ఒకేరోజు 4270 కేసులు, 15మంది మృత్యువాత
మహారాష్ట్ర, కేరళలో కొనసాగుతున్న వైరస్ ఉధృతి నాలుగో దశకు సంకేతమా?
మన తెలంగాణ/హైదరాబాద్ : దేశంలో కరోనా కేసులు మరోసారి పెరుగుతున్నాయి. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు 4,270 మంది వైరస్ బారినపడ్డారు. ఒక్కరోజే 15మంది చనిపోయారు. శనివారం 2,619 మందికిపై గా ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సం ఖ్య 98.73 శాతం వద్ద స్థిరంగా ఉంది. మృతుల సంఖ్య 1.22 శాతంగా ఉంది. దేశంలో 34 రోజుల తర్వాత రో జువారీ కొవిడ్ పాజిటివిటీ రేటు 1 శాతం కంటే ఎక్కువగా నమోదైంది. ప్రస్తుతం దేశంలో మొత్తం కరోనా కేసులు 4,31, 76,817 లకు చేరుకోగా, కోలుకున్నవారి సంఖ్య 4,26,28,073కి చేరింది. దేశవ్యాప్తంగా కేసులు భారీగా పెరగడంతో ప్రజలు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. కొవిడ్ కేసు లు పెరుగుదల ఫోర్త్ వేవ్‌కు సంకేతమా? అనే భయాందోళన ఇక దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కొవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి.
కేరళలో శనివారం ఒక్కరోజే 1,544 కేసు లు నమోదు కాగా, మహారాష్ట్రలో వరుసగా మూడోరోజు వెయ్యికిపైగా కొత్త కే సులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో జూన్ నెల ప్రారంభం నుంచి రోజుకు వెయ్యికిపైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. శనివారం 1,357 కొత్త కేసులు నమోదు కాగా, ఒకరు వైరస్‌తో మృతి చెందారు. మూడు నెలల తర్వాత ఇంత మొత్తంలో కొత్త కేసులు రికార్డవడం ఇదే తొలిసారి. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మహారాష్ట్ర సర్కారు అప్రమత్తమై, వైరస్‌ను అరికట్టేందుకు చర్యలు చేపట్టింది. అయి తే, కరోనా కేసులు పెరుగుతున్నా.. మరణాల రేటు ఎక్కువగా లేనందున ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని మహారాష్ట్ర మంత్రి ఆదిత్య థాకరే ఆదివారం పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, బహిరంగ ప్రదేశాల్లో ముఖానికి మాస్క్‌ను తప్పనిసరి చేస్తూ మూడు రోజుల క్రితం మహారాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.బస్సులు, రైళ్లు, సినిమా హాళ్లు, ఆడిటోరియంలు, ఆసుపత్రులు, కళాశాలలు, పాఠశాలలతో పాటు రద్దీగా ఉండే ప్రాంతాల్లో మాస్క్‌లు ధరించడం తప్పనిసరి చేసింది.
ప్రస్తుతం కేసులు ముంబై, థానే, రాయ్‌గఢ్, పాల్ఘర్‌తో సహా పలు జిల్లాల్లోనే కేసులు ఎక్కువగా ఉన్నాయని ఆరోగ్యమంత్రి రాజేశ్ తోపే ఇటీవల తెలిపారు. కేసుల పెరుగుదల నేపథ్యంలో కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ మహారాష్ట్రతో పాటు పలు రాష్ట్రాలకు లేఖ రాశారు. కొవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు అవసరమైతే ముందు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇదిలా ఉండగా.. మహారాష్ట్రలో ఇవాళ పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు కొవిడ్ బారినపడ్డారు. మాజీ సిఎం దేవేంద్ర ఫడ్నవీస్ కరోనా బారినపడ్డారు. అలాగే బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్, కత్రినా కైఫ్, కార్తీక్ ఆర్యన్‌లతో సహా పలువురు సినీతారలకు వైరస్ సోకింది.
ప్రపంచదేశాల్లో కొవిడ్ కేసులు ఇలా…
ప్రపంచదేశాల్లో కొత్తగా 402,317 మంది వైరస్ బారినపడ్డారు. 756 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 535,040,554కు చేరింది. మరణాల సంఖ్య 6,319,796కు చేరింది. ఒక్కరోజే 3,65,521 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 505,791,706గా ఉంది. ఉత్తర కొరియాలో మళ్లీ రికార్డు స్థాయిలో 79 వేలకుపైగా కేసులు నమోదు కాగా, తైవాన్‌లో శనివారం 68,151 మంది మహమ్మారి బారినపడ్డారు. 152 మంది మరణించారు. అలాగే అమెరికాలో శనివారం 46,180 కొత్త కేసులు, 96 మరణాలు నమోదయ్యాయి. జర్మనీలో మరో 29,014 మంది కొవిడ్ బారినపడ్డారు. ఒక్కరోజు 47 మంది చనిపోయారు. ఆస్ట్రేలియాలో 27,234 మందికి వైరస్‌కు సోకింది.
అప్రమత్తమమైన రాష్ట్ర ప్రభుత్వం
పలు దేశాలతో పాటు మనదేశంలోని పలు రాష్ట్రాలలో కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కొవిడ్ పరిస్థితులపై మంత్రి హరీశ్‌రావు సమీక్ష నిర్వహించి వైరస్‌ను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై వైద్యులు, అధికారులు, సిబ్బందికి దిశానిర్ధేశం చేశారు. తెలంగాణలో కొవిడ్ ప్రభావం అంతగా లేనప్పటికీ జాగ్రత్తలు పాటించాలని మంత్రి సూచించారు. కొవిడ్ కేసులు పెరిగినా ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సిద్ధంగా ఉందని భరోసా ఇచ్చారు. పీహెచ్‌సీలు, బస్తీ దవాఖానాలు సహా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు, చికిత్స, వ్యాక్సినేషన్ పక్కాగా, ఉచితంగా జరిగేలా వైద్య ఆరోగ్య సిబ్బంది పనిచేయాలని ఆదేశించారు.
రాష్ట్రంలో కొత్తగా 63 కొవిడ్ కేసులు
రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 8,392 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా…63 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో మొత్తంగా ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 7,93,607కు చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. తాజాగా కరోనా నుంచి 47 మంది కోలుకోగా, ఇప్పటివరకు 7,88,933 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో రికవరీ రేటు 99.41 శాతంగా నమోదైంది. మరో 181 మంది ఫలితాలు రావాల్సి ఉంది.