Friday, November 15, 2024

ఫిబ్రవరిలో కొవిడ్ కేసులు తీవ్రస్థాయికి చేరవచ్చు…

- Advertisement -
- Advertisement -

Covid second wave ends in Telangana:Dr Srinivasa rao

జనవరి 15 తర్వాత కొవిడ్ కేసులు పెరిగే అవకాశం
ఫిబ్రవరిలో తీవ్రస్థాయికి చేరవచ్చు
ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు
అప్రమత్తంగా ఉంటూ జాగ్రత్తలు పాటించాలి
కొవిడ్ నియంత్రణలో ప్రజల భాగస్వామ్యం ముఖ్యం
కొవిడ్ కేసులు దాస్తున్నామన్న వార్తలో వాస్తవం లేదు
రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు
మనతెలంగాణ/హైదరాబాద్: జనవరి 15 తర్వాత కొవిడ్ కేసులు పెరిగే అవకాశం ఉందని, ఫిబ్రవరిలో తీవ్రస్థాయికి చేరవచ్చని రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. అయితే ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు… అప్రమత్తంగా ఉండాలని అన్నారు. కరోనా మూడో దశను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధంగా ఉందని చెప్పారు. ఒమిక్రాన్ కేసుల దృష్ట్యా వ్యాక్సినేషన్ వేగవంతం చేశామని తెలిపారు. కొవిడ్ నియంత్రణలో ప్రజల భాగస్వామ్యం ముఖ్యమని, ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. అందరూ విధిగా మాస్క్ ధరించడంతోపాటు వ్యాక్సిన్ వేయించుకోవాలని అన్నారు. కరోనా కొత్త వేరియంట్ భయాందోళనల నేపథ్యంలో ప్రజారోగ్య సంచాలకుల కార్యాలయంలో ఆదివారం డీహెచ్ శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. కొవిడ్ కేసులు దాస్తున్నామన్న వార్తలో వాస్తవం లేదని తెలిపారు. తప్పుడు వార్తలతో వైద్యారోగ్యశాఖ మనోస్థైర్యం తగ్గుతుందని పేర్కొన్నారు.కేసులు దాచడం వల్ల ఎవరికి ప్రయోజనమని ప్రశ్నించారు. కొవిడ్‌పై పోరాటంలో ఆరోగ్య శాఖలో సుమారు 70 మంది ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. సెకండ్ వేవ్ సమయంలో ఆక్సిజన్ అందక ఢిల్లీ, చాలా రాష్ట్రాలలో ఇబ్బందులు పడినా మన రాష్ట్రంలో అలాంటి సమస్య రాకుండా ప్రభుత్వం, వైద్య ఆరోగ్య శాఖ చర్యలు చేపట్టిందని గుర్తు చేశారు. అవసరం మేరకు ఆక్సిజన్ దిగుమతి చేసుకుని, సొంతంగా ఆక్సిజన్ ఉత్పత్తి చేసుకునే విధంగా ఏర్పాట్లు చేసుకున్నామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలతో స్వల్ప ఇబ్బందులతో భయటపడ్డామని పేర్కొన్నారు. తప్పుడు వార్తలతో ప్రజల్లో ఆందోళన పెరుగుతుందని, అసత్య ప్రచారం కొవిడ్ కంటే ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. కరోనాను ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కొంటోందని చెప్పారు.
ఒమిక్రాన్‌తో పోరాటానికి సిద్ధంగా ఉన్నాం
ఒమిక్రాన్‌తో పోరాటానికి సిద్ధంగా ఉన్నామని డీహెచ్ శ్రీనివాసరావు పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజలకు అవసరమైన వైద్యం అందించేందుకు వైద్య సదుపాయాలు సమకూర్చుకోవడంతో పాటు సిబ్బంది అన్ని విధాలా సిద్ధంగా ఉన్నారని తెలిపారు. దక్షిణాఫ్రికాలో కొవిడ్ కేసులు పెరుగుతున్నాయని, అక్కడ కరోనా కేసులు 8 నుంచి 16 శాతానికి చేరాయని అన్నారు. వీటిలో 75 శాతం ఒమిక్రాన్ కేసులే ఉన్నాయని చెప్పారు. వ్యాధి తీవ్రత తెలిసేందుకు మరో వారం రోజులు పడుతుందని అన్నారు. కానీ అక్కడ కేసులు పెరిగినా ఆస్పత్రులో చేరికలు, మరణాలు పెరగడం లేదని వివరించారు. . డెల్టా కంటే ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతుందని అన్నారు. ఒమిక్రాస్ సోకిన వారిలో తీవ్ర లక్షణాలు కనిపించడం లేదని చెప్పారు. వైరస్ సోకితే తీవ్ర ఒళ్లునొప్పులు, తలనొప్పి, నీరసం, నిస్సత్తువ వంటి లక్షణాలు కనిపిస్తున్నాయని తెలిపారు. ఇలాంటి లక్షణాలు ఉన్నవాళ్లు వెంటనే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన ఫీవర్ సర్వే దేశానికి ఆదర్శంగా నిలిచిందని, దీనిని నీతి అయోగ్ కూడా ప్రశంసించిందని తెలిపారు. అవసరాన్ని బట్టి మళ్లీ ఫీవర్ సర్వే చేపడతామని వెల్లడించారు.
రాబోయే రోజుల్లో లాక్‌డౌన్‌లు ఉండవు
లాక్‌డౌన్‌ల వల్ల అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని, రాబోయే రోజుల్లో లాక్‌డౌన్‌లు ఉండవని డీహెచ్ స్పష్టం చేశారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ మనల్ని మనం కాపాడుకోవచ్చని సూచించారు. కొవిడ్ నియంత్రణలో ప్రజల భాగస్వామ్యం ముఖ్యమని వ్యాఖ్యానించారు. ఒకటి రెండు నెలల్లో భారత్‌లోనూ కేసులు పెరిగే అవకాశం ఉందని.. ఇప్పటి వరకు దేశంలో 5 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయని అన్నారు. విదేశాల నుంచి వచ్చే వారికి శంషాబాద్ ఎయిర్‌పోర్టులో పరీక్షలు చేస్తున్నామని పేర్కొన్నారు. 900 మందికి పైగా ఇప్పటి వరకు విదేశాల నుంచి రాష్ట్రానికి రాగా, అందులో 13 మందికి కొవిడ్ నిర్ధారణ అయ్యిందని అన్నారు. ఒమికాన్ సోకిందా లేదా అనే విషయం చేరుకోగా ఒకటి రెండు రోజుల్లో తేలుతుందని చెప్పారు.
వ్యాక్సినేషన్ వేగవంతం
ఒమిక్రాన్ కేసుల దృష్ట్యా వ్యాక్సినేషన్ వేగవంతం చేశామని శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్రంలో వ్యాక్సినేషన్ పెరిగిందని, శనివారం ఒక్కరోజే 3.7 లక్షల డోసుల టీకాలు ఇచ్చామని అన్నారు. రాష్ట్రంలో 92 శాతం మందికి మొదటి డోసు పూర్తి కాగా.. 48 శాతం మందికి రెండు డోసులు పూర్తయ్యాయని తెలిపారు. ఇప్పటివరకు మొదటి డోసు టీకా తీసుకోని వారు వెంటనే తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో రెండవ డోసు గడువు ముగిసిన వారు 23 లక్షల మంది ఉన్నారని, వీరంతా వెంటనే సెకండ్ డోసు తీసుకోవాలని సూచించారు. ఈ నెలాఖరు లోపు 100 శాతం వ్యాక్సినేషన్ ఇవ్వాలని నిర్ణయించామని డీహెచ్ చెప్పారు.

Corona Cases likely peak in Feb: Dr Srinivasa rao

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News