Saturday, November 23, 2024

కొత్త వేరియెంట్‌పై అప్రమత్తం

- Advertisement -
- Advertisement -

Corona New variant b.1.1.529 found in South Africa

ఇజ్రాయెల్, హాంకాంగ్,బోట్స్‌వానాలు సహా మరికొన్ని ఆఫ్రికన్ దేశాలకు వ్యాప్తి, అప్రమత్తమైన ప్రపంచ దేశాలు, దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కొత్త వేరియంట్ బి.1.1.529, స్పైక్ ప్రోటీన్‌లో 30కిపైగా మ్యుటేషన్లు, వ్యాప్తిరేట్ అధికంగా ఉన్నట్టు గుర్తింపు వ్యాక్సిన్లను తప్పించుకుంటున్నదని ఆందోళన,
పరిశోధిస్తున్నామన్న బ్రిటన్ శాస్త్రవేత్తలు, ప్రభావం అంచనాకు మరికొన్ని వారాలు, ఆరు దేశాల విమానాలపై యుకె నిషేధం
అదేబాటలో ఇయు
దేశాలు, డబ్లూహెచ్‌ఒ
నిపుణుల అత్యవసర
భేటీ, కొవిడ్ నిబంధనలు
కొనసాగించాలని సూచన

లండన్/జెనీవా/బ్రస్సెల్స్: దక్షిణాఫ్రికాలో కొవిడ్19 కొత్త వేరియంట్ వెలుగు చూడటంతో బ్రిటన్, ఇయు దేశాలుసహా ప్రపంచం అప్రమత్తమైంది. దక్షిణాఫ్రికాతోపాటు మరో ఐదు దేశాల నుంచి ప్రయాణాలపై యుకె నిషేధం విధించింది. దక్షిణాఫ్రికాలో ఈ వారం ప్రారంభంలో బి.1.1.529 అనే కొత్త వేరియంట్‌ను గుర్తించారు. ఈ వేరియంట్‌లో మొత్తమ్మీద 50 మ్యుటేషన్లను గుర్తించగా, 30కిపైగా స్పైక్ ప్రోటీన్‌లోనేనని సెంటర్ ఫర్ ఎపిడెమిక్ రెస్పాన్స్ అండ్ ఇన్నోవేషన్(దక్షిణాఫ్రికా) డైరెక్టర్ ప్రొఫెసర్ తులియోడె ఒలివీరా తెలిపారు.

కరోనా వ్యాప్తిలో స్పైక్ ప్రోటీన్‌దే కీలక పాత్ర అన్నది తెలిసిందే. ఈ వేరియంట్ ఇప్పటికే ఇజ్రాయెల్, హాంకాంగ్, బోట్స్‌వానాతోపాటు కొన్ని పొరుగుదేశాలకు వ్యాప్తి చెందింది. దాంతో, బోట్స్‌వానా, లెసోథో, ఎస్వాతిని, జింబాంబ్వే, నమీబియా దేశాల నుంచి ప్రయాణాలపై శుక్రవారం నుంచి నిషేధం విధిస్తున్నట్టు యుకె ప్రభుత్వం ప్రకటించింది. కొవిడ్19 స్పైక్ ప్రోటీన్‌లో పెద్ద సంఖ్యలో మ్యుటేషన్స్(ఉత్పరివర్తనాలు)ను గుర్తించినట్టు యుకె ఆరోగ్య భద్రతా ఏజెన్సీ(ఉఖ్సా) పేర్కొన్నది. వైరస్ జీనోమ్‌లోని మిగతా భాగాల్లోనూ మ్యుటేషన్స్‌ను గుర్తించారు.

వ్యాక్సిన్ల వల్ల మనుషులకు సంక్రమించే రోగనిరోధకశక్తి(ఇమ్యూనిటీ)ని కూడా ఈ వైరస్ దాటేస్తుందని గుర్తించారు. దాంతో, ఇది వేగంగా వ్యాప్తి చెందే అవకాశాలున్నాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ వేరియంట్‌పై పరిశోధన జరుపుతున్నట్టు యుకె ఆరోగ్య విభాగం ఉఖ్సా తెలిపింది. ఇప్పటివరకు వచ్చిన వేరియంట్లలో ఇది ఎంతో ప్రత్యేకమైనది. దీని వ్యాప్తి తీవ్రత, వ్యాక్సిన్‌ను అధిగమిస్తున్నదన్న అనుమానాలపై అత్యవసర పరిశోధన జరుపుతున్నామని ఉఖ్సా చీఫ్‌ఎగ్జిక్యూటివ్ డాక్టర్ జెన్నీహారిస్ తెలిపారు. గురువారం యుకెలో 2465 కరోనా కేసులు నమోదయ్యాయి.

ఈ వేరియంట్ వల్ల ప్రపంచంలో తలెత్తనున్న ఆరోగ్య సమస్యల్ని మదింపు చేయడానికి ప్రపంచ ఆరోగ్యసంస్థ(డబ్లూహెచ్‌ఒ) సాంకేతిక సలహాబృందం (నిపుణులు) శుక్రవారం వర్చువల్‌గా సమావేశమైంది. ప్రయాణాలపై ఆంక్షల విషయంలో శాస్త్రీయంగా వ్యవహరించాలని ప్రపంచ దేశాలకు డబ్లూహెచ్‌ఒ అధికార ప్రతినిధి క్రిస్టియన్ లిండ్‌మీయర్ సూచించారు. జనం ఎక్కువగా గుమికూడటంలాంటివి తగదని, మాస్క్‌లు ధరించాలని, చేతుల శుభ్రత కొనసాగించాలని, వెంటిలేషన్ ఉన్న గదుల్లోలనే గడపాలని లిండ్‌మేయర్ సూచించారు. ఇందులో పెద్ద సంఖ్యలో మ్యుటేషన్లు ఉన్నట్టు తెలుస్తోంది. వ్యాక్సిన్లపై దీని ప్రభావం ఎలా ఉంటుందో తెలియడానికి కొన్ని వారాల సమయం పడుతుందని సాంకేతిక బృందం చీఫ్ మరియా వ్యాన్‌కెర్ఖోవ్ తెలిపారు.

అప్రమత్తమైన ఇయు దేశాలు

కొవిడ్19 కొత్త వేరియంట్ వ్యాప్తిని అడ్డుకునేందుకు యూరోపియన్ యూనియన్(ఇయు) దేశాలు అప్రమత్తమయ్యాయి. దక్షిణాఫ్రికా నుంచి విమానాల రాకను శుక్రవారం నుంచి నిలిపివేసే దిశగా చర్యలు ప్రారంభించాయి. దక్షిణాఫ్రికా ప్రాంతం నుంచి విమానాలను అత్యవసరంగా నిలిపివేయాలని సభ్య దేశాలకు తాను ప్రతిపాదిస్తున్నానని ఇయు కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులావాన్‌డర్ తెలిపారు. దక్షిణాఫ్రికాలోని గౌటెంగ్ రాష్ట్రంలో యువకుల్లోనూ ఈ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందడం ఆందోళన కలిగిస్తోందని ఆమె అన్నారు. ఇయులో 27 సభ్య దేశాలున్నాయి. ఉర్సులా ప్రతిపాదన శుక్రవారం రాత్రి నుంచి తమ దేశంలో అమలులోకి రానున్నట్టు జర్మనీ ఆరోగ్యశాఖమంత్రి జెన్స్‌స్పాన్ తెలిపారు. దక్షిణాఫ్రికా నుంచి జర్మనీ పౌరులకు మాత్రమే అనుమతిస్తామని, వారిని కూడా 14 రోజులపాటు క్వారంటైన్‌కు పంపిస్తామని తెలిపారు.

అప్రమత్తమైన కేంద్ర ఆరోగ్యశాఖ

న్యూఢిల్లీ: కొత్త వేరియంట్ పట్ల కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. విదేశీ విమాన ప్రయాణీకుల శాంపిళ్లను(నమూనాలను) సేకరించి పరీక్షలు నిర్వహించాలని, పాజిటివ్ తేలినవారి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం లేబోరేటరీలకు పంపాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కేంద్ర ఆరోగ్యశాఖ ఆదేశించింది. అన్ని రాష్ట్రాలు, యుటిల ప్రధాన కార్యదర్శులతోపాటు ఆరోగ్యశాఖ కార్యదర్శులకు ఈ ఆదేశాలను జారీ చేసింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News