ఓవల్: ఇంగ్లండ్‌తో నాలుగో టెస్ట్ నాలుగో రోజు ఆట ప్రారంభానికి ముందు టీమిండియాకు షాకింగ్ వార్త తెలిసింది. జట్టు ప్రధాన కోచ్ రవిశాస్త్రికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు బిసిసిఐ కార్యదర్శి జై షా వెల్లడించారు. దీంతో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా రవిశాస్త్రితో సన్నిహితంగా మెలిగిన భారత బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్, ఫిజియో నితిన్ పటేల్‌లను ఐసోలేషన్‌కు తరలించారు. బిసిసిఐ మెడికల్ టీమ్ నుంచి తదుపరి సమాచారం అందేవరకు వీరంతా వేర్వేరుగా ఐసోలేషన్‌లో ఉంటారని జై షా పేర్కొన్నారు. ఇదిలా ఉంటే, ఈ వార్త తెలిసి టీమిండియా సభ్యులంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అయితే ఆటగాళ్లకు మాత్రం ఎవరికీ కరోనా పాజిటివ్ రాలేదు. శనివారం రాత్రి ఒకసారి, ఆదివారం ఉదయం మరోసారి ఆటగాళ్లకు కరోనా పరీక్షలు నిర్వహించగా, అందరికీ నెగెటివ్ వచ్చినట్లు జై షా తెలిపారు. టీమ్ హోటల్‌లో జరిగిన తన పుస్తకావిష్కరణకు హాజరైన తర్వాత రవిశాస్త్రికి కరోనా లక్షణాలు కనిపించినట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి బయటి అతిథులను కూడా అనుమతించారు. ఈ కార్యక్రమానికి భరత్ అరుణ్, ఆర్ శ్రీధర్, నితిన్ పటేల్‌లు వ్యక్తిగతంగా హాజరయ్యారు.