మనతెలంగాణ/హైదరాబాద్ : ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుకు కరోనా నెగటివ్ వచ్చింది. సిఎంకు రాపిడ్ టెస్టులో నెగటివ్ గా రిపోర్టు వచ్చింది. వ్యక్తిగత వైద్యులు డాక్టర్ ఎంవి రావు ఆధ్వర్యంలోని వైద్య బృందం బుధవారం సిఎంకు తను ఇసోలేషన్లో వున్న వ్యవసాయ క్షేత్రంలో కొవిడ్ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాపిడ్ యాంటీజెన్‌తో పాటు ఆర్టిపిసిఆర్ పరీక్షలు నిర్వహించగా, రాపిడ్ టెస్టులో నెగటివ్ గా రిపోర్టు వచ్చింది. కాగా, ఆర్టిపిసిఆర్ పరీక్షా ఫలితాలు గురువారం రానున్నాయి.
నిలకడగా సిఎం ఆరోగ్యం
సిఎం కెసిఆర్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ఈనెల 19న కరోన పాజిటివ్ రావడంతో సిఎం ఎర్రవెల్లిలోని తన వ్యవసాయక్షేత్రంలో హోమ్ ఐసోలేషన్‌లో ఉంటున్నారు. సిఎంకు ఈ నెల 22వ తేదీన సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల్లో ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తేలింది. హోమ్ ఐసోలేషన్‌లో ఉన్న కెసిఆర్‌కు బుధవారం రాపిడ్ యాంటీజెన్‌తో పాటు ఆర్టిపిసిఆర్ పరీక్షలు నిర్వహించగా, రాపిడ్ టెస్టులో నెగటివ్‌గా రిపోర్టు వచ్చింది.