Thursday, December 26, 2024

కరోనా బాధిత గర్భిణులకు ప్రాణ గండం

- Advertisement -
- Advertisement -

గర్భిణులు కరోనా మహమ్మారి బారిన పడ్డారంటే తీవ్రమైన అస్వస్థులు కావడమే కాకుండా మృతి చెందే ప్రమాదం కూడా పొంచి ఉంటుందని పరిశోధకులు తమ అధ్యయనంలో కనుగొన గలిగారు. ఈ ముప్పు గర్భిణులకే కాదు, అప్పుడే పుట్టిన నవజాత శిశువులపై కూడా ప్రభావం చూపిస్తుంది. కరోనా కాలమంతా గర్భిణులు ఏ విధంగా వైరస్‌కు దుర్బలమయ్యారో స్పష్టమయ్యింది. అందుకనే కరోనా వ్యాక్సిన్‌ను గర్భిణులు తీసుకుంటే తమకే కాదు, పుట్టిన బిడ్డలకు కూడా రక్షణ కలుగుతుందని డాక్టర్లు సూచిస్తున్నారు.

అయితే ఈమేరకు అన్ని దేశాల్లో సరిగ్గా అధ్యయనం జరగలేదు. ముఖ్యంగా అల్పాదాయ దేశాల్లో ఈలోటు కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో వివిధ దేశాలకు చెందిన టీకా వేసుకోని దాదాపు 13,000 మంది గర్భిణుల నుంచి డేటా సేకరించి తాజాగా అధ్యయనం చేపట్టారు. దీని ద్వారా ప్రపంచం మొత్తం మీద కొవిడ్ బాధిత గర్భిణులకు ఎలాంటి రిస్కు ఎదురవుతుందో వాస్తవాలు తెలుసుకోవచ్చని అభిప్రాయ పడుతున్నారు. వాషింగ్టన్ డిసిలోని వాషింగ్టన్ యూనివర్శిటీకి చెందిన గ్లోబల్ హెల్త్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎమిలీ స్మిత్, ఆమె సహచరులు అధ్యయనంలో అనేక విషయాలను తెలుసుకున్నారు.

కరోనా సోకని మహిళల కంటే కరోనా సోకిన గర్భిణుల్లో 3 శాతం మంది నాలుగు రెట్లు ఎక్కువగా ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చేరినట్టు బయటపడింది. అలాగే ఇన్‌ఫెక్షన్‌కు గురైన వారిలో 2 శాతం మందికి శ్వాస సరిగ్గా ఆడడానికి వెంటిలేషన్ తప్పనిసరి అయింది. మరణాల రేటు కూడా ఎక్కువగా కనిపించింది. కరోనా నుంచి తప్పించుకున్న గర్భిణులతో పోలిస్తే వీరిలో ఒక శాతం మాత్రమే మరణాల రేటు కనిపించగా, కరోనా పీడితులైన గర్భిణుల్లో 7 శాతం మరణాల రేటు కనిపించింది. కొవిడ్ బాధిత గర్భిణుల్లో అయిదోవంతు మంది న్యూమోనియా బారిన పడ్డారు. కరోనా లేని గర్భిణుల కన్నా వారిలో 23 రెట్లు న్యూమోనియా కనిపించింది.

వీరు ప్రసవించిన నవజాత శిశువులకు కూడా కరోనా ప్రభావం పడింది. బిఎంజె గ్లోబల్ హెల్త్ అధ్యయనం ప్రకారం కొవిడ్ రోగులైన, వ్యాక్సిన్ వేయించుకోలేని గర్భిణులు నెలలు నిండక ముందే బిడ్డలను ప్రసవించే అవకాశం ఎక్కువగా ఉంటోంది. అలాంటి బిడ్డలను నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చేర్చవలసి వస్తోంది. నెలలు నిండని బిడ్డలకు జీవితాంతం అనారోగ్య సమస్యలు వెంటాడుతుంటాయి. లేత వయసులో జ్ఞాపకశక్తి ఆలస్యంగా వృద్ధి చెందడం జరుగుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News