న్యూఢిల్లీ: కొవిడ్ ఉధృతి అధికంగా ఉన్న నగరాల్లో ఒకటైన ఢిల్లీలో దాదాపు 1000మంది పోలీసులకు కొవిడ్19 పాజిటివ్ నిర్ధారణ అయిందని (ఢిల్లీ పోలీస్) అదనపు పిఆర్‌ఒ అనిల్‌మిట్టల్ తెలిపారు. బాధితుల్లో అదనపు పోలీస్ కమిషనర్(క్రైంబ్రాంచ్) కూడా ఉన్నారు. వారంతా క్వారంటైన్‌లోకి వెళ్లారని, పూర్తిగా కోలుకున్న తర్వాతే విధుల్లో చేరుతారని తెలిపారు. ఢిల్లీలో పోలీసుల మొత్తం సంఖ్య సుమారు 80,000. పోలీసుల విధి నిర్వహణ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఢిల్లీ పోలీస్ కమిషనర్ రాకేశ్ ఆస్తానా ఇటీవల ప్రామాణిక ఆపరేటింగ్ విధానాన్ని(ఎస్‌ఒపి) జారీ చేశారు. ఎస్‌ఒపి ప్రకారం ఫ్రంట్‌లైన్ వర్కర్లుగా విధులు నిర్వహించే పోలీస్ సిబ్బంది, వారి కుటుంబసభ్యులు టీకాలు తీసుకోవాలి. విధి నిర్వహణ సమయాల్లో మాస్క్ ధరించడం, భౌతిక దూరం, చేతుల శుభ్రత పాటించాలి.
రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు కరోనా
రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు కొవిడ్19 పాజిటివ్ నిర్ధారణ అయింది. దాంతో, తాను హోం క్వారంటైన్‌లో ఉన్నానని రాజ్‌నాథ్ సోమవారం ట్విట్ చేశారు. తనలో స్వల్ప లక్షణాలున్నాయని తెలిపారు. ఇటీవల తనకు సమీపంలోకి వచ్చినవారు ఐసోలేషన్‌కు వెళ్లాలని, పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.