Friday, November 22, 2024

ప్రపంచవ్యాప్తంగా మళ్లీ విజృంభిస్తోన్న కరోనా

- Advertisement -
- Advertisement -
Corona booming again around the world
అప్రమత్తమైన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ
కరోనా కట్టడికి పకడ్బంధీ చర్యలు
యుద్ధప్రాతిపదికన వ్యాక్సినేషన్
పిల్లల కోసం ప్రత్యేకంగా పిడియాట్రిక్ బెడ్లు

హైదరాబాద్ : ప్రపంచ వ్యాప్తంగా మహమ్మారి కరోనా వైరస్ మళ్ళీ విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో కరోనా వ్యాప్తి అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం పకడ్బంధీ చర్యలు చేపడుతోంది. బ్రిటన్, రష్యా, చైనా దేశాల్లో భారీగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కరోనా మరోసారి పంజా విసురుతుండడంతో రష్యాలో కార్యాలయాలకు సెలవులు ప్రకటించారు. మరోవైపు, చైనాలో పాఠశాలలను మూసివేశారు. విమానాలను కూడా రద్దు చేశారు.లాటిన్ దేశమైన పెరూలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఆ దేశంలో ఇప్పటివరకు కరోనా మరణాల సంఖ్య రెండు లక్షలు దాటింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 24.3కోట్లకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 49.4లక్షలకు పైగా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ రాష్ట్రంలో కరోనా అదుపులోనే ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. అయితే కరోనా ముప్పు తొలగిపోయిందని అనుకోవద్దని, ప్రతి జాగ్రత్తలు పాటించాలని వైద్య ఆరోగ్య శాఖ ఎప్పటికప్పుడూ ప్రజలను అప్రమత్తం చేస్తూనే వస్తోంది.

500 టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి చేసేలా ఏర్పాట్లు

కరోనా నేర్పిన పాఠాలతో ప్రభుత్వం ఆరోగ్యం రంగంపై దృష్టి సారించి ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు చర్యలు చేపడుతోంది. థర్డ్ వేవ్ వచ్చినా ఎదుర్కొనేందుకు నిర్ధిష్టమైన ప్రణాళికలు రూపొందించుకుని చర్యలు చేపడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా రూ.10 వేల కోట్లతో ఆరోగ్య రంగంలో మౌళిక సదుపాయాలు పెంపొందిస్తామని సిఎం కెసిఆర్ ప్రకటించారు. సెకండ్ వేవ్‌లో ఎదురైన సమస్యలను దృష్టిలో ఉంచుకుని సొంతగా రాష్ట్రంలోనే 500 టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి చేసేలా ఏర్పాట్లు చేయడంతో పాటు రాష్ట్రంలోని 27 వేల పడకలను పూర్తిగా ఆక్సిజన్ బెడ్లుగా మార్చింది. అలాగే పిల్లల కోసం పిడియాట్రిక్ బెడ్లు సిద్ధం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యాక్సిన్ కొరత లేకుండా చర్యలు తీసుకుంటూ యుద్ధప్రాతిపదికన వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టింది. అలాగే కొవిడ్ టెస్టులను గణనీయంగా పెంచింది.

దేశంలో కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలలో ఇప్పటికీ కరోనా తీవ్రత కొనసాగుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలతో తెలంగాణలో కరోనా చాలా వరకు అదుపులోకి వచ్చింది. రాష్ట్రంలో రికవరీ రేటు 98.81 శాతం నమోదవుతోంది. నగరంలో తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణ ప్రాంతాలలో నాలుగు దిక్కులా టిమ్స్ తరహాలో అన్ని వసతులతో ఆసుపత్రులు నిర్మించేందుకు కార్యాచరణ ప్రారంభించారు. ఇప్పటికే గడ్డి అన్నారం మార్కెట్‌ను తరలించి అక్కడ ఆసుపత్రి నిర్మించేందుకు చర్యలు ప్రారంభించగా, ఇతర ప్రాంతాలలో త్వరలోనే పనులు ప్రారంభం కానున్నాయి.పేదలకు వైద్య సౌకర్యాలు పెంచే ఉద్ధేశంతో జిహెచ్‌ఎంసి పరిధిలో ఇప్పటికే 224 బస్తీ దావఖానాలు ప్రారంభం కాగా, త్వరలో వాటికి 350కి పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. గ్రామాలలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్ధేశంతో త్వరలోనే పల్లె దావఖానాలకు శ్రీకారం చుట్టనున్నారు.

అందరికీ టీకా లక్షంగా కార్యాచరణ

కరోనా కష్టాన్ని అడ్డుకునే లక్ష్యంతో ఈ ఏడాది జనవరి నుంచి దేశవ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సినేషన్ అందుబాటులోకి వచ్చింది. మొదటి విడతలో వైరస్ సోకే ప్రమాదం ఎక్కువ ఉన్నవారికి వ్యాక్సినేషన్ ఇచ్చి, ఆ తర్వాత 18 ఏళ్లు పై బడిన వారికి టీకాలను పంపిణీ చేసి రికార్డు సృష్టించింది. జనాభా ప్రాతిపదికన చూసినా ఇతర రాష్ట్రాలతో పోలిస్తే రాష్ట్ర ప్రభుత్వం మెరుగ్గా టీకాలు అందించింది. రాష్ట్రంలో ప్రణాళికాబద్ధంగా వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. రాష్ట్రంలో ఇప్పటికే 3 కోట్ల వ్యాక్సినేషన్ మార్కును దాటింది. డిసెంబర్ నాటికి ప్రతి ఒక్కరికీ టీకా అందించాలన్న లక్షంతో వైద్య ఆరోగ్య శాఖ ముందుకు సాగుతోంది.

ముందు జాగ్రత్తగా చిన్నారుల కోసం పడకల ఏర్పాటు

థర్డ్ వేవ్‌లో పిల్లలపై ఎక్కువగా ప్రభావం ఉంటుందన్న వార్తల నేపథ్యంలో ముందు జాగ్రత్తగా రాష్ట్రంలో పిల్లల కోసం ప్రత్యేకంగా 3,200 పడకలను సిద్ధం చేశారు. నీలోఫర్ ఆసుపత్రితోపాటు జిల్లా ఆసుపత్రుల్లో పిల్లల కోసం ప్రత్యేకంగా బెడ్లు సిద్ధంగా ఉంచారు.

డిసెంబర్ చివరి వరకు అప్రమత్తంగా ఉండాలి : ఆరోగ్య శాఖ

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రజలను అప్రమత్తం చేసింది. కరోనా విషయంలో ఏ మాత్రం అజాగ్రత్త ఉండటం మంచిది కాదని హెచ్చరిస్తోంది. పెళ్లిళ్లు, పండుగల నేపథ్యంలో డిసెంబర్ ముగిసే వరకు కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. పండుగలు, విందులు, షాపింగ్ సమయంలో భౌతికదూరం పాటిస్తూ, ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్ ధరించాలని పేర్కొంది. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పండుగలు చేసుకోవాలని సూచించింది. మహమ్మారిపై పూర్తిగా విజయం సాధించాలంటే ప్రభుత్వం, వైద్య ఆరోగ్య శాఖతోపాటు ప్రజలు కూడా భాగస్వామ్యం కావాలని వైద్య ఆరోగ్య శాఖ విజ్ఞప్తి చేస్తోంది. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరిస్తూ, భౌతికదూరం పాటిస్తే చాలా వరకు కొవిడ్‌ను జయించగలుగుతామని తెలిపింది. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలలు పండుగల సీజన్ కావడం వల్ల ప్రజలంతా కొవిడ్ నిబంధనలు పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News