ముంబై : మహారాష్ట్రలో త్వరలోనే కరోనా వైరస్ థర్డ్‌వేవ్ ఏర్పడుతుందని రాష్ట్ర మంత్రి ఆదిత్య థాకరే చెప్పారు. ఇప్పటి సెకండ్ వేవ్‌తో పోలిస్తే రాబోయే మూడవ దశ కరోనా తీవ్రత ఏమిటనేది ఇప్పటికిప్పుడు నిర్థారించలేమని థాకరే తెలిపారు. సెకండ్ వేవ్ కన్నా ఇది బలంగా ఉంటుందా? బలహీనంగా ఉంటుందా? అనేది వేచి చూడాల్సిందేనని రాష్ట్ర పర్యావరణ, పర్యాటక మంత్రి అయిన ఆదిత్య థాకరే ఎన్‌డిటీవీ సొల్యూషన్స్ సమ్మిట్‌ను ఉద్ధేశించి చేసిన ప్రసంగంలో తెలిపారు. ఇప్పుడు అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు వైరస్ నివారణకు ఉపయోగపడుతాయా? అనేది నిర్థారితం అవుతుందని, దీనిని బట్టి ఇక ముందు ఏమి చేయాల్సి ఉంటుంది? కరోనా వైరస్ నియంత్రణకు ఎటువంటి వ్యాక్సిన్లు లేదా చికిత్సా విధానాలు పాటించాల్సి ఉంటుందనేది ఖరారు చేసుకోవచ్చు అన్నారు. రాష్ట్రంలో కరోనా ఆటకట్టుకు శాస్త్రీయపరమైన పద్ధతులు ఆచరిస్తున్నట్లు తెలిపారు. గత ఏడాది ఇందుకు సంబంధించి ఓ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసుకుని ఉంచారని, ఇదంతా కూడా శాస్త్ర, వైద్య ఆరోగ్యపరమైన నిర్థారిత అంశాలప్రాతిపదికన సాగుతోంది. అంతేకానీ రాజకీయ మిళితాలతో కాదని తేల్చిచెప్పారు.