Sunday, September 22, 2024

మరింత నిఘా

- Advertisement -
- Advertisement -

etela rajender

 

శంషాబాద్ నుంచి క్వారంటైన్‌కే

రాష్ట్రంలో ఐదో కేసు, ఇండోనేషియా నుంచి వచ్చిన వ్యక్తికి వైరస్

స్థానికంగా ఎవరికీ సోకలేదు
సోకిన వారంతా విదేశాల నుంచి వచ్చిన వారే
పరీక్షలకు ఆరు ల్యాబ్‌లు
ఫైనల్ టెస్టులు కూడా హైదరాబాద్‌లోనే
కోఠి కంట్రోల్ రూం సమావేశంలో మంత్రి ఈటల

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా ఐదవ పాజిటివ్ కేసు నమోదైందని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. ఇండోనేషియా నుంచి వచ్చిన వ్యక్తికి వ్యాధి సోకిందని మంత్రి పేర్కొన్నారు. ఇప్పటి వరకు కరోనా సోకిన వారంతా విదేశాల నుంచి తిరిగి వచ్చిన వారేనని, రాష్ట్రంలో నివసించే ఏ ఒక్కరికి కరోనా సోకలేదని మంత్రి ఈటల తెలిపారు. మంగళవారం కోఠి కమాండ్ కంట్రోల్ రూంలో ఆయన ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ యోగితారాణా, డిఎంఇ రమేష్‌రెడ్డి, డిహెచ్ శ్రీనివాసరావులతో కలసి సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి ఈటల మాట్లాడుతూ… ఐఎఎస్ అధికారుల కమిటిలు అద్భుతంగా పనిచేస్తున్నాయని తెలిపారు. దీంతో పాటు కరోనాపై పరిణామాలను ప్రజలకు చేరవేస్తున్న మీడియాకు అభినందనలు తెలిపారు.

రాష్ట్రంలోని ఎవరికీ కరోనా రాలేదు…
రాష్ట్రంలో నివసించే ఏ ఒక్కరికి కరోనా సోకలేదని మంత్రి ఈటల స్పష్టం చేశారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఐదు కేసులు నమోదుకాగా, ఒకరు డిశ్చార్జ్ అయిన విషయం తెలిసిందే. అయితే వైరస్ సోకిన వారంతా ఇతర ప్రాంతాల నుంచి తిరిగి వచ్చిన వారేనని మంత్రి తెలిపారు. పాజిటివ్ వచ్చిన వారిలో దుబాయ్, ఇటలీ, నెదర్లాండ్, స్కాట్లాండ్, ఇండోనేషియా దేశాల నుంచి తిరిగి వచ్చిన వారు మాత్రమే ఉన్నారని, ఇక్కడ నివసించే ఎవరికి ఇప్పటి వరకు కరోనా సోకలేదని మంత్రి వెల్లడించారు. ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో నలుగురు పాజిటివ్ వ్యక్తులకు ఐసొలేషన్ వార్డులో చికిత్సను అందిస్తున్నామని, వారు కూడా త్వరలోనే కోలుకుంటారని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.

14 రోజులు క్వారంటైన్‌లోనే
కరోనా వైరస్ ఇతర దేశాల నుంచి మాత్రమే వస్తున్న నేపథ్యంలో ఎయిర్‌పోర్ట్‌లో అలర్ట్ చేశామని మంత్రి తెలిపారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి విమానాశ్రయాల్లో పకడ్భందీగా స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని మంత్రి తెలిపారు. కరోనా వైరస్ మనుగడలోకి వచ్చిన తర్వాత మొట్ట మొదటి సారిగా థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు ప్రారంభించింది తెలంగాణ రాష్ట్రమేనని మంత్రి అభిప్రాయపడ్డారు. సొంత థర్మల్ మిషన్లు కొనుగోలు చేసి సుమారు 200 మంది సిబ్బందితో స్క్రీనింగ్ పరీక్షలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించిన వారిలో 464 మందికి అనుమానిత లక్షణాలు ఉంటే, కేవలం 5 గురికి మాత్రమే కరోనా సోకిందని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం ఐసొలేషన్‌లో చికిత్స పొందుతున్న కరోనా బాధితుల ఆరోగ్యం నిలకడగా ఉందని త్వరంలోనే వీరు కూడా సంపూర్ణమైన ఆరోగ్యంతో డిశ్చార్జ్ అవుతారని మంత్రి తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం ఆదేశం మేరకు ఆప్ఘనిస్తాన్, మలేషియా, యూకే, పిలిప్ఫిన్ నుంచి విమానాల రాకపోకలు ఆగిపోయాయని మంత్రి తెలిపారు. బుధవారం నుంచి యూఏఇ, ఖత్తర్, ఓమన్, కువైట్ తదితర దేశాల నుంచి విమానాలు ఆగిపోతాయని మంత్రి చెప్పారు. దీంతో కరోనా కట్టడి సులభంగా మారుతుందని మంత్రి భావించారు. ముఖ్యంగా కరోనా తీవ్రత అధికంగా ఉన్న చైనా, ఇరాన్, ఇటలీ, జర్మనీ, కొరియా, ఫ్రాన్స్, స్పెయిన్, కువైట్, ఖతార్, ఒమన్, దేశాల నుంచి వచ్చే వారిని లక్షణాలు లేకపోయినా క్వారంటైన్ చేస్తామని మంత్రి తెలిపారు. అయితే లక్షణాలు ఉన్న వారిని మాత్రం గాంధీకి, లక్షణాలు లేని వారిని పర్యవేక్షణ కోసం క్వారంటైన్ చేస్తామని మంత్రి పేర్కొన్నారు. అదే విధంగా అన్ని జిల్లాల్లో కూడా క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని, విదేశాల నుంచి వచ్చే తెలంగాణ వాసులను ఆయా జిల్లా కేంద్రాల్లోనే క్వారంటైన్ చేయాల్సిందిగా మంత్రి ఆదేశాలు జారీ చేశారు.

రాష్ట్రంలో పాజిటివ్ వచ్చిన వ్యక్తులను కలసిన ప్రతి ఒక్కరిని ట్రేస్ చేస్తున్నామని మంత్రి ఈటల తెలిపారు. ఇప్పటికే పాజిటివ్ 1(దుబాయ్ నుంచి వచ్చిన వ్యక్తి) ను నేరుగా కలసిన మొత్తం 88 మందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తే, ఏ ఒక్కరికి నెగటివ్ రాలేదని, తెలంగాణాలో కరోనాలో వ్యాప్తి చెందదు అనే దానికి ఇంత కన్న నిదర్శనం ఏమి ఉంటుందని మంత్రి అన్నారు. అయితే పాజిటివ్ 2,3,4,5 వ్యక్తులను కలసిన వారిని కూడా గుర్తిస్తున్నామని మంత్రి అన్నారు. ఇటలీ నుంచి వచ్చిన యువతి(పాజిటివ్ 2)ని కలసిన మొత్తం 42 మందిని ట్రేస్ చేసి, టెస్టులు చేస్తే అందిరికీ నెగటివ్‌గా నిర్థారణ అయ్యిందని మంత్రి అన్నారు.

అదే విధంగా నెదర్లాండ్ నుంచి వచ్చిన వ్యక్తిని మొత్తం 69 మంది ప్రత్యక్షంగా కలువగా, వారిని కూడా పరీక్షలు చేస్తే నెగటివ్ వచ్చిందని మంత్రి తెలిపారు. అయితే పాజిటవ్ 4(స్కాట్లాండ్ నుంచి వచ్చిన వ్యక్తి)ని ప్రత్యక్షంగా కలసిన వారిలో ఇప్పటి వరకు మొత్తం 11 మంది, తాజాగా వైరస్ సోకిన పాజిటివ్ 5(ఇండోనేషియా నుంచి వచ్చిన వ్యక్తి)ని కలసిన మరో 11 మందిని గుర్తించామని, వీరి టెస్టులు ల్యాబ్‌లకు పంపుతున్నామని మంత్రి తెలిపారు. అయితే పాజిటివ్ 4 వ్యక్తి ఎక్కువ మందిని కలసినట్లు సమాచారం. దీంతో వారందరిని ట్రేస్ చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. కరోనా పాజిటివ్ వ్యక్తులను కలసిన ప్రతి వ్యక్తిపై పరీక్షలు నిర్వహించి పర్యవేక్షిస్తామని మంత్రి అన్నారు.

ఆరు ల్యాబ్‌లలో పరీక్షలు నిర్వహణ..
రోజురోజుకి అనుమానిత లక్షణాలు వస్తున్న వారి సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ల్యాబ్‌ల సంఖ్య పెంచుతున్నట్లు వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల తెలిపారు. ప్రస్తుతం గాంధీ, ఉస్మానియాలో కరోనా పరీక్షలు చేస్తున్నామని, కేంద్ర ప్రభుత్వం ఆదేశాల అనుమతితో ఫీవర్ ఆసుపత్రి, ఐపిఎం, వరంగల్ గాంధీ, నిమ్స్ హాస్పిటల్స్‌లో కూడా కరోనా పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. అయితే ఇప్పటి వరకు ఫైనల్ రిపోర్టుల కోసం శాంపిల్స్‌ను పూణే వైరాలజి ల్యాబ్‌లకు శాంపిల్స్ పంపుతున్నామని, కానీ ఇక నుంచి ఆ టెస్టు కూడా హైదరాబాద్ నగరంలోనే నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని, ఇప్పటికే ల్యాబ్‌లకు పరికరాలు వచ్చాయని, త్వరలోనే అన్ని ఏర్పాట్లతో ల్యాబ్‌లలో టెస్టులు చేయడం ప్రారంభిస్తామని మంత్రి అన్నారు. విదేశాల నుంచి తిరిగి వచ్చిన వారు స్వతహాగా కరోనా టెస్టులు చేయించుకునేందుకు వస్తున్నట్లు వైద్యమంత్రి తెలిపారు.

రోజూ 1500 మంది వచ్చే అవకాశం
ప్రస్తుతం విదేశాల నుంచి ప్రతి రోజూ సుమారు అనుమానిత లక్షణాలు ఉన్న వారిలో 30 మందిని క్వారంటైన్ చేస్తుండగా, యుఎఇ, ఖత్తర్, ఒమన్, కువైట్ నుంచి చైనా, తదితర దేశాల నుంచి వచ్చే ప్రతి ఒక్కరిని లక్షణాలు లేకపోయినా క్వారంటైన చేసే దిశగా అధికారులు అడుగులు వేస్తున్నాయి. అయితే ప్రతి రోజూ సుమారు 1500 మంది వరకు క్వారంటైన్ చేయాల్సి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ప్రజలు ఆందోళన చెందవద్దు
రాష్ట్రంలో కరోనా నియంత్రణ కోసం నిరంతరం కృషి చేస్తుందని, ప్రజలు ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదని మంత్రి ఈటల స్పష్టం చేశారు. దూలపల్లి, వికారాబాద్‌లో ధర్నా చేస్తున్న ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నానని, ఆయా ప్రాంతాల్లో వార్డులకు పంపే వారు కరోనా రోగులు కాదని, వారిని ఐసొలేషన్‌లో పెట్టి పర్యవేక్షించడం కోసమేనని మంత్రి తెలిపారు. కావున ప్రజలు ఆందోళన చెందవద్దని మంత్రి అన్నారు.

Corona is fifth positive case in state
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News