న్యూఢిల్లీ : డెల్టా రకం కరోనా వేరియంట్ కంటే లాంబ్డా వేరియంట్ అత్యంత ప్రమాదకరమని మలేషియా ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. ప్రపంచం లోని 30 దేశాల్లో లాంబ్డా వేరియంట్‌ను గుర్తించారు. బ్రిటన్ లోనూ ఆరు లాంబ్డా వేరియంట్ కేసులు బయటపడ్డాయి. పెరూలో మే, జూన్ నెలల్లో బయటపడిన కరోనా వైరస్ నమూనాల్లో లాంబ్డా వేరియంట్ దాదాపు 82 శాతం ఉందని పాన్ అమెరికన్ హెల్త్ ఆర్గనైజేషన్ (పాహో) వెల్లడించింది. పెరూ నుంచే లాంబ్డా వేరియంట్ పుట్టుకొచ్చిందని పరిశోధకులు చెబుతున్నారు. మరో దక్షిణ అమెరికా దేశమైన చిలీలో మే, జూన్ నెలల్లో సేకరించిన నమూనాల్లో 31 శాతం పైగా నమూనాల్లో లాంబ్డా వేరియంట్ ఉన్నట్టు గుర్తించారు.
భారత్‌లో లాంబ్డా వేరియంట్ ఆనవాళ్లు లేవు
డెల్టా వేరియంట్ కన్నా ప్రమాదకరమని భావిస్తున్న లాంబ్డా వేరియంట్ ఆనవాళ్లు భారత్‌లో ఇప్పటివరకు కనిపించలేదని అధికారులు పేర్కొంటున్నారు. గత నాలుగు వారాలుగా ప్రపంచ వ్యాప్తంగా 30 కి పైగా దేశాల్లో లాంబ్డా వేరియంట్ ఆనవాళ్లు కనుగొన్నారని బ్రిటన్ ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది.