Saturday, November 23, 2024

46000

- Advertisement -
- Advertisement -

Corona symptoms in 46 thousand people

రెండో రోజు ఫీవర్ సర్వేలో తేలిన లక్షణాలున్న వారి సంఖ్య

అక్కడికక్కడే కిట్ల పంపిణీ
ఒక్కరోజే ఇంటింటా 12లక్షల మందికి పరీక్షలు, తీవ్ర లక్షణాలున్న వారిని ఆసుపత్రులకు తరలింపు
జ్వర సర్వేను దగ్గరుండి పర్యవేక్షించిన మంత్రి హరీశ్ సహా పలువురు అమాత్యులు
రాష్ట్రంలో 4,093 కేసులు

మనతెలంగాణ/హైదరాబాద్ : కొవిడ్ కట్టడి కోసం ప్రభుత్వం చేపట్టిన ఫీవర్ సర్వే రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతోంది. తొలిరోజు ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి సర్వే చేపట్టారు. జ్వరం, జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి కొవిడ్ లక్షణాలు ఉన్నవారికి వెంటనే మెడికల్ కిట్ అందించారు. రాష్ట్రంలో రెండో రోజు జ్వర సర్వే కొనసాగగా, సుమారు 46 వేల మందికి కరోనా లక్షణాలున్నట్టు గుర్తించారు. లక్షణాలున్న ప్రతిఒక్కరికీ హోం ఐసొలేషన్ కిట్స్‌ను అందజేశారు. సర్వేలో చిన్నారులు, పెద్దవారి వివరాలు విడివిడిగా సేకరిస్తున్నారు. ఎక్కువ శాతం పెద్దవారిలోనే కరోనా లక్షణాలున్నట్లు గుర్తించారు. తీవ్ర కరోనా లక్షణాలుంటే వైద్య సిబ్బంది ఆస్పత్రిలో చేర్పిస్తున్నారు. శనివారం రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు సిద్దిపేటలో, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముషీరాబాద్‌లో, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు జనగామ జిల్లాల్లో ఫీవర్ సర్వే తీరును పరిశీలించారు. ప్రతి ఒక్కరూ తప్పకుండా టీకా తీసుకోవాలని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు సూచించారు.

సిద్దిపేటలో ఫీవర్ సర్వే జరుగుతున్న తీరును హరీశ్ పరిశీలించారు. వివిధ వార్డుల్లో తిరిగిన మంత్రి, స్థానికులు వ్యాక్సిన్ తీసుకున్నారో లేదో అడిగి తెలుసుకున్నారు. శుక్రవారం ఒక్కరోజే 12 లక్షల మందికి పరీక్షలు చేసినట్లు వెల్లడించారు. జ్వరం సర్వేలో ఇంటింటిని నేను పరిశీలిస్తున్నానని, ఇప్పటికీ కొందరు సెకండ్ డోసు వ్యాక్సిన్ తీసుకోలేదని తెలిసిందని అన్నారు. అందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలని కోరారు. కచ్చితంగా రెండో డోసు తీసుకోవాలని పేర్కొన్నారు. 60 ఏళ్లు దాటినవారికి బూస్టర్ డోసు ఇస్తున్నామన్నారు. 15 నుంచి 18 ఏళ్ల వారికి టీకా అందుబాటులోకి వచ్చిందని, అర్హులైన అందరూ టీకా తీసుకోవాలని సూచించారు.

నిర్లక్ష్యం వద్దు : తలసాని

కొవిడ్ పట్ల ప్రజలు నిర్లక్ష్యం వహించకూడదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు. ముషీరాబాద్‌లోని మేదరబస్తీలో ఎంఎల్‌ఎ ముఠా గోపాల్‌తో కలిసి మంత్రి ఇంటింటి సర్వేను పరిశీలించారు. ప్రజల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

కరోనా బాధితులతో మంత్రి ఎర్రబెల్లి టెలీ కాన్ఫరెన్స్

పాలకుర్తి నియోజకవర్గంలో నిర్వహిస్తున్న జ్వర సర్వేలో ప్రతి ఒక్కరూ వైద్య పరీక్షలు చేసుకొని ఆరోగ్య సిబ్బంది సలహా మేరకు ఔషధాలను వాడాలని రాష్ట్ర పంచాయితీరాజ్,గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఉద్బోధించారు. పాలకుర్తి నియోజకవర్గంలోని రాయపర్తి, తొర్రుర్, పాలకుర్తి, పెద్దవంగర, కోడకండ్ల, దేవరుప్పుల మండలాలొని కరోనా బాధితులు, అధికారులు,ప్రజాప్రతినిధులతో శనివారం మంత్రి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా బాధితుల యోగ క్షేమాలను తెలుసుకొని కరోనా నివారణకు తగిన సూచనలు చేశారు. కరోనా సోకిన వారు కరోనా కిట్టులోని మందులను వైద్యుల, ఆరోగ్య సిబ్బంది సలహా మేరకు వాడుతూ హోం హైసొలేషన్‌లో ఉండాలని సూచించారు. జనగామ జిల్లా లింగాల ఘనపురం మండలంలోని కుందారం, పాలకుర్తి మండలంలోని ఎల్లారాయని తొర్రూరు గ్రామాల్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఫీవర్ సర్వే తీరును పరిశీలించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News