టిఎంసి అధినేత్రి మమత ఆగ్రహం
తెహట్టా: ఢిల్లీ నుంచి వస్తున్న బిజెపి నేతలతోనే బెంగాల్‌లో కొవిడ్ తీవ్రస్థాయికి చేరుకొంటోందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ మండిపడ్డారు. కొవిడ్ పరీక్షలు వంటివి ఏమీ లేకుండా ఉన్న బిజెపి నేతలు మందీమార్బలంతో ఇక్కడికి వస్తున్నారు. వారిలో ఎంత మందికి కరోనా వైరస్ ఉందో తెలియదు. ఇటువంటి వారు ఇక్కడి ఆరోగ్యవంతులైన బెంగాలీలు కరోనాకు గురి అయ్యేలా చేస్తున్నారని టిఎంసి అధినేత్రి విమర్శించారు. ఎన్నికల ప్రచారానికి బిజెపి వెలుపలి వ్యక్తులను బెంగాల్‌లో దింపడం పట్ల మమత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ వైపు నియమనిబంధనలను గాలికొదిలేస్తున్న బిజెపి నేతల పట్ల ఉదాసీనత ప్రదర్శిస్తున్న ఎన్నికల సంఘం టిఎంసి ప్రచార సభలకు పలు ఆంక్షలు విధిస్తోందని విమర్శించారు. తన ఎన్నికల ప్రచార సమయాన్ని ఇసి కావాలనే కుదించిందని అన్నారు. ఏకంగా ఐదురోజుల పాటు తన ఎన్నికల ప్రచార కాలాన్ని తగ్గించారని, ఇది అనుచితం అని చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్రంలో ఇప్పుడున్న కొవిడ్ ఉధృతి దశలో మిగిలిన మూడు దశల పోలింగ్‌లను ఒకేసారి నిర్వహించాలనే తన డిమాండ్‌ను పరిశీలనకు కూడా తీసుకోలేదని ఆరోపించారు.
బెంగాల్‌కు ఢిల్లీ నేతలు ఎవరిని బడితే వారిని తీసుకువస్తున్నారని, దీనితో వైరస్ విజృంభిస్తోందని అన్నారు. ఎవరికైనా వైరస్ సోకడం నేరం అని తాను అనడం లేదని, అయితే ఇటీవలి కాలంలో వైరస్ కేసుల సంఖ్య ఆకస్మికంగా పెరగడం వెనుక బిజెపి అరాచక వ్యవహార శైలిని తాను తప్పుపడుతున్నట్లు తెలిపారు. హౌరా జిల్లాకు చెందిన బిజెపి అభ్యర్థి ఒకరికి కరోనా సోకింది. అయినప్పటికీ ప్రచారానికి వెళ్లుతున్నారని , ఆయన ఇంట్లో ఎందుకు కూర్చోవడం లేదు? ప్రచారానికి ఎందుకు దూరంగా ఉండటం లేదు? అని మమత ప్రశ్నించారు. ప్రజలు ఇప్పటికైనా వెలుపలి వ్యక్తులు ప్రచారానికి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని మమత సలహా ఇచ్చారు. ఈ ఎన్నికలు పంతాలు పట్టింపుల పరిధిలోనివి కావని, బెంగాల్ మహిళా లోకం ఆత్మగౌరవం, రాష్ట్ర సమగ్రతల పరిరక్షణ దిశలో జరుగుతున్నవని అన్నారు.