వాషింగ్టన్ : అమెరికాలో మరోసారి కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. ఇప్పటివరకు ఐదు కోట్లకు పైగా కొత్త కేసులు, 8 లక్షలకు పైగా మరణాలు సంభవించాయి. అమెరికాలో నార్త్ డకోటా, అలస్కా వంటి రాష్ట్రాల జనాభా కన్నా ఈ మృతుల సంఖ్యే ఎక్కువగా ఉంటోందని జాన్‌హాప్‌కిన్స్ యూనివర్శిటీ వెల్లడించింది. గుండె పోటు, పక్షవాతం వల్ల ప్రతిఏటా ఎంతమంది చనిపోతున్నారో అంతమంది సంఖ్యతో ఈ సంఖ్య సమానంగా ఉంటోందని పేర్కొంది. ప్రపంచ జనాభాలో నాలుగుశాతం అమెరికాలో ఉండగా, రెండేళ్ల క్రితం చైనా నుంచి కరోనా బయటపడిన దగ్గర నుంచి ఇంతవరకు సంభవించిన 5.3 మిలియన్ మరణాల్లో 15 శాతం అమెరికా లోనే సంభవించినట్టు వెల్లడించింది. మార్చి 1 నాటికి అమెరికాలో మొత్తం 8,80,000 మరణాలు సంభవించాయని వాషింగ్టన్ యూనివర్శిటీ వెల్లడించింది.
అయితే అమెరికా వైద్య నిపుణులు మాత్రం చాలా మరణాలు కేవలం గుండె పోటు వల్లనే జరిగాయని, ఎందుకంటే టీకాల వల్ల వారు కరోనా నుంచి భద్రత పొందారని, గత ఏడాది డిసెంబర్ మధ్య కాలంలోనే టీకాలు అందుబాటు లోకి రాగా, ఏప్రిల్ మధ్య లోనే వయోజనులందరికీ అందుబాటు లోకి వచ్చాయని పేర్కొన్నారు. అమెరికా జనాభాలో 60 శాతం అంటే 200 మిలియన్ మంది పూర్తిగా టీకా పొందారు. నివారించ దగిన మరణాలు అయినప్పటికీ ఈ మరణాలు సంభవిస్తున్నాయని దీనికి కారణం వారిలో ఇమ్యూనిటీ సరిగ్గా లేకపోవడమేనని ఎపిడెమియాలజిస్టు డాక్టర్ క్రిస్ బేరెర్ చెప్పారు. అమెరికాలో టీకా ప్రారంభమైనప్పుడు దేశం మొత్తం మీద దాదాపు 3 లక్షల వరకు మరణాలు ఉండేవి.జూన్ మధ్యలో 6 లక్షలకు , అక్టోబర్ 1 నాటికి 7 లక్షలకు మరణాలు పెరిగాయి. 2020 మార్చి, ఏప్రిల్ మధ్యకాలంలో 2,40,000 వరకు మరణాలు సంభవించడం అత్యంత శోచనీయంగా బేరెర్ తెలిపారు.