Friday, November 22, 2024

క్లాస్‌రూముల్లో కరోనా!

- Advertisement -
- Advertisement -

Corona cases are on rise in educational institutions

విద్యా సంస్థల్లో కొవిడ్ నిబంధనలు గాలికి!
కేసులు పెరుగుతుండటంతో ఆందోళనలో తల్లిదండ్రులు
చిన్నారులను బడికి పంపేందుకు భయపడుతున్న పరిస్థితి
మొన్న నాగోలో మైనార్టీ స్కూల్ , నిన్న కూకట్‌పల్లిలోని ప్రైవేటు కళాశాల
తాజాగా రాజేంద్రనగర్ ఎస్టీ వసతి గృహంలో 22 మంది విద్యార్థులకు పాజిటివ్

హైదరాబాద్: గ్రేటర్ నగరంలో కరోనా వైరస్ మరోసారి విజృంభించి గత కొన్ని రోజుల నుంచి పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుంది. గడిచిన మాసంలో రోజుకు 20లోపు కేసులు నమోదు కాగా, వారం రోజుల నుంచి రోజుకు 35కు పైగా కేసులు బయటపడుతూ వైరస్ ఉనికి చాటుతుంది. తాజాగా విద్యాసంస్థలపై వైరస్ బుసలు కొడుతూ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతుంది. వైరస్ రెచ్చిపోతుండటంతో చిన్నారులను స్కూల్‌కు పంపాలంటే తల్లిదండ్రులు భయపడుతున్నారు. మూడు రోజుల కితం నాగోల్‌లోని మైనార్టీ సంక్షేమ పాఠశాల్లో 38 మంది విద్యార్థులు, ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన ప్రధానోపాధ్యాయుడు, మరుసటి రోజు కూకట్‌పల్లిలోని ఓ ప్రైవేటు కళాశాలలకు చెందిన 15 మంది విద్యార్థులు, గురువారం రాజేంద్రనగర్‌లోని ఎస్టీ బాలుర వసతి గృహంలో 22 మంది విద్యార్థులు కరోనా సోకింది. వారితో వార్డెన్, వాచెన్ కూడా పాజిటివ్ నిర్థారణ అయింది. రోజుకురోజుకూ వైరస్ రెక్కలు కట్టుకోవడంతో నగర ప్రజలు ఆందోళనకు గురైతున్నారు.

నగరంలో 182 ప్రభుత్వం, 1146 ప్రైవేటు స్కూలుండగా వాటిలో సుమారు 6.50 లక్షల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. పాఠశాల్లో కొవిడ్ నిబంధనలు పకడ్బందీగా అమలు చేసి తరువాతనే బడులు ప్రారంభించాలని విద్యాశాఖ సూచించడంతో ప్రారంభంలో నిబంధనలు పాటించిన యాజమాన్యాలు పది రోజుల గడిచిన తరువాత విస్మరించి ఫీజుల వేటలో పడ్డారు. కనీసం ప్రధాన ద్వారం వద్ద మాస్కులు, శానిటైజర్, టెంపరేచర్ మిషన్ కూడా అందుబాటులో లేదు. తరగతిలో బెంచీకి ఒక విద్యార్థి చొప్పన కూర్చొబెట్టాలని చెప్పిన, నిర్వహకులు నిర్లక్షం వ్యహరిస్తూ నలుగురు విద్యార్థులను కూర్చొబెట్టి ప్రత్యక్ష పాఠాలు బోధిస్తున్నారు.

అదే విధంగా దగ్గు, జలుబు, జ్వరం లక్షణాలున్న విద్యార్థులను ఐసోలేషన్‌లో గది ఉంచాలని సూచించిన పట్టించుకోకుండా వైరస్ వ్యాపించేలా చేస్తున్నారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కరోనా లక్షణాలు కనిపించిన విద్యార్థులను గుర్తించకుండా, తరగతిలో గుంపులుగా చేర్చి ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కుతున్నారని మండిపడుతున్నారు. ట్రాన్స్‌పోర్టు విషయంలో అధికంగా వసూలు చేయడం తప్ప, విద్యార్థుల మధ్య భౌతికదూరం పాటించడం లేదంటున్నారు. ఫీజుల వసూలపై ఉన్న శ్రద్ధ పిల్లల ఆరోగ్యంపై చూపడం లేదని, మహమ్మారి సోకే వరకు గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేట్ స్కూళ్లలో కొవిడ్ టెస్టులు చేస్తే పాజిటివ్ కేసులు సంఖ్య పెరిగే చాన్స్ ఉందని, ఉన్నతాధికారులు పాఠశాలలను పర్యవేక్షిస్తే వారి అసలు రంగు బయటపడుతుందని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News