మన తెలంగాణ/వరంగల్ ఎంజిఎం: వరంగల్ మహాత్మా గాంధీ మెమోరియల్ ఆస్పత్రి (ఎంజిఎం)లోని పిల్లల విభాగంలో ముగ్గురు చిన్నారులకు కోవిడ్ సోకినట్లు ఆ స్పత్రి కార్యనిర్వహణ అధికారి డా.చంద్రశేఖర్ తెలిపారు. శనివారం పిల్లల విభాగంలో కొవిడ్ లక్షణాలతో గల ఐదుగురు చిన్నారుల టెస్ట్ నమూనాలను కాకతీయ మెడికల్ కాలేజీలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపగా 8 ఏళ్లలోపు ముగ్గురు చిన్నారులకు పాజిటివ్ నిర్ధారణ అయినట్లు తెలిపారు.
ముగ్గురు పిల్లలను ప్రస్తుతం కోవిడ్ పిల్లల విభాగంలోని ప్రత్యేక ఐసోలేషన్‌లో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయిన పిల్లల తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించి ఎవరెవరిని కలిశారో వారికి కూడా కోవిడ్ టెస్ట్ నమూనాలను కెఎంసి వైరాలజీ ల్యాబ్‌కు పంపిస్తామని తెలిపారు. ప్రస్తుతం ఆసుపత్రిలో మొత్తం ఆరు కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. కోవిడ్ పిల్లల విభాగంలో 20 పడకలతో వెంటిలేటర్ల సౌక ర్యం, పిడియాట్రిక్ స్పెషల్ వైద్య సిబ్బందితో వసతులతో ఏర్పాటు చేశామని, తల్లిదండ్రులు ఎలాంటి భయాందోళనకు గురికావద్దని తెలిపారు.