పూజారికి పాజిటివ్‌గా నిర్ధారణ
బాసర : నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంతో పాటు ప్రముఖ పుణ్యక్షేత్రం చదువుల తల్లి శ్రీజ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో కరోనా కలకలం సృష్టిస్తోంది. గతంలో బాసర ట్రిపుల్ ఐటీ కళాశాలలో ఇద్దరికి, స్థానిక బిసి వసతి గృహంలో ఒకరికి పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. కాగా తాజాగా బాసర ఆలయంలో ఓ పూజారికి బుధవారం పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు బాసర ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది తెలిపారు. దీంతో బాసర ఆలయ సిబ్బందిలో తీవ్ర కలకలం రేపుతోంది. ఇప్పటికే గ్రామస్తుల ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించే వార సంతను కొన్ని రోజుల పాటు రద్దు చేశారు. కరోనా మహమ్మారి జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.
మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతానికి 12 కిలో మీటర్ల దూరంలో బాసర వుండడం, దానితో పాటు ప్రస్తుతం మహారాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో సరిహద్దులలో అధికారులు ప్రత్యేక నిఘా పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మహారాష్ట్రలో గల ధర్మాబాద్ నుండి ఆటోలో, ఇతర వాహనాల ద్వారా బాసర, ముథోల్, భైంసాలకు రాకపోకలు రద్దుతో కరోనా వ్యాప్తి చెందకుండా ఆపవచ్చని వైద్యాధికారులు అంటున్నారు. దీంతో ఆలయానికి సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఎవరు ఎలా ఉంటారో తెలియదు కావున ఆలయంలో ప్రతి ప్రవేశం వద్ద శానిటైజర్‌తో పాటు, థర్మల్ మీటర్ స్క్రినింగ్, ఘన్ శాట్ అదేవిధంగా ప్రజలు తమ తమ ఇంట్లో హైపోక్లోరైట్ వేసి శుభ్రపరుచుకోవాలని వైద్యులు చెబుతున్నారు. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా విధిగా మాస్కు ధరించాలని, సామాజిక దూరం పాటించాలని దీనితో ఆలయంలో హైపోక్లోరైట్‌తో పిచికారి చేసి ఆలయంతో పాటు క్యూలైన్లలో వాగ్దేవి సొసైటి సభ్యులు శుభ్రపరిచారు.