స్పెయిన్ శాస్త్రవేత్తల అధ్యయనం వెల్లడి
లండన్ : ఉష్ణోగ్రత, తేమ తగ్గినప్పుడు వచ్చే సీజనల్ ఇన్‌ఫెక్షన్‌గా కొవిడ్ 19 మారి ఉండొచ్చని, ఇది చాలావరకు సీజనల్ ఇన్‌ఫ్యుయెంజాలా రూపాంతరం చెంది ఉండొచ్చని స్పెయిన్ లోని బార్సిలోనా ఇన్‌స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్‌కు చెందిన శాస్త్రవేత్తలు తెలిపారు. గాలి ద్వారా కరోనా వ్యాప్తి చెందుతోందన్న వాదనను ఇది సమర్థిస్తోంది. ఈ నేపథ్యంలో పరిసరాల్లోని గాలి పరిశుభ్రంగా ఉంచుకోవాలని పరిశోధకులు పేర్కొన్నారు. శాస్త్రవేత్తలు మొదట నిర్వహించిన సైద్ధాంతిక నమూనా అధ్యయనంలో కొవిడ్ వ్యాప్తిలో వాతావరణం ఒక కారకం కాదని వెల్లడైంది. అయితే చైనాలో మొదట ఉత్పన్నమైన ప్రాంతాన్ని పరిశీలించగా, అది 30,50 డిగ్రీల ఉత్తర అక్షాంశాల మధ్య ఉన్నట్టు గుర్తించారు.
అక్కడ గాలిలో తేమ చాలా తక్కువగా ఉన్నట్టు తేల్చారు. అలాగే ఉష్ణోగ్రత కూడా 5 డిగ్రీల నుంచి 11 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉన్నట్టు గుర్తించారు. ఈ నేపధ్యంలో 162 దేశాల్లో కొవిడ్ వ్యాప్తి మొదటి దశలో ఉన్నప్పుడు ఉష్ణోగ్రతలు, తేమ చూపిన ప్రభావాన్ని పరిశీలించారు. ఉష్ణోగ్రతలు, తేమ తక్కువగా ఉన్నప్పుడు వ్యాధి వ్యాప్తి రేటు ఎకుఎ్కవగా ఉందని తేల్చారు. ఈ రెండు పరామితులు పెరిగినప్పుడు కొవిడ్ ఉధృతి తగ్గుముఖం పట్టిందని తెలిపారు. వేసవిలో మాత్రం ఈ పోకడ విచ్ఛిన్నమైందని పేర్కొన్నారు. ఆ కాలంలో యువత ఎక్కువగా గుమికూడడం, పర్యాటకులు పెరగడం, ఎసిల వినియోగం వంటివి ఇందుకు దోహద పడి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు.