
ఫిబ్రవరి చివరన ఎన్నికల కమిషన్ ఐదు రాష్ట్రాల్లోని 824 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది. దాదాపు 18.60 కోట్లమంది ఈ ఎన్నికల్లో ఓటు హక్కు ను వినియోగించుకోవాలి. నెలరోజులకుపైగా ఓటింగ్ ప్రక్రియ సాగుతుంది. బెంగాల్‌లో 8 దశల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు. ప్రధాన పార్టీలు పోటాపోటీగా ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. కొవిడ్ నియంత్రణ ప్రొటోకాల్స్‌ను గాలికొదిలేశాయి. వేలాదిమందితో ప్రచార ర్యాలీలు నిర్వహించాయి. సామాజిక దూరమనేది మచ్చుకైనా కానరాలేదు. మరోవైపు మార్చి మధ్యలో గుజరాత్‌లోని నరేంద్రమోడీ స్టేడియంలో భారత్‌-ఇంగ్లాండ్ మధ్య క్రికెట్ మ్యాచ్‌కు 1,30,000 మంది ప్రేక్షకులకు క్రికెట్‌బోర్డు అనుమతిచ్చింది. ప్రేక్షకుల్లో అధికభాగం మాస్క్‌లు ధరించలేదు.
ఈ ఘటనలు జరిగిన తర్వాత నెలరోజులు తిరక్కుండానే భారత్ సెకండ్‌వేవ్ ఉచ్చులోకి జారిపోయింది. పలు నగరాల్లో మరోసారి లాక్‌డౌన్‌పై ఆలోచిస్తున్నారు. ఏప్రిల్‌లో సగటు కేసులు లక్ష మార్క్‌ను దాటాయి. ఆదివారం(ఏప్రిల్ 18న) 2,70,000కుపైగా కేసులు,1600కుపైగా మరణాలు నమోదయ్యాయి. భారత్‌లోకి కరోనా ప్రవేశించిన తర్వాత ఇదే అత్యధికం. కేసుల సంఖ్య ఇలాగే పెరుగుతూపోతే జూన్ మొదటివారం వరకల్లా భారత్‌లో రోజుకు 2300కుపైగా మరణాలు నమోదవుతాయని కొవిడ్19పై లాన్సెట్ కమిషన్ నివేదిక పేర్కొన్నది.
భారత్ ఇప్పుడు ఆరోగ్య అత్యవసర పరిస్థితికి చేరువైంది. సోషల్ మీడియాలో కరోనా మృతుల అంత్యక్రియల వీడియోలు వైరల్ అవుతున్నాయి. శ్మశానవాటికల వద్ద శవ దహనాల కోసం క్యూలు కడుతున్నతీరు ఆందోళన కలిగిస్తోంది. తీవ్ర శ్వాస సమస్యలతో బాధపడుతున్నవారిని అంబులెన్స్‌ల్లో వరుసకట్టి తరలిస్తున్నారు. ఆస్పత్రుల సామర్థానికిమించి పేషెంట్ల సంఖ్య ఉండటంతో ఒకే పడకపై ఇద్దరిని పడుకోబెట్టి చికిత్స చేస్తున్న దృశ్యాలు పరిస్థితి తీవ్రతను కళ్లకు కడుతున్నాయి. కొవిడ్ వల్ల మృతిచెందినవారి శవాలను తీసుకెళ్లేందుకు వారి బంధువులు శవాగారాల వద్ద క్యూకడుతున్నారు. కొవిడ్ పేషెంట్లతో హాస్పిటళ్ల కారిడార్లు, లాబీలు నిండిపోయాయి. పడకలు, ఆక్సిజన్, అత్యవసర మందుల కోసం సిఫారసులు చేయించాల్సివస్తోంది. ఇదే అదనుగా అత్యవసర మందులను కొందరు దళారీలు బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారు. తన కొడుకు చనిపోయిన విషయం తనకు మూడు గంటలవరకు తెలియనివ్వలేదంటూ ఓ తల్లి వాపోయిన వీడియో వైరలైంది.

మరోవైపు దేశంలో ప్రారంభించిన వ్యాక్సినేషన్ ప్రక్రియలో లోపాలున్నాయన్న విమర్శలొస్తున్నాయి. వ్యాక్సిన్ల సామర్థంపై అనుమానాలు వ్యక్తం కాగా, అవి కూడా అందరికీ అందడంలేదన్న ఆరోపణలున్నాయి. గతవారం 10 కోట్ల వ్యాక్సిన్ డోసుల మార్క్‌ను భారత్ దాటేసింది. ఇప్పుడు వ్యాక్సిన్ కొరతతో ఇరకాటంలో పడింది. జూన్ వరకు డిమాండ్‌కు తగ్గట్టుగా సరఫరా చేయలేమని సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్‌ఐఐ) తెలిపింది. ఎస్‌ఐఐ తయారు చేస్తున్న కొవిషీల్డ్ వ్యాక్సిన్లను విదేశాలకు ఎగుమతి చేయడంపై ప్రభుత్వం తాత్కాలిక నిషేధం విధించింది. విదేశాల నుంచి వ్యాక్సిన్ల దిగుమతికి అనుమతిచ్చింది. ఆక్సిజన్ దిగుమతులకూ అనుమతిచ్చింది. ఓవైపు జనం కరోనాబారిన పడి చనిపోతుంటే వేలాదిమందితో ఎన్నికల ర్యాలీలు, క్రికెట్ మ్యాచ్‌లు, కుంభమేళాలు నిర్వహించడం పట్ల సామాజికవేత్తల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. వాస్తవ పరిస్థితులకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని వారు విమర్శిస్తున్నారు. సెకండ్‌వేవ్ ఇప్పటికే ప్రభుత్వ చేయి దాటిపోయిందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో కేసుల సంఖ్య ఏడింతలు పెరిగినట్టు ఫిబ్రవరి మధ్యలోనే రిపోర్ట్‌లు వచ్చాయి. దాంతో, విదేశాల నుంచి దిగుమతియైన వేరియంట్స్‌ను గుర్తించేందుకు శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపించారు. కేసుల పెరుగుదలకు కారణాలు అర్థం కావడంలేదు. కుటుంబాలకు కుటుంబాలే ఇన్‌ఫెక్షన్‌కు గురవుతున్నాయి. ఇది పూర్తిగా కొత్త ట్రెండ్ అని మహారాష్ట్రలోని కరోనా బాధిత జిల్లాకు చెందిన సర్జన్ ఒకరు వ్యాఖ్యానించారు. యువకులకు ఏమీకాదు. భారత జనాభాలో వారి శాతం అధికం.

గ్రామీణులకు సహజంగానే వైరస్‌ను తట్టుకోగల ఇమ్యూనిటీ ఉన్నది. దాంతో, భారత్‌లో ఇక కరోనా కథ ముగిసినట్టేనని సూత్రీకరించి నిర్లక్షం వహించారని మరో నిపుణుడు విమర్శించారు. అధికారుల దురహంకారం, అతిశయించిన జాత్యాభిమానం, ఉన్నతాధికారుల ఉదాసీనత… ఇవన్నీ భారత్‌లో సెకండ్‌వేవ్‌కు కారణమని ఆయన విశ్లేషించారు. కేసులు కాస్త తగ్గుముఖం పట్టగానే ప్రజల్లోనూ నిర్లక్షం పెరిగింది. మాస్క్‌లు ధరించడం, సామాజిక దూరంలాంటి కనీస నిబంధనలు కూడా పాటించకుండా గుమికూడటం ప్రారంభించారు. విందులు, వినోదాలు మామూలయ్యాయి. మరోవైపు ప్రభుత్వాలు కూడా మత సంబంధ కార్యక్రమాలు, రాజకీయ ర్యాలీలు, సభలు, సమావేశాలకు అనుమతులిచ్చాయి. ఇక మహమ్మారి ప్రభావం తగ్గినట్టేనన్న భావనతో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా మందగించింది. దాంతో, ఈ ఏడాది జులై చివరి వరకల్లా 25 కోట్లమందికి టీకాలివ్వాలన్న లక్షం పక్కకుపోయింది. కేసుల సంఖ్య తగ్గినా భారత్‌లో వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయాలన్న అంతర్జాతీయ నిపుణుల సూచనలనూ పట్టించుకోలేదు. ఇతర దేశాల్లోవలె భారత్‌లోనూ జనవరిలోనే వేరియంట్స్‌ను గుర్తించేందుకు జీనోమిక్ నిఘాను పటిష్టం చేసి ఉండాల్సిందని నిపుణులు చెబుతున్నారు. సెకండ్‌వేవ్‌కు వేరియంట్స్ కూడా కారణమని వారు స్పష్టం చేశారు. మహారాష్ట్రలో ఫిబ్రవరిలోనే వేరియంట్స్‌పై రిపోర్ట్ వచ్చినా, అధికారులు వాటిని తిరస్కరించారని వారు గుర్తు చేశారు.

Corona 2nd wave cases highly hikes in India

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News