Thursday, January 16, 2025

మరో విడత కొవిడ్ తప్పదా?

- Advertisement -
- Advertisement -

Corona Fourth wave in July: IIT Kharagpur study reveals

మన తెలంగాణ : కరోనా మళ్లీ కొన్ని దేశాల్లో జడలు విప్పుతోంది. ఇటీవల చైనా, దక్షిణ కొరియా సహా కొన్ని దేశాల్లో కొత్త కేసులు.. క్రమంగా పెరుగుతున్నాయి. వైరస్‌కు తెరపడుతున్న దశలో చేరుకుందని ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో నూతన వేరియంట్‌లు పుట్టుకొస్తున్నాయి. ఇటీవల చైనాలో కొత్తగా బి.ఎ.2 వేరియంట్ బయటపడింది. దీంతో అక్కడ రోజురోజుకు పాజిటివ్ కేసు లు తీవ్రంగా పెరుగుతున్నాయి. వైరస్ కట్టడికి డ్రాగన్ సర్కా రు.. పలు నగరాల్లో లాక్‌డౌన్ విధించింది. ఈ స్టెల్త్ ఒమిక్రాన్ అత్యధిక ప్రమాదకరమైన వేరియంట్‌గా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఒమిక్రాన్ కంటే అతి వేగంగా వ్యాపిస్తుందని గుర్తించారు. వైరస్ గుర్తింపు కూడా కష్టంగా మారుతోందని నిపుణులు చెబుతున్నారు. తాజాగా ఇజ్రాయెల్‌లోనూ.. నూ తన వేరియంట్ బయటపడింది.

ఇటీవల విదేశాలకు వెళ్లి ఇజ్రాయెల్ వచ్చిన ఇద్దరు ప్రయాణికుల్లో.. కరోనా కొత్త రకాన్ని గుర్తించినట్లు ఇజ్రాయెల్ ఆరోగ్యమంత్రిత్వ శాఖ ప్ర కటించింది. ఒమిక్రాన్‌కు చెందిన రెండు సబ్ వేరియంట్లు బి.ఎ.1, బి.ఎ.2లు కలిసి.. ఈ కొత్త వేరియంట్‌గా రూపాంతరం చెందినట్లు పేర్కొంది. ఈ వేరియంట్ గురించి ఇంకా ప్రపంచానికి తెలియదని.. తమ దేశంలోనే పుట్టినట్లు భావిస్తున్నామని ఇజ్రాయెల్ ఆరోగ్యశాఖ వివరించింది. ఇదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా కొత్త కేసులు గత వారంతో పోలిస్తే భారీగా పెరిగినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. మార్చి 7 నుంచి 13 వరకు కోటి 10లక్షల కొత్త కే సులు, 43 వేల మరణాలు నమోదైనట్లు పేర్కొంది. కాబట్టి.. ప్రపంచదేశాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కొత్త కేసుల పెరుగుదలకు ఒమిక్రాన్ వేరియంట్.., దాని ఉపరకం బి.ఎ.2 అని కారణమని డబ్ల్యూహెచ్‌ఓ వివరించింది. కరోనా నిబంధనల సవరించడం కూడా మరో కారణమని పేర్కొంది.

రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం

ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలతో.. కేంద్రప్రభుత్వం అప్రమత్తమైంది. దేశంలో కరోనా పరిస్థితులపై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ.. ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. కేసుల పెరుగుదల, జీనోమ్ సీక్వెన్సీ, ఇన్‌ఫెక్షన్ పెరుగుదల వంటి అంశాలపై చర్చించి ప్రత్యేక దృష్టి సారించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రపంచవ్యాప్తంగా కేసుల పెరుగదల నేపథ్యంలో.. కరోనా నాలుగో దశ వచ్చే అవకాశం ఉందంటూ కేంద్రం, రాష్ట్రప్రభుత్వాలను అప్రమత్తం చేసింది. కరోనా వ్యాప్తిని అరికట్టడానికి తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు.. కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ లేఖ రాశారు. వైరస్ నిర్ధరణ పరీక్షలు పెంచడం, ట్రాక్ చేయడం, చికిత్స, వ్యాక్సినేషన్, కట్టడి చర్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు నిబంధనలు అమలు చేయాలని పేర్కొన్నారు.

జూలైలో నాలుగో వేవ్ : ఐఐటీ ఖరగ్‌పూర్ అధ్యయనంలో వెల్లడి

భారత్‌లో నాలుగో వేవ్ కచ్చితంగా ఉంటుందని వాదనలు తెరపైకి వస్తున్నాయి. ఈసారి కరోనా ప్రభావం ఏకంగా 75 శాతం మందిపై పడొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. భారత్‌లో కరోనా బి.ఎ.2 వేరియంట్‌తో మూడో వేవ్ వచ్చింది. ఇప్పటికీ ఆ వేరియంట్ ఆనవాళ్లు ఉండడంతో నాలుగో వేవ్‌కు అవకాశం ఉందని కొవిడ్ 19 టాస్క్ గ్రూప్‌ను లీడ్ చేస్తున్న డాక్టర్ ఎన్‌కె అరోరా ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐఐటీ ఖరగ్‌పూర్ చేసిన అధ్యయనాల్లోనూ భారత్‌లో ఫోర్త్ వేవ్ తప్పదని హెచ్చరికలు జారీ చేశారు. ఐఐటీ ఖరగ్‌పూర్ అంచనాల మేరకు జూలైలో నాలుగో దశ ప్రభావం మొదలువుతుందని తెలిపారు. ఇదిలా ఉంటే రెండుడోస్‌ల వ్యాక్సిన్, సీనియర్ సిటిజన్స్‌కి బూస్టర్ డోస్ కారణంగా కొవిడ్ భారత్‌లో అంతగా ప్రభావం ఉండకపోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే మరణాల విషయంలో నాలుగోవేవ్ ప్రభావాన్ని మాత్రం ఇప్పుడే అంచనా వేయలేమని చెబుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News