క్లాసుకు 15 మంది , ఆద్యంతం పారిశుద్ధ్యం
షిప్టులు పైగా కలివిడిలేని తనం
పిల్లల మానసిక స్థితిపై పెను ప్రభావం
న్యూఢిల్లీ : ప్రపంచమంతా కోవిడ్ కోడి కూసిన తరువాత పలు జటిల ప్రశ్నలు తలెత్తాయి. వీటిలో అత్యంత ప్రధానమైనది చిన్నారుల స్కూళ్ల ప్రారంభానికి సంబంధించిన అంశం. కరోనా తీవ్రత నేపథ్యంలో ఇకపై స్కూళ్లు తెరుచుకున్నా ప్రతి తరగతికి కేవలం 15 మంది విద్యార్థులే ఉండాల్సి ఉంటుంది. క్రమం తప్పకుండా స్కూలులో పారిశుద్ధ్య పరిస్థితిపై బేరీజు వేసుకోవాలి. ఖచ్చితంగా టీకాలు వేసుకున్న టీచర్లు, స్కూలు సిబ్బందినే విధులకుఅనుమతించాల్సి ఉంటుంది. ఇటువంటి అనేక మౌలిక ఏర్పాట్లు మధ్యనే స్కూళ్లు రీ ఓపెన్ అయితేనే చిన్నారుల ఆరోగ్యానికిభద్రత ప్రశ్నార్థకం అవుతుంది. కరోనా వైరస్ తగ్గి, వేవ్‌ల బెడద సమసిపోయినా స్కూళ్లు ఇంతకుముందటిలాగా తెరుచుకునే పరిస్థితి ఉండదని , గతంలో లాగా క్లాసుల వారిగా 30 అంతకు మించి విద్యార్థులను పంపిస్తే అక్కడనే వైరస్ రూపొందే వేదికలయ్యే ముప్పు ఉందని నిపుణులు హెచ్చరించారు. దాదాపుగా రెండేళ్లుగా కోవిడ్‌తో పలు రకాలుగా సామాజిక ఆర్థిక సవాళ్లు ఇప్పటి తరానికి గాయాలుగా మారాయి.
అయితే స్కూళ్లు లేమితో కూడిన బాల్యంతో భావితరాలకు భవిత వారికి తెలియని విధంగానే ప్రశ్నార్థకం అయి కూర్చుంది. ఇంతకు ముందటిలాగా స్కూళ్లకు పిల్లలు బిలబిలంటూ గుంపులుగా ఉరికివెళ్లే పరిస్థితి లేదు. ఇకపై ఇప్పట్లో రాదేమో అని విద్యావేత్తలు ఆందోళన చెందుతున్నారు. పసిప్రాయంలో స్కూళ్లకు వెళ్లే పిల్లల మానసిక ఎదుగుదలకు ఇతరులతో కలిసి సామూహికరీతిలో విద్యను అభ్యసించడం, పనిలో పనిగా క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలతో వినోదించడం ఉండేది. అయితే స్కూళ్ల ప్రత్యక్ష అనుభవం తప్పి, ఇప్పటివరకూ అసమగ్ర ఆన్‌లైన్ విద్యను భరించాల్సి వస్తోన్న విద్యార్థులకు వారి తల్లిదండ్రులు, గురువులకు కరోనా దాటలేని అగడ్తనే మిగిల్చి వెళ్లలేక వెళ్లుతున్న సూచనలు ఉన్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాలు విద్యాసంస్థలు ప్రత్యేకించి చిన్నారుల స్కూళ్లను తిరిగి తెరిచేందుకు, గండిపడ్డ విద్యాసంవత్సరాన్ని చక్కదిద్దేందుకు యత్నిస్తున్నాయి.
ఈ క్రమంలో తీసుకోవల్సిన చర్యల గురించి ఐసిఎంఆర్ ఇతర నిపుణుల బృందాలు పలు హెచ్చరికలు వెలువరించాయి. అత్యధిక జనాభాకు ఇప్పటికీ టీకాలు పడలేదు. ఇప్పటికీ తల్లిదండ్రులలో వైరస్‌పై భయాందోళనలు తొలిగిపోలేదు. షిప్టుల వారిగా స్కూళ్లు ఆరంభం కావాలని, ప్రతి క్లాసులో దూరందూరంగా కేవలం 15 మంది పిల్లలనే కూర్చోబెట్టాలి. పిల్లల పరిశుభ్రతకు అత్యంత జాగ్రత్తలు పాటించాలి, ప్రత్యేకించి టీచర్లు పిల్లలు ఎక్కువగా కలివిడిగా ఉండకుండా చూడాలనే నిబంధనలు చెప్పడానికి అత్యుత్తమంగా ఉన్నా, అవి ఆచరణలో ఏ విధంగా అమలులో నిలుస్తాయి? ఈ విధమైన నిరంతర ప్రక్రియతో స్కూళ్లు ఆరంభం అయితే, ఇంతకు ముందటి స్కూళ్ల పరిస్థితికి ఇక ముందటి వాటికి పొంతన ఉండదని, విద్యార్థుల మానసిక స్థితిలో కూడా మార్పు వస్తుందని, ప్రత్యేకించి వారి స్వేచ్ఛ , దీనికి అనుబంధం అయిన ప్రతిభకు విఘాతం ఏర్పడుతుందని సైకాలజిస్టులు విశ్లేషిస్తున్నారు. ఇంటికి పరిమితం అయి కూర్చుంటున్న పిల్లలకు తెరుచుకోబోయే స్కూళ్లు కాలం విసిరిన కరోనా కలికాలపు ఈటెలు జవాబు ఇవ్వలేని పరీక్షలే అవుతాయనే ఆందోళన వ్యక్తం అవుతోంది.