Saturday, November 23, 2024

మూడో ప్రపంచ యుద్ధాన్ని ఆపలేమా?

- Advertisement -
- Advertisement -

Corona deaths were not fully controlled

 

అదేంటి ఇప్పటి వరకు జరిగినవి రెండు ప్రపంచ యుద్ధాలే కదా… ఈ మూడో ప్రపంచ యుద్ధం ఎప్పుడు మొదలయ్యింది అని అనుకుంటున్నారా… అవును ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ప్రబలిన కరోనా మహమ్మారి వల్ల జరిగిన నష్టాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఈ ఉదంతం ఇప్పటి వరకు జరిగిన రెండు ప్రపంచ యుద్ధాల తరువాత మూడవ ప్రపంచ యుద్ధం లాగే గోచరిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు సంభవించిన కరోనా మరణాలు ఇరవై ఆరు లక్షలకు పైగానే ఉన్నాయి. టీకా వచ్చినా కూడా కరోనా మరణాలు పూర్తిగా అదుపులోకి రాలేదు. ఇది ఇప్పట్లో ఆగేలా కూడా లేదు. టీకా వంద శాతం రక్షణ ఇస్తుందా అనేది ఇంకా పూర్తిస్థాయిలో అంచనా వేయలేకపోతున్నారు. ఒకసారి టీకా తీసుకుంటే ఎంతకాలం పాటు రక్షణ ఇస్తుంది అనే విషయంపై కూడా స్పష్టత లేదు.

ప్రపంచాన్ని భయం గుప్పిట్లోకి నెట్టి ఇంత భారీ నష్టాన్ని కలిగిస్తున్న ఈ మహమ్మారి పుట్టుక విస్తరణ కేవలం ప్రమాదవశాత్తుగా జరిగిన సంఘటనా? లేక సామ్రాజ్య విస్తరణ కాంక్షతో అంతర్గతంగా జరుగుతున్న జీవాయుధ పోటీలో ఒక భాగమా? అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. అసలింత వరకు జరిగిన రెండు ప్రపంచ యుద్ధాలకు బీజం వేసిన అంశాలు ఏమిటని ఒక్కసారి గనక తరచి చూస్తే.. ప్రపంచాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలని, అన్ని దేశాలు తమ చెప్పుచేతల్లో ఉండాలని, అదే విధంగా తాము తయారు చేసిన అధునాతన యుద్ధ సామాగ్రిని అమ్ముకోవాలంటే వివిధ దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగించాలనే కొన్ని అగ్ర దేశాల ఆలోచనలే ప్రపంచ దేశాల మధ్య అశాంతికి ఆజ్యం పోస్తున్నాయి.

ఐరోపాలోని రెండు దేశాల మధ్య మొదలైన శత్రుత్వం దావానలంలా అన్ని దేశాలనంటుకొని మొదటి ప్రపంచ యుద్ధానికి దారి తీసింది. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో చాలా దేశాలు యుద్ధంలో పాలు పంచుకోవడం జరిగింది. ఇది 1914 జులై నుండి ప్రారంభమై 1918 నవంబర్ వరకు అంటే నాలుగు సంవత్సరాలకు పైగా నడిచింది. అంతేకాకుండా 90 లక్షల మంది సైనికులతో పాటు, 70 లక్షల మంది ప్రజలు అనగా దాదాపు ఒక కోటి 60 లక్షల మంది ప్రాణాలను బలిగొంది ఆ మొదటి ప్రపంచ యుద్ధం. లక్షలాది మంది క్షతగాత్రులు కాగా, ఇంకా కొన్ని లక్షల మంది జాడ తెలియకుండా పోయారు. చివరకు అనేక శాంతి ఒప్పందాలతో పాటు, భవిష్యత్ యుద్ధాలను నివారించడానికి 1919 లో ‘నానాజాతి సమితి’ ఏర్పాటుతో మొదటి ప్రపంచ యుద్ధానికి తెర పడింది. అయినప్పటికీ యుద్ధం వలన సంభవించిన నష్టాలతో ఒక దశాబ్ద కాలం పాటు ప్రపంచ దేశాలు తల్లడిల్లాయి. ఆర్థికంగా కృంగిపోవడంతోపాటు, తీవ్ర జన నష్టం, వికలాంగులుగా మారిన లక్షలాది మందిని ప్రభుత్వాలు పోషించాల్సి రావడం, కరువు కాటకాలు అన్నీ కూడా ప్రపంచ దేశాల అభివృద్ధిని దెబ్బతీశాయి.

యుద్ధాలను నివారించడానికి నానాజాతి సమితి ఏర్పడిన 20 సంవత్సరాల తర్వాత అంటే 1939లో రెండవ ప్రపంచ యుద్ధం మొదలయ్యింది. నానాజాతి సమితి దీన్ని ఆపలేకపోయింది. ఇది 1945 వరకు అనగా ఏడు సంవత్సరాల పాటు సుదీర్ఘంగా నడిచింది. దీనికి కారణాలు రెండు. ఒకటి చైనా, జపాన్ రెండవ యుద్ధం కాగా, రెండవది జర్మనీ – పోలాండ్ పై దురాక్రమణ. చైనా – జపాన్ యుద్ధంలో ఆసియా దేశాలు పాల్గొనగా, జర్మనీ దురాక్రమణ ఉదంతంలో ఐరోపా దేశాలు పాల్గొన్నాయి. ఆ తర్వాత ప్రపంచ దేశాలన్నింటినీ కూడా ఇది చుట్టుముట్టింది. ప్రపంచ చరిత్రలోనే ఇది అత్యంత రక్తసిక్తమైన ఘట్టం. సైనికులు, ప్రజలు కలిసి దాదాపు ఆరున్నర కోట్ల మంది ఈ యుద్ధంలో మరణించారు. రెండవ ప్రపంచ యుద్ధానంతరం మళ్లీ అటువంటి యుద్ధం రాకుండా నివారించడానికి ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేయబడింది.

ఇక ఇప్పుడు రానున్న కాలంలో యుద్ధమంటూ వస్తే అది జీవాయుధాలదే అని పరిశీలకులు భావిస్తున్నారు. వివిధ దేశాలు తమ తమ స్థాయిల్లో బయట ప్రపంచానికి తెలియకుండా జీవాయుధాల తయారీలో పరిశోధనలు చేస్తున్నాయనే వాదనలు వినబడుతున్నాయి. ఇప్పటి కరోనా ఉదంతం కూడా ఇటువంటి ఊహాగానాలకు ఊతమిస్తున్నది. 2019 లో చైనాలో బయటపడ్డ కరోనా క్రమక్రమంగా అన్ని దేశాలకు పాకి 2020లో మానవాళి మనుగడకే ఒక ప్రశ్నగా మారింది. క్షణక్షణం భయం భయంగా, దినమొక గండంగా పరిణమించిన ఈ వైరస్ ప్రస్థానం ఇంకా సాగుతూనే ఉంది. జనజీవనం స్తంభించిపోయింది. ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. దాని ఉధృతి కాస్త తగ్గి ఇలా ఊపిరి పీల్చుకుంటున్నారో లేదో మళ్లీ రెండవ విడత విజృంభణ మొదలయ్యింది. మన దేశంలో కూడా కొన్ని రాష్ట్రాల్లో ముఖ్యంగా మహారాష్ట్రలో దీని ప్రభావం మరీ ఎక్కువగా కనబడుతోంది. మరణాల సంఖ్య కూడా పెరుగుతున్నది.

ఈ కరోనా ప్రళయం ఇప్పటి వరకు కలిగించిన నష్టం అంతా ఇంతా కాదు. కేవలం మరణాలు మాత్రమే కాకుండా అన్ని రంగాలపై దీని ప్రభావం పడింది. అన్ని దేశాల ఆర్థిక మూలాలు దెబ్బతిన్నాయి. వ్యాపార, వాణిజ్య రంగాలు కుదేలయ్యాయి. పర్యాటక రంగాలు తీవ్రంగా నష్టపోయాయి. చాలా పరిశ్రమలు, కంపెనీలు మూతపడ్డాయి. లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఇంకా లక్షలాది మంది ఉపాధి అవకాశాలు కోల్పోయి రోడ్డున పడ్డారు. విమానయాన రంగాలు తీవ్ర సంక్షోభంలో కూరుకు పోయాయి. అన్ని దేశాల స్టాక్ మార్కెట్లు నష్టాలను చవిచూస్తున్నాయి. దాంతో లక్షల, కోట్ల మదుపరుల సంపద ఆవిరైపోతున్నది. దీని వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇప్పటి వరకు రూ. 400 లక్షల కోట్లు నష్టపోయినట్లు ఆర్థిక శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

మొత్తానికి చెప్పేదేమిటంటే…. బలవంతుడు బలహీనుణ్ణి, ధనవంతుడు పేదవాన్ని, పలుకుబడి ఉన్నవాడు పలుకుబడి లేనివాణ్ణి దోచుకోవడం అనాదిగా వస్తున్న ఆచారం. అదే విధంగా బలమైన రాజ్యాలు, బలమైన ఆయుధ సంపత్తి ఉన్న దేశాలు పక్క రాజ్యాలు, దేశాలను ఆక్రమించుకోవడం కూడా వందలాది సంవత్సరాలుగా మనం గమనిస్తున్నటువంటి విషయాలు. రెండు భయంకరమైన ప్రపంచ యుద్ధాల తర్వాత అలాంటి మరొక యుద్ధాన్ని రాకుండా నివారించడానికి ఐక్యరాజ్య సమితిని ఏర్పరచిన తరువాత మరొక ప్రపంచ యుద్ధం రానప్పటికీ చాలా చోట్ల దేశాల మధ్య ఉద్రిక్తలు రగులుతూనే ఉన్నాయి. భవిష్యత్తులో యుద్ధమంటూ వస్తే ఎదుర్కోవడానికి అధునాతన సాంకేతికతతో కూడిన పలు రకాల యుద్ధ సామాగ్రిని సమకూర్చుకుంటూనే ఉన్నాయి. ఇంకా సమర్ధవంతమైన కొత్త కొత్త ఆయుధాల తయారీలో నిమగ్నమై ఉన్నాయి. దాని ఫలితమే ఈ కరోనా లాంటి జీవాయుధాలు అని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు.

మానవ పరిణామక్రమంలో.. మొదట్లో మనిషి అవసరాలకు అనుగుణంగా సాగిన పరిశోధనలు, తర్వాత కాలంలో మానవాళి వినాశనం దిశగా సాగడం దురదృష్టకరం. మనిషిలో ఏర్పడిన ఈ దురాశ మరెన్ని వినాశనాలకు, మరెన్ని ఉత్పాతాలకు దారి తీస్తుందో కాలమే సమాధానం చెప్పాలి. మొదటి రెండు యుద్ధాలనుండి కోలుకున్న ప్రపంచ దేశాలు మరొక ప్రపంచ యుద్ధమే గనక వస్తే కోలుకోవడం కల్ల. ఇప్పుడున్న అత్యంత అధునాతన ఆయుధాలను గనక ప్రయోగిస్తే భూమి మీద జీవమనేది సమూలంగా తుడిచి పెట్టుకపోవడం ఖాయం. మరి ఎంతో విజ్ఞాన వంతుడైన నేటి మానవుడు, ఎన్నో అద్భుతాలను సృష్టిస్తున్న ఈనాటి మానవుడు తలుచుకొంటే యుద్ధాలను నివారించలేడా? యుద్ధ భయం వలన కలిగే ఇలాంటి ప్రమాదకరమైన ఆయుధ తయారీని ఆపలేడా? అనేది సామాన్య మానవున్ని తొలుస్తున్న మిలియన్ డాలర్ల ప్రశ్న.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News