అక్టోబర్ 20 వరకు పాఠశాల మూసివేత
బెంగళూర్: బెంగళూర్‌లోని బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో 60మంది విద్యార్థులకు కొవిడ్19 పాజిటివ్ నిర్ధారణ కావడంతో అక్టోబర్ 20 వరకు మూసివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. పాఠశాలలోని మొత్తం 500మందికి పరీక్షలు నిర్వహించగా, 60మందికి పాజిటివ్ వచ్చిందని.. అయితే, ఇద్దరికి మాత్రమే లక్షణాలు కనిపించాయని బెంగళూర్(అర్బన్) జిల్లా కలెక్టర్ జె.మంజునాథ్ తెలిపారు. లక్షణాలున్న ఆ ఇద్దరిని హాస్పిటల్‌లో చేర్చామని, పాజిటివ్ వచ్చిన మిగతావారిని క్వారంటైన్‌లో ఉంచి వైద్యం అందిస్తున్నామని ఆయన తెలిపారు.
ప్రభుత్వ వైద్య బృందం విద్యార్థుల ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తుందని ఆయన తెలిపారు. పాజిటివ్ వచ్చినవారిలో 14మంది తమిళనాడుకు చెందినవారు కాగా, మిగతావారు కర్నాటకకు చెందినవారు. ఆందోళన చెందాల్సిందేమీలేదని ఆయన అన్నారు. ఈ నెల 26న ఓ విద్యార్థికి వాంతులు, విరేచనాలు కావడంతో పరీక్షించగా పాజిటివ్ వచ్చిందని.. దాంతో, మరుసటిరోజు పాఠశాలలోని విద్యార్థులతోపాటు సిబ్బంది అందరికీ పరీక్షలు చేయించినట్టు ఆయన తెలిపారు. ఈ సంఘటనతో ఆ పాఠశాలకు చెందిన 12వ తరగతి విద్యార్థిని ఒకరు తన ఇంటికి తిరిగి వెళ్తున్నానని తెలిపారు. ఆగస్టు 23 నుంచి కర్నాటకలో 9 నుంచి 12 తరగతుల విద్యార్థులకు ప్రత్యక్ష తరగతులకు అనుమతి ఇచ్చారు.