ప్రస్తుతం 200లకు చేరుకున్న కేసుల సంఖ్య
నూతన సంవత్సర వేడుకలతో వైరస్ పుంజుకునే అవకాశం
సంక్రాంతి పండగను కుటుంబ సభ్యులతో చేసుకోవాలని వైద్యుల సూచనలు
హైదరాబాద్: మహానగరంలో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య పెరుగుతుంది. గత వారం రోజుల నుంచి 100 కేసులు నుంచి ఏకంగా 200లు దాటాయి. దీంతో సంక్రాంతి వరకు వైరస్ విరుచుకపడుతుందని వైద్యాధికారులు భావిస్తున్నారు. నూతన సంవత్సరం వేడుకలతో మరిన్ని కేసులు నమోదయ్యే అవకాశముందంటున్నారు. ఇప్పటికే రాష్ట్ర వైద్యాధికారులు వచ్చే నాలుగు వారాలే కీలకమని ప్రకటన చేసిన నగరవాసులు కోవిడ్ నిబంధనల పట్ల అజాగ్రత్తంగా ఉన్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైరస్ విజృంభణ చేస్తే తాము కరోనాపై మరోసారి పోరాటం చేయాల్సి వస్తుందని, మరో నెల రోజుల పాటు సెలవులు లేకుండా విధులు నిర్వహించాల్సి వస్తుందని వైద్య సిబ్బంది పేర్కొంటున్నారు. ప్రజలు గుంపులుగా ఉండటకుండా అత్యవసర పరిస్దితుల్లో రోడ్లపైకి రావాలని సూచిస్తున్నారు. నిర్లక్ష్యం చేస్తే థర్డ్‌వేవ్ రెక్కలు వ్యాపిస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గ్రేటర్ పరిధిలో వారం రోజులుగా నమోదైన పాజిటివ్ కేసులు పరిశీలిస్తే గత 27వ తేదీన 90 కేసులు, గత నెల 28న 110 మందికి సోకగా, గత 29వ తేదీన 121మందికి, 30న 167 కేసులు నమోదుగా, 31వ తేదీన 198కి చేరుకున్నాయి. నగరంలో బస్తీ దవఖానలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో టెస్టుల సంఖ్య పెంచే కేసులు సంఖ్య రెండింతలు పెరగవచ్చని ఆసుపత్రులు మెడికల్ అధికారులు అంచనా వేస్తున్నారు. దగ్గు, జలుబు,జ్వరం లక్షణాలు ఉంటే వెంటనే సమీపంలోని ఆరోగ్య కేంద్రానికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని, పరిస్దితులు విషమించిన తరువాత వచ్చేసరికి ఒకరి నుంచి ఐదారుమందికి సోకుతుందని వెల్లడిస్తున్నారు. నగరంలో ఇంకా వ్యాక్సిన్ తీసుకోని వారుంటే వెంటనే తీసుకోవాలని, దీనిద్వారా వైరస్ సోకిన తట్టుకునే శక్తి ఉంటుందని చెబుతున్నారు. అదే విధంగా షాపింగ్ మాల్స్, పండ్లు, కూరగాయల మార్కెట్ల, బంగారు, వస్త్ర దుకాణాల యాజమానులు కస్టమర్లు మధ్య బౌతిక దూరం పాటించేలా చూడాలని, గిరాకీల కోసం కోవిడ్ నిబంధనలు విస్మరిస్తే లాక్‌డౌన్, కర్పూ అమలు చేస్తే పూర్తిగా దుకాణాలకు తాళం తప్పదని హెచ్చరిస్తున్నారు.