Tuesday, November 5, 2024

కరోనా కేంద్రాలుగా వైన్స్, బార్లు, థియోటర్లు

- Advertisement -
- Advertisement -

కొవిడ్ నిబంధనలు పాటించకుండా గుంపులుగా చేరుతున్న పరిస్థితి
జనంతో కిటకిటలాడుతున్న షాపింగ్ మాల్స్, మార్కెట్లు, వస్త్ర దుకాణాలు
వైరస్ విస్తరించే ప్రాంతాలపై దృష్టి పెట్టకుంటే కేసుల సంఖ్య రెట్టింపు అయ్యే అవకాశం
పాజిటివ్ కేసులు నమోదయ్యే ప్రాంతాలను కంటైన్‌మెంట్ జోన్లు చేయాలంటున్న ప్రజలు

మన తెలంగాణ/సిటీబ్యూరో: గ్రేటర్‌లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగిస్తుంది. రోజు రోజుకు వందలాది పాజిటివ్ కేసులు నమోదవుతూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. నగర వాసులు కొవిడ్ నిబంధనలు పాటించి ముఖానికి మాస్కులు, భౌతికదూరం ఉండాలని చెప్పడం తప్ప జన సమూహంగా ఉన్న ప్రాంతాలపై అధికార యంత్రాంగం దృష్టి పెట్టడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. పాఠశాలు, కళాశాలలు, వసతిగృహాల్లో విద్యార్థులకు వైరస్ సోకితే వెంటనే స్కూల్స్ మూసివేసి పిల్లలంతా ఒకే దగ్గర చేరడంతోనే మహమ్మారి రెక్కలు కట్టుకుంటుందని పేర్కొన్నారు.

కానీ పెద్ద సంఖ్యలో జనం గుంపులుగా ఉండే బార్లు, వైన్స్‌లు, సినిమా థియేటర్ల విషయంలో ఎం దుకు కొవిడ్ నిబంధనలు అమలు చేయడం లేదని ప్రజాసంఘాల నాయకులు అధికారులను ప్రశ్నిస్తున్నారు. వీటిలో జనం పెద్ద ఎత్తున గూమిగూడి కనీస నిబంధనలు పాటించకుండా ఉండటంతో వారి ద్వారా ఇతరులకు వైరస్ సోకి తాజాగా పాజిటివ్ కేసులు సంఖ్య 551కి చేరుకుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అసలు కరోనా ఉగ్రరూపం దాల్చే ప్రాంతాల్లో కట్టడి చేయకుండా, మాస్కులు ధరిస్తే జరిమానాలు వేస్తామని ప్రకటన చేయడం హస్యస్పాదంగా ఉందంటున్నారు. విద్యాసంస్థలు మూసివేసిన తరహాల్లో బార్లు, వైన్, థియేటర్లు, షాపింగ్ మాల్స్, మార్కెట్లు, సంతలను మూసివేయాలని కోరుతున్నారు. వీటిని మూసివేయకుండా బహిరంగంగా ఉంచితే వైరస్ కట్టడికి ఎన్ని చర్యలు చేపట్టిన ఫలితం శూన్యమే కనిపిస్తుందని చెబుతున్నారు. ఇప్పటికే ప్రైవేటు ఆసుపత్రులు కరోనా రోగులతో నిండిపోగా, ప్రభుత్వ ఆసుపత్రులైన ఫీవర్, నేచర్‌క్యూర్, నిజామియా, చెస్ట్, కింగ్‌కోఠి ఆసుపత్రులు పడకల్లో 70శాతం రోగులు ఉన్నట్లు, ఇదే విధంగా కరోనా కేసులు సంఖ్య పెరిగితే వారం రోజుల్లో సర్కార్ దవాఖానాలు పూర్తిగా కరోనా రోగులతో నిండిపోతాయని వైద్యాధికారులు పేర్కొంటున్నారు.

మరో పక్క గ్రేటర్ మూడు జిల్లాల పరిధిలో 196 ప్రాథమిక, బస్తీదవాఖానాలలో ఉచితంగా రోజుకు 75 మందికి టెస్టులు చేయాలని అదికారులు ఆదేశించిన, ఆయా కేంద్రాల సిబ్బంది, టోకెన్లు ఇచ్చి స్థానికులకు రెండుమూడు రోజలు పాటు తిప్పించుకుంటూ పరీక్షలు చేయకుండా నిర్లక్షం చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. మరికొన్ని ఆరోగ్య కేంద్రాల్లో దగ్గు, జలుబు, జ్వరం లక్షణాలున్న వారి వద్ద రక్త నమూనాలు సేకరించి ఫలితాలు నాలుగు రోజుల తరువాత రిపోర్టు ఇస్తున్నారు.

ఇందులో పాజిటివ్ తేలిన వారు ఈ నాలుగు రోజుల పాటు కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులను కలవడంతో వారి ద్వారా మరికొంత మందికి సోకుతుందని, కరోనా టెస్టుల ఫలితాలు అదే రోజు వెల్లడిస్తే వైరస్ విస్తరించకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చని స్థానిక ప్రజలు పేర్కొంటున్నారు. కరోనా విస్తరించే అసలైన కేంద్రాలను గుర్తించకుండా, పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాలను కంటైన్‌మెంట్ జోన్లుగా ఏర్పాటు చేయకుండా నామమాత్రంగా అధికారులు కరోనాతో యుద్ధం చేస్తే గ్రేటర్ పూర్తిగా మహమ్మారి చేతిలో బంధి అవుతుందని జిల్లా వైద్యాధికారులు చెబుతున్నారు. నగర ప్రజలు బార్లు, వైన్స్‌లు , సినిమా థియేటర్లు, షాపింగ్ మాల్స్, మార్కెట్లకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటిస్తే ఆరోగ్యంగా ఉంటారని, టీకా వచ్చిందని సరదాగా రోడ్లపై సంచారం చేస్తే కరోనా కాటు తప్పదని హెచ్చరిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News