Friday, November 22, 2024

రెండో గండం!

- Advertisement -
- Advertisement -

కరోనా సెకండ్ వేవ్ 100 రోజులు

ఏప్రిల్ మధ్య నాటికి పీక్ స్టేజీ
దాదాపు 25లక్షల మంది వైరస్ బారిన పడే అవకాశం
లాక్‌డౌన్, కఠిన ఆంక్షలతో పెద్దగా ఫలితం ఉండకపోవచ్చు
కరోనా వ్యాక్సినేషన్ ఒక్కటే పరిష్కార మార్గం
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెర్చ్ రిపోర్టు అంచనా

న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. గత కొద్ది రోజులుగా దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో కరోనా సెకండ్ వేవ్ ప్రవేశించిందని కేంద్రప్రభుత్వం ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. అయితే దేశంలో ఫిబ్రవరినుంచి పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరగడం సెకండ్ వేవ్‌కు నిదర్శనమని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బిఐ) రిసెర్చ్ నివేదిక వెల్లడించింది. ఈ వేవ్ ఫిబ్రవరి 15నుంచి వంద రోజులు కొనసాగవచ్చని, ఏప్రిల్ మధ్య నాటికి పీక్ కు చేరుకోవచ్చని ఆ నివేదిక అంచనా వేసింది. అప్పటికి దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 25 లక్షలకు చేరుకోవచ్చని కూడా నివేదిక అంచనా వే సింది. ‘సెకండ్ వేవ్ ఫిబ్రవరి 15నుంచి వంద రోజులు ఉండవచ్చు. దీంతో రానున్న ఏప్రిల్ మధ్య నాటికి వైరస్ తీవ్రరూపం దాల్చనుంది. ప్రస్తుత పరిస్థితుల దృష్టా దేశవ్యాప్తంగా దాదాపు 25 లక్షల మంది సెకండ్ వేవ్‌లో వైరస్ బారిన పడే అవకాశం ఉంది’ అని బ్యాంక్ నివేదికద్వారా అంచనా వేసింది. అయితే వ్యాక్సిన్లు అందుబాటులో ఉండడం, టీకాల ప్రక్రియ కొనసాగుతున్న దృష్టా మిగతా దేశాలతో పోలిస్తే భారత్ సెకండ్ వేవ్‌ను ఎదుర్కోవడంలో మెరుగైన స్థితిలో ఉందని నివేదిక అభిప్రాయపడింది. ‘ఇతర దేశాల్లో సెకండ్ వేవ్ తీవ్రస్థాయికి చేరుకున్న సమయంలో రోజువారీ నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య మొదటిసారి తీవ్రస్థాయికన్నా ఎన్నో రెట్లు ఎక్కువగా ఉండేవి.

అయితే అప్పుడు వ్యాక్సినేషన్ లేదు’ అని నివేదిక పేర్కొంది. ‘లాక్‌డౌన్, ఆంక్షలు విధించడం వల్ల వైరస్‌పై అంతగా ప్రభావం చూపకపోవచ్చు. ఇప్పటికే పెరిగిపోతున్న పాజిటివ్ కేసుల వల్ల కొన్ని వ్యాపార రంగాలు ఆర్థికంగా తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రస్తుతం కొన్ని రాష్ట్రాల్లో లాక్‌డౌన్, కఠిన ఆంక్షలు విధించడంతో మరిన్ని రంగాలు ఆర్థికంగా దెబ్బతినే అవకాశం ఉంది. కరోనా కట్టడికి వ్యాక్సినేషన్ ఒక్కటే సరయిన మార్గంగా కనిపిస్తోంది’ అని ఎస్‌బిఐ ఆ నివేదికలో అభిప్రాయపడింది. . దేశంలో కరోనా సమయంలో పెంచిన వైద్య మౌలిక సదుపాయాల ఆధారంగా ఇప్పుడు వేస్తున్న రోజుకు 34 లక్షల టీకాలనుంచి ఒక కోటికి పెంచుకోగల సామర్థం మన దేశానికి ఉందని కూడా నివేదిక అభిప్రాయపడింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా రోజుకు సగటున 34లక్షల డోసులను పంపిణీ చేస్తున్నారు. వీటిని 40నుంచి 45 లక్షలకు పెంచినప్పటికీ.. 45 ఏళ్లకు పైబడిన వారందరికీ టీకా అందించడానికి మరో నాలుగు నెలల సమయం పట్టవచ్చని ఎస్‌బిఐ తన నివేదికలో అంచనా వేసింది. పంజాబ్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ లాంటి 60 ఏళ్లకు పైబడిన వారు ఎక్కువ సంఖ్యలో ఉన్న రాష్ట్రాలుతమ రాష్ట్రాల్లోని వయో వృద్ధులకు తక్కువ శాతం టీకా పంపిణీ చేశాయని, ఈ రాష్ట్రాలు టీకా పంపిణీ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని కూడా నివేదిక పేర్కొంది. కొత్తగా నమోదవుతున్న కేసుల్లో గ్రామీణ జిల్లాల వాటా నిలకడగా ఉండగా పట్టణ జిల్లాల్లో కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతుండడం గమనార్హమని కూడాఎస్‌బిఐ ఆ నివేదికలో తెలిపింది.

Corona 2nd wave could peak in half of April: SBI report

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News