Monday, December 23, 2024

మళ్లీ కరోనా?

- Advertisement -
- Advertisement -

Corona again in india  దేశంలో కరోనా మళ్ళీ విజృంభిస్తున్న సూచనలు రోజు రోజుకీ బలపడుతున్నాయి. కేసుల సంఖ్య పెరుగుతున్నకొద్దీ ప్రభుత్వం తరపు నుంచి హెచ్చరికలూ వస్తున్నాయి. విమాన ప్రయాణికులు విధిగా మాస్క్‌లు ధరించాలన్న ఆజ్ఞలు జారీ అయ్యాయి. విమానాల్లోనూ, విమానాశ్రయాల్లోనూ ముఖతొడుగులు విధిగా ధరించాలని లేని పక్షంలో వారిని విమానం ఎక్కకుండా చేస్తామని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తీవ్ర హెచ్చరిక జారీ చేసింది. నూట మూడు రోజుల తర్వాత మొన్న శనివారం వొక్క రోజునే దేశ వ్యాప్తంగా 8329 కొత్త కేసులు రికార్డయ్యాయని, వీరిలో పది మంది మరణించారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలియజేసిన సమాచారం ఆందోళన కలిగిస్తున్నది. మృతుల్లో అయిదుగురు కేరళకు, ఇద్దరు ఢిల్లీకి చెందినవారు కాగా, గుజరాత్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లలో ఒక్కొక్కరు చనిపోయారని వెల్లడయ్యింది. దేశం ఇప్పటికి మూడు దశల కరోనా (కొవిడ్ -19)ను ఎదుర్కొన్నది. మూడో దశలో వచ్చిన వొమిక్రాన్ పెద్దగా హాని చేయకుండానే ముగిసిపోయింది. మొదటి రెండు దశల కరోనా మాత్రం అపూర్వ స్థాయి భయోత్పాతాన్ని సృష్టించింది.

2020 మార్చిలో మొదటి విడత కరోనా విరుచుకుపడినప్పుడు మిగతా అన్ని దేశాల మాదిరిగానే మన దేశం కూడా అయోమయ అవస్థలో కూరుకుపోయింది. ఊపిరిలో ప్రవేశించి నవనాడులనూ క్రుంగదీసి అన్ని శారీరక వ్యవస్థలనూ నీరసింపజేసి ఉన్నపళంగా ప్రాణాలను హరింపజేసే ఈకొత్త అంటువ్యాధి అంతు తెలియక ప్రభుత్వం, ప్రజలు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. సమీప భవిష్యత్తులో టీకా గాని, మందు గాని తయారయ్యే అవకాశాలు లేకపోడంతో చెప్పనలవికాని ఆందోళన అలముకొన్నది. ఇప్పుడు తాగాజా తీవ్రస్థాయి కేసులు వొక్క రోజులోనే అదనంగా 4103 వచ్చి చేరాయి. దేశ వ్యాప్తంగా పదిహేడు జిల్లాలలో వ్యాధి తీవ్రంగా ఉన్నట్టు తెలుస్తున్నది. ఇందులో యేడు కేరళలో, అయిదు మిజోరంలో ఉన్నాయి. ఈ జిల్లాలలో వారానికి 10 శాతం పాజిటివిటీ రేటు నమోదు అవుతున్నది. కరోనా దేశ వైద్య ఆరోగ్య వ్యవస్థను పరీక్షకు పెట్టింది. మందు, మాకు లేక సతమతమవుతున్న దశలో ప్రధాని మోడీ ప్రభుత్వం ప్రదర్శించిన అత్యుత్సాహం ప్రజలను నానా ఇబ్బందుల పాలు చేసింది. ఆరోగ్యం ప్రధానంగా రాష్ట్రాల అంశం కాగా, కేంద్రం సర్వాధికారాలు చేతిలోకి తీసుకొని 2020 మార్చి 24న దేశ వ్యాప్త తక్షణ కఠిన లాక్‌డౌన్‌ను విధించింది.

ఇంకో వైపు ప్రధాని మోడీ తప్పెట్లు, తాళాల మోగింపు పిలుపు అపహాస్యాన్ని జోడించింది. ఉన్నపళంగా అమల్లోకి వచ్చిన కఠిన లాక్‌డౌన్ దేశ వ్యాప్తంగా లక్షలు, కోట్లాది అసంఘటిత రంగ కార్మికులను చెప్పనలవికాని బాధల కోరల్లోకి నెట్టివేసింది. మొదటి వేవ్ కరోనా తగ్గుముఖం పట్టిందనుకొంటున్న దశలో 2021 జనవరిలో దేశీయ జంట వ్యాక్సిన్ల గురించి ప్రధాని ఘనంగా ప్రకటించారు. కాని అవి ఆశించిన రీతిలో ప్రజలకు అందుబాటులోకి రాలేదు. ఇంతలో 2021 ఏప్రిల్ నుంచి మొదలైన రెండో వేవ్ కరోనా మహోధృతంగా దాడి చేసింది. అవసరమైన మందులు, ఆక్సిజన్ కరవై మధ్యతరగతి, యెగువ మధ్యతరగతి వర్గాలు పడిన బాధలు ఇన్నీ అన్నీ కావు. సాధారణ ప్రజలకు ఏ దిక్కూ లేకపోయింది. ప్రజల బాధల మీద కార్పొరేట్ వైద్యశాలలు సొమ్ము చేసుకొన్న తీరు పరమ జుగుప్స కలిగించింది.రూ. ముప్పై లక్షలు వదిలించుకొన్నా ప్రాణాలు దక్కని కేసులు అసంఖ్యాకం. శవాలు గుట్టలు గుట్టలుగా గంగా నదిలో తేలాయంటే యెంత మానవ విషాదం సంభవించిందో ఊహించవచ్చు. విచిత్రంగా మొదట్లో అతిగా వ్యవహరించిన కేంద్రం ఈసారి అయిపు, అడ్రస్ లేకుండాపోయింది. ఢిల్లీ, ముంబై నగరాల్లో కొవిడ్ రూపంలో మృత్యువు గజ్జె కట్టింది.

రాష్ట్రాలకు కావలిసినన్ని నిధులు ఇచ్చి వెన్నుతట్టవలసిన కేంద్రం ఆ బాధ్యతను గాలికి వదిలేసింది. 18 సంవత్సరాలు దాటిన వారందరికీ ఉచితంగా టీకాలు వేయించాల్సిన బాధ్యతను కేంద్రం స్వీకరించేలా చేయడానికి సుప్రీంకోర్టు పలు సార్లు జోక్యం చేసుకోవలసివచ్చింది. జనాభాలో ముడొంతులున్న పేదల చేత టీకా కొనిపించి కార్పొరేట్ కంపెనీలకు లాభాలు చేయించడానికి కేంద్రం పడిన తాపత్రయం అంతా ఇంతా కాదు. కొవిడ్ మృతులను వీలైనంత తక్కువగా చూపించడం లోనూ కేంద్రం దుర్బుద్ధి బయటపడింది. మృతులు అయిదారు లక్షలకు మించరని కేంద్రం అంటే ప్రాథమిక ప్రైవేటు గణాంకాలు పదహారు లక్షలన్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇరవై లక్షలని తేల్చింది. ఎన్ని పొరపాట్లు, కప్పదాట్లు జరిగినప్పటికీ టీకాలు వేయించడంలో ఆలస్యంగానైనా చాలా వరకు కృతజ్ఞులం కాగలిగాం. ఇప్పటికి రెండు డోసుల టీకా 70 శాతం మందికి వేసినట్టు తెలుస్తున్నది. ఇంతలోనే మళ్ళీ కేసులు పెరుగుతూ ఉండడం భయం పుట్టించే అంశమే. ఇంక రాదులే అనుకొని జనం మాస్కులు వదిలేశారు. ఇతర జాగ్రత్తలు మానుకొన్నారు. కేసులు తిరిగి పెరుగుతున్న నేపథ్యంలో మళ్ళీ వాటిని ఆశ్రయించక తప్పదు. అజాగ్రత్తకు అణు మాత్రం తావు ఇవ్వరాదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News