మెట్రో నగరాల్లో తగ్గుతున్న కేసులు
వ్యాక్సినేషన్ కారణంగా తగ్గిన థర్డ్ వేవ్ ప్రభావం
కేంద్ర ప్రభుత్వ వర్గాల అంచనా
న్యూఢిల్లీ: భారత్‌లో ప్రస్తుతం థర్డ్ వేవ్ ఉధృతి కొనసాగుతున్న విషయం తెలిసిందే. గత కొద్ది రోజులుగా ప్రతి రోజూ మూడు లక్షలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. అయితే మూడు రోజులుగా వాటిలో కాస్త తగ్గుదల కనిపిస్తోంది. ఈ క్రమంలో ప్రభుత్వ వర్గాలు ఊరటనిచ్చే మాట చెప్పాయి. ఫిబ్రవరి 15 నాటికి కొవిడ్ కేసులు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని వెల్లడించాయి. అలాగే టీకా కార్యక్రమం మూడో వేవ్ ప్రభావాన్ని బాగా తగ్గించిందని పేర్కొన్నాయి. ‘ఫిబ్రవరి 15 నాటికి కొవిడ్ కేసులు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. కొన్ని రాష్ట్రాలు, మెట్రో నగరాల్లో కేసులుతగ్గడం, స్థిరంగా ఉండడం ప్రారంభమైంది’ అని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. కేంద్రం వెల్లడించిన గణాంకాల ప్రకారం సోమవారం( జనవరి 24న) 3,06,064 కేసులు వెలుగు చూశాయి. ఆదివారం 3.33 లక్షలు, శనివారం 3.37 లక్షలు, శుక్రవారం 3.47 లక్షల కేసులు నమోదయ్యాయి. మూడు రోజులుగా కేసుల్లో తగ్గుదల కనిపిస్తోంది. మరో వైపు ముంబయి, ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై నగరాల్లో కేసులు తగ్గుతున్నాయి. ఉదాహరణకు ఢిల్లీలో సోమవారం 9,197 కేసులు వెలుగు చూశాయి.
అంతకు ముందు రోజు నమోదయిన 11,486 కేసులతో పోలిస్తే 11 శాతం తక్కువ నమోదయ్యాయి. అలాగే పాజిటివిటీ రేటు సైతం ఒక దశలో కొద్ది రోజుల క్రితం 30 శాతంకు పైగా ఉండగా ఇప్పుడది 13.3 శాతానికి తగ్గింది. అలాగే ముంబయిలో తాజాగా 2,550 కొత్త కేసులు నమోదయ్యాయి. కొద్ది రోజుల క్రితం వరకు నగరంలో రోజూ 10 వేలకు పైగా కేసులు వస్తుండేవి.
మరో పక్క దేశంలో అర్హులైన వయోజనుల్లో 74శాతం రెండు డోసుల టీకా తీసుకున్నారు. అలాగే 15నుంచి 18 ఏళ వయసున్న టీనేజర్లకు టీకా తొలి డోసు ఇస్తున్నారు. 60 ఏళ్లు దాటి ఇతర అనారోగ్యాలతో బాధపడే వారు, ఫ్రంట్‌లైన్ సిబ్బంది, వైద్య సిబ్బందికి ప్రికాషనరీ డోసు ఇవ్వడం వంటి చర్యలు థర్డ్ వేవ్ తీవ్రతను తగ్గించిందని నిపుణులు చెబుతున్నారు. మరో వైపు థర్డ్ వేవ్‌కు కారణమైన ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా రానున్న వారాల్లో కేసుల సంఖ్య భారీగా పెరిగే అవకాశముందని ఇప్పటికే నిపుణులు హెచ్చరించారు. అలాగే ప్రధాన నగరాల్లో కేసులు తగ్గుతున్నా ఆస్పత్రుల్లో చేరికలు పెరుగుతున్నాయన్నారు.ప్రస్తుతం కొత్త కేసుల్లో పెరుగుదల కనిపించనప్పటికీ ఏ మాత్రం అజాగ్రత్త వద్దని హెచ్చరిస్తున్నారు.
మూడో రోజూ స్వల్పంగా తగ్గిన కొత్త కేసులు
మరో వైపు దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతూ ఉంది. కొద్ది రోజులుగా 3 లక్షలకు పైగానే కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఆదివారం 14 లక్షల మందికి వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 3,06,064 మందికి వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ముందు రోజుకంటే 27 వేల కేసులు తగ్గాయి. అయితే వాధి నిర్ధారణ పరీక్షలు తగ్గడం దీనికి కొంత కారణం. మరో వైపు పాజిటివిటీ రేటు 17..3 శాతంనుంచి 20.75 శాతానికి పెరగడం ఆందోళనకరంగా మారింది. అంటే పరీక్షలకోసం వచ్చే ప్రతి అయిదు మందిలో ఒకరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అవుతోందన్న మాట. ఒక్క కర్నాటకలోనే 50 వేలకు పైగా కేసులు వచ్చాయి. కేరళ, మహారాష్ట్ర, తమిళనాడులో కూడా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది.
గడచిన 24 గంటల వ్యవధిలో439 మంది ప్రాణాలు కోల్పోయారు. గడచిన రెండేళ్ల కాలంలో 3.95 కోట్ల మందికి వైరస్ సోకగా, 4.89 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. మరో వైపు వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుండడంతో యాక్టివ్ కేసులు 22 లక్షలకు చేరుకున్నాయి.241 రోజుల తర్వాత యాక్టివ్ కేసులు ఈ స్థాయికి చేరడం ఇదే మొదటి సారి. నిన్న ఒక్క రోజే 2,43,495 మంది కొవిడ్‌నుంచి కోలుకున్నారు. ఇదిలా ఉండగా, ఆదివారం సెలవు రోజు కావడంతో కేవలం 26 లక్షల మందికి మాత్రమే టీకా అందింది. దీంతో ఇప్పటివరకు 162 కోట్లకు పైగా టీకా డోసులు పంపిణీ అయ్యాయి.