డెల్టా వేరియంట్ వ్యాప్తిపై ప్రభుత్వం ఆందోళన
బీజింగ్: చైనాలో కరోనా వైరస్‌కు పుట్టినిల్లుగా భావిస్తున్న వుహాన్ నగరంలో స్థానికంగా కరోనా కేసులు తీవ్రంగా వ్యాపిస్తుండడంతో నగరం లోని 11 మిలియన్ మందికి సామూహిక కరోనా పరీక్షలు నిర్వహించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. సోమవారం నగరంలో మూడు కేసులు నిర్ధారణ కాగా, ఏడాదిలో స్వదేశీయంగా కేసులు బయటపడడం ఇదే ప్రథమం. మిగతా ప్రావిన్స్‌ల్లోనూ కరోనా వ్యాపిస్తోంది. ఈ కేసుల్లో చాలావరకు డెల్టా వేరియంట్ కేసులే ఎక్కువగా ఉంటున్నాయి.
జులై మధ్య కాలం నుంచీ దేశీయంగా 400 కంటే ఎక్కువ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు చైనా మొత్తం మీద 93,193 కేసులు నమోదు కాగా, 4636 మరణాలు సంభవించడంతో ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. వుహాన్‌లో క్రితం రోజు కొత్త కేసులు 90 నమోదు కాగా, స్థానికంగా 61 మంది వైరస్ బారిన పడ్డారని, వీరిలో 29 మంది విదేశాల నుంచి వచ్చినవారని నేషనల్ హెల్త్ కమిషన్ మంగళవారం వెల్లడించింది. కొత్త వేరియంట్లపై చైనా వ్యాక్సిన్ల ప్రభావం తక్కువగా ఉన్నప్పటికీ రక్షణ మాత్రం కల్పిస్తున్నాయని ప్రభుత్వ అనుబంధ శాస్త్రవేత్తలు తెలియ చేశారు. చైనాలో స్వదేశీ వ్యాక్సిన్లే ప్రస్తుతం వినియోగిస్తున్నారు. ఇంతవరకు1.6 బిలియన్ డోసులు పంపిణీ అయ్యాయి.
Corona tested for 11 million people in Wuhan