మలాజిగిరి, రంగారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, జనగామ, సంగారెడ్డి, కరీంనగర్, వరంగల్ అర్బన్‌లలో అత్యధికం మిగతా జిల్లాల్లో స్వల్పం
ప్రత్యేక ప్రణాళికలతో అదుపు చేయడానికి ప్రభుత్వ వ్యూహం
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా తీవ్రత అత్యధికంగా ఉన్న ‘8’ జిల్లాలపై వైద్యశాఖ దృష్టిసారించింది. కేసులు పెరుగుతున్న తీరు, వ్యాప్తిని అంచనా వేస్తుంది. అంతేగాక వైరస్‌ను వేగంగా కట్టడి చేయాలనే లక్షంతో ముందుకు సాగుతుంది. వాస్తవానికి మొదటి దశలో జిహెచ్ఎంసి పరిధిలో తీవ్రత అధికంగా ఉండగా, ఈ సారి జిల్లాల్లో వ్యాప్తి భారీ స్థాయిలో ఉంది. దీంతో ఆయా జిల్లాల్లో కరోనాను కంట్రోల్ చేసేందుకు అధికారులు తీవ్ర కసరత్తులు చేస్తున్నారు. ముఖ్యంగా గత వారం రోజులుగా మల్కాజ్గిరి, రంగారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, జనగామ, సంగారెడ్డి, కరీంనగర్, వరంగల్ అర్బన్ జిల్లాల్లో తీవ్రత అత్యధికంగా ఉండగా, మిగతా జిల్లాల్లో మాత్రం అతి స్పల్పంగా కేసులు తేలుతున్నాయి. ఈ క్రమంలో వ్యాప్తి కొనసాగుతున్న జిల్లాల్లో వైరస్‌ను అదుపులోకి తేవాలని అధికారులు ప్రత్యేక ప్రణాళికలు యోచిస్తున్నారు. దీనిలో భాగంగా డిఎంహెచ్ఓ, మెడికల్ ఆఫీసర్లు ఆధ్వర్యంలో ప్రత్యేక టీంను ఏర్పాటు చేయాలని వైద్యశాఖ ఉన్నతాధికారులు సూచించారు. ఈ టీంకి అనుసంధానంగా గతంలో గ్రామాల్లో ఫీవర్ సర్వే నిర్వహించిన బృందం పనిచేయనుంది.
ఈ బృందాలు పాజిటివ్ తేలిన ప్రాంతాన్ని, వ్యక్తులను ప్రతి రోజూ పరిశీలించి వైరస్ నియంత్రణ చర్యలను చేపట్టనున్నారు. అవసరమైతే ఐదు నుంచి పది కేసులు కంటే అధికంగా ఉన్న ప్రాంతాలను మైక్రో కంటైన్మెంట్లుగా విభజించి వారం రోజుల పాటు రాకపోకలు బంద్ చేయాలని వైద్యశాఖ ఆలోచిస్తుంది. దీంతో పాటు వ్యాప్తి అధికంగా ఉన్న ప్రాంతాల్లో చెక్ పాయింట్లను మళ్లీ పెట్టాలని ప్రజల నుంచి వినతులు వస్తున్నట్లు వైద్యశాఖ ఉన్నతాధికారుల్లో ఒకరు చెప్పారు. దీనిపై మరోసారి రివ్యూ నిర్వహించి చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. అదే విధంగా ప్రతి రోజు చేసే టెస్టింగ్ కంటే అదనంగా నాలుగు రెట్లు పరీక్షలను పెంచాలని ఇప్పటికే జిల్లా వైద్యాధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. అవసరమైతే కేసులు తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఆర్టిపిసిఆర్ మొబైల్ వాహనాన్ని కూడా పంపేందుకు అధికారులు సంసిద్ధమవుతున్నారు. మరో రెండు నెలల వరకు ఈ కార్యక్రమాలు కొనసాగుతాయని అధికారులు అంటున్నారు. అయితే వైరస్ తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లోని పరిస్థితులపై ఎప్పటికప్పుడు తనకు రిపోర్టు ఇవ్వాలని హెల్త్ డైరెక్టర్ డా జి శ్రీనివాసరావు జిల్లా స్థాయి ఆఫీసర్లను కోరారు.
వారం రోజులుగా విజృంభణ….
గడిచిన వారం రోజులుగా జిల్లాల్లో కేసులు విజృంభిస్తున్నాయి. ఈనెల 1వ తేది నుంచి 7 వరకు మేడ్చల్ మల్కాజ్‌గిరిలో అత్యధికంగా 1088 నమోదు కాగా, రంగారెడ్డిలో 909, నిజామాబాద్‌లో 802, నిర్మల్‌లో 474, జగిత్యాలలో 380, సంగారెడ్డిలో 346, కరీంనగర్లో 345, వరంగల్ అర్బన్‌లో 313 కేసులు రికార్డు అయ్యాయి. దీంతో ఈ జిల్లాల్లో కరోనా కట్టడి చేయాలని వైద్యశాఖ పకడ్బందీ ప్రణాళికతో ముందుకు వెళ్తుందని హెల్త్ డైరెక్టర్ స్పష్టం చేశారు.
ఆ జిల్లాల్లో వ్యాప్తి ఎందుకు..?
రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలు ఉండగా ఆ 8 జిల్లాల్లో అధిక వ్యాప్తి ఎందుకు జరుగుతోంది? అనే అంశంపై వైద్యశాఖ ప్రాథమిక నివేదికను తయారు చేసింది. దీని ప్రకారం ఆ జిల్లాల్లో సుమారు 40 శాతం మంది ప్రజలకు ఇప్పటికీ వైరస్ పై అవగాహన లేదని, మరో 30 శాతం మంది తమకు ఏం కాదులే అనే భావనతో ఉన్నారని, మరో 20 శాతం మంది మాస్కు, భౌతిక దూరం వంటివి పాటించడం లేదని వైద్యశాఖ అంచనా వేసింది. అంతేగాక మరో 10 శాతం మంది హైదరాబాద్‌కు నిత్యం రాకపోకలు చేసేక్రమంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో వ్యాప్తికి దారితీసినట్లు ఆరోగ్యశాఖ నివేదిక రూపొందించింది. అయితే నిజామాబాద్, నిర్మల్, కరీంనగర్లో మహరాష్ట్ర వ్యాప్తి అధికంగా ఉండగా, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో యూకే స్ట్రెయిన్ వ్యాప్తి చెందుతుందనే అనుమానాన్ని అధికారులు వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు కరోనా నియంత్రణ కోసం ప్రభుత్వం, వైద్యశాఖ ప్రత్యేక వ్యూహాలతో వెళ్తుంటే కొంత మంది నిర్లక్ష వైఖరి వహించడంపై అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే రాబోయే రోజుల్లో పరిస్థితి ఛే జారిపోతుందని వైద్యశాఖ హెచ్చరిస్తుంది.
ఏప్రిల్ 1 నుంచి 7వ తేది వరకు అత్యధికంగా నమోదైన జిల్లాలు..
జిల్లా కేసులు సంఖ్య
మల్కాజ్గిరి 1088
రంగారెడ్డి 909
నిజామాబాద్ 802
నిర్మల్ 474
జనగామ 380
సంగారెడ్డి 346
కరీంనగర్ 345
వరంగల్ అర్బన్ 313
Corona Cases increased in 8 Districts of Telangana