Wednesday, January 22, 2025

కరోనా ఇక సీజనల్ వ్యాధి

- Advertisement -
- Advertisement -

ఇది ఎండమిక్ దశకు చేరుకుంది
రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో సీజనల్ వ్యాధులతో జాగ్రత్తగా ఉండాలి
రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు

మన తెలంగాణ/హైదరాబాద్ : కొవిడ్ నుంచి బయటపడ్డామని.. ఇప్పుడు సీజనల్ వ్యాధులతో పోరాడాలని ప్రజారోగ్య సంచాలకులు (డీహెచ్) డాక్టర్ శ్రీనివాసరావు అన్నారు. కొత్త వేరియంట్ వస్తే తప్ప కొవిడ్ కథ ముగిసినట్లేనని చెప్పారు. గత ఆరు వారాలుగా కొవిడ్ కేసుల సంఖ్య పెరిగిందని, కరోనా గురించి భయపడాల్సిన పనిలేదని డీహెచ్ పేర్కొన్నారు. ఇది ఎండమిక్ దశకు చేరుకుందని అన్నారు. సాధారణ జలుబు, జ్వరం లక్షణాలు ఉంటాయని వివరించారు. కొవిడ్ కూడా ఓ సీజనల్ వ్యాధిగా మారిపోయిందని వ్యాఖ్యనించారు. లక్షణాలుంటే కేవలం 5 రోజులే క్వారంటైన్‌లో ఉండాలని అన్నారు. కరోనా లక్షణాలు లేని వారికి నిర్ధారణ పరీక్షలు అవసరం లేదని స్పష్టం చేశారు. కోఠిలోని ప్రజారోగ్య సంచాకుల కార్యాలయంలో డీహెచ్ శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. డబ్ల్యూహెచ్‌ఒ కొత్త నిబంధనల ప్రకారం లక్షణాలు లేనివారికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయడం లేదని తెలిపారు. కొవిడ్ సోకి శ్వాసకోశ ఇబ్బందులు ఉన్న వారు మాత్రమే ఆస్పత్రిలో చేరాలని పేర్కొన్నారు.

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తం

రాష్ట్రంలో గత వారం రోజులుగా వర్షాలు కురుస్తున్నందున ఆహారం, నీరు కలుషితం కాకుండా ప్రజ లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డీహెచ్ సూచించారు. ఆహారం, నీరు కలుషితమైతే విష జ్వరాలు ప్రబలే అవకాశముందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. సీజనల్ వ్యా ధులు ప్రబలే అవకాశమున్న నేపథ్యంలో డీఎంహెచ్‌లతో వైద్యఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు సమావేశం నిర్వహించి సన్నద్ధతపై ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. జలుబు, జ్వరం ఉంటే ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉండాలన్నారు. ప్రజలు తప్పనిసరిగా మా స్క్ ధరించాలని కోరారు. సిఎం కెసిఆర్ మార్గదర్శనంలో వైద్యారోగ్యశాఖ సిరిసిల్ల, ములుగు జిల్లాల్లో హెల్త్ ప్రొఫైల్ పైలెట్ ప్రాజెక్ట్ కార్యక్రమం పూర్తయ్యిందని చెప్పారు. ప్రస్తుతం డేటాను పరిశీలిస్తున్నామని, కొద్ది రోజుల్లోనే ఇందుకు సంబంధించిన పూర్తి కార్యాచరణ సిద్ధం చేయనున్నట్లు పేర్కొన్నా రు. త్వరలోనే వారికి హెల్త్‌కార్డులను పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసే విషయంపై సిఎం నిర్ణయం తీసుకుంటారని వివరించారు.

దోమల నివారణకు యాంటీ లార్వా ఆపరేషన్లు

బ్యాక్టీరియా, వైరస్‌తో సీజనల్ వ్యాధులు వస్తాయని, వర్షాలు పడే సమయంలో అత్యంత అవసరమైతేనే ఇళ్ల నుంచి బయటకు రావాలని డీహెచ్ సూచించారు. కరోనాకు ముందు 2019లో వేల ల్లో డెంగీ కేసులు వచ్చాయని, అప్పుడు కొన్ని మరణాలు కూడా నమోదయ్యాయని తెలిపారు. ప్రైవే ట్ ఆస్పత్రులు అవసరం లేకుండా ప్లేట్‌లెట్ మార్పి డి చేయొద్దని చెప్పారు. ప్రజల బలహీనతను వ్యా పారంగా మార్చుకోవద్దని, అత్యవసరం అయితేనే ప్లేట్‌లెట్ చికిత్స అందించాలని అన్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు 1,184 డెంగీ కేసులు నమోదయ్యాయని అన్నారు. హైదరాబాద్‌లో 516, కరీంనగర్‌లో 84, మహబూబ్ నగర్‌లో 54, మేడ్చల్‌లో 55, పెద్దపల్లిలో 40, సంగారెడ్డిలో 97.. ఇలా దాదాపు అన్ని జిల్లాల్లోనూ డెంగీ కేసులు నమోదయ్యాయని అన్నారు. జూన్‌లో 563 కేసులు రాగా.. జులైలో తొలి 10 రోజుల్లోనే 222 కేసులు వచ్చాయని చెప్పారు. దీనిపై వైద్య ఆరోగ్యశాఖ అన్ని రకాల చర్యలు చేపట్టిందని పే ర్కొన్నారు. దోమల నివారణకు యాంటీ లార్వా ఆపరేషన్లు నిర్వహిస్తున్నామని, దీన్ని పెంచాలని డీఎంహెచ్‌ఐలకు ఆదేశాలిచ్చామని అన్నారు.

ము న్సిపల్, పంచాయితీరాజ్, వైద్య ఆరోగ్యశాఖల సమన్వయంతో యాంటీ లార్వా ఆపరేషన్లు చేపడుతున్నామని తెలిపారు. రెండు మూడు జిల్లాల నుం చి మలేరియా కేసులు వస్తున్నాయని, ముఖ్యంగా భద్రాద్రి, ములుగులోనే ఎక్కువగా నమోదవుతున్నాయని పేర్కొన్నారు. ఈ ఏడాది టైఫాయిడ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని అన్నారు. మే నెలలో 2,700, జూన్ 2,752 కేసులు వచ్చాయని తెలిపారు. మే నెలలో మూడు చికున్ గున్యా కేసులు రికార్డయ్యాయన్నారు. ఈ నెలలో 6 వేల విరేచనాల కేసులు నమోదయ్యాయన్నారు.

ప్రజలు ‘ఫ్రైడే .. డ్రై డే’ చేపట్టాలి

ప్రజలు సరైన ఆహారం, మంచి నీరు తీసుకోవడం ద్వారా ఈ వ్యాధుల నుంచి సురక్షితంగా బయటపడొచ్చని శ్రీనివాసరావు చెప్పారు. ప్రజలు ఫ్రైడే .. డ్రై డే కార్యక్రమం చేపట్టాలని పేర్కొన్నారు. వేడివేడి ఆహారం తీసుకోవాలని సూచించారు. పానీపూరి, బయటి ఫుడ్ తినేటప్పుడు శుభ్రంగా ఉన్నాయా? లేదా? అని చూసుకోవాలన్నారు. నీరు రంగుమారితే తప్పకుండా కాచి చల్లార్చి తాగాలని తెలిపారు. జలుబు, జ్వరం, విరేచనాలు ఉంటే వైద్యులను సంప్రదించాలని అన్నారు. చిన్న నొప్పులే కదా అని తేలిగ్గా తీసుకుని ప్రాణాలమీదకు తెచ్చుకోవద్దని సూచించారు. జ్వరం వచ్చినప్పడు తప్పనిసరిగా టెస్టులు చేయించుకోవాలని తెలిపారు. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో టెస్ట్ కిట్లు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి డబ్బులు వృథా చేసుకోకుండా.. దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు. సీజనల్ వ్యాధులను దృష్టిలో పెట్టుకుని అన్ని ప్రభుత్వ దవాఖానాల్లో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు. గర్భిణులు ముందే ఆస్పత్రిలో చేరి వైద్యం తీసుకోవాలని సూచించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News