నగరంలో వ్యాక్సిన్ పంపిణీకి ప్రత్యేక బృందాలు
ఆశా, అంగన్‌వాడీ వర్కర్ల ద్వారా ప్రతి రోజు టీకా ముమ్మరం
డోసులు, సిరంజిలు సరిపడేలా సిద్దం చేస్తున్న వైద్యశాఖ
మన తెలంగాణ సిటీబ్యూరో: నగరంలో మరోసారి కరోనా వైరస్ విస్తరించకుండా వైద్యశాఖ అధికారులు కరోనా వ్యాక్సిన్ తీసుకోనివారికి పంపిణీ చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. గ్రేటర్‌లో వందశాతం వ్యాక్సిన్ పూర్తి చేసేందుకు ఏర్పాటు వేగం పెంచారు. ఇతర దేశాల్లో మళ్లీ కరోనా ఉనికి చాటుతుండటంతో ముందు జాగ్రత్తలో భాగంగా మొదటి డోసు తీసుకుని సెకండ్ డోసు తీసుకోని వారిని వైద్య సిబ్బంది గుర్తించి వారికి టీకా వేసేందుకు ప్రత్యేక బృందాలు సిద్దం చేస్తున్నారు. ఈప్రత్యేక టీమ్‌లో ఆశావర్కర్, అంగన్వాటీ వర్కర్ వీఆర్‌ఏ సభ్యులుగా చేసి, ప్రతి మండలానికి ఒక ప్రత్యేకాధికారి నియమించి ప్రతి రోజు వ్యాక్సిన్ ముమ్మరంగా జరిగే చర్యలు చేపడుతున్నట్లు జిల్లా వైద్యాధికారులు వెల్లడిస్తున్నారు.అందుకోసం సరిపడ వ్యాక్సిన్ డోసులు, సిరంజిలు కూడా అందుబాటులో ఉంచుతున్నట్లు, కోవిడ్ మహమ్మారి నుంచి కాపాడేందుకు కేవలం రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోవడమే ఏకైక మార్గమనే సందేశాన్ని ప్రతి ఒకరిలో కల్పించేలా టీకా సమర్దవంతంగా చేపడుతున్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు.
గ్రేటర్ మూడు జిల్లాల పరిధిలో ఇప్పటివరకు 1,14,93,410 మంది వ్యాక్సిన్ తీసుకోగా హైదరాబాద్ జిల్లా పరిధిలో 47,94,882మందికి టీకా వేయగా, అందులో మొదటి డోసు 30,89,620 మంది, సెకండ్ డోసు 17,05,226మంది తీసుకున్నారు. రంగారెడ్డిలో 34,17, 390 మంది తీసుకోగా, మొదటి డోసు 22, 49, 720 మంది, సెకండ్ డోసు 11,69,456మంది, మేడ్చల్ జిల్లాలో 32,86,996మందికి వ్యాక్సిన్ పంపిణీ చేయగా, మొదటి డోసు 20,85,893మంది, సెకండ్ డోసు 11.98,103మంది తీసుకున్నట్లు ఆయా జిల్లా వైద్యాధికారులు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
ఇందులో మొదటి డోసు తీసుకున్నవారు సెకండ్ డోసు తీసుకునేందుకు ఉత్సహం చూపడంలేదని వారందరికి ప్రత్యేక బృందాలు ఇంటింటా తిరిగి వ్యాక్సిన్ తీసుకునేలా అవగాహన కల్పించిన టీకాను సమీప ఆరోగ్య కేంద్రాల్లో అందుబాటులో ఉంచుతామని వైద్యులు చెబుతున్నారు. నవంబర్ రెండో వారంలోగా గ్రేటర్ పరిధిలో వందశాతం టీకా పంపిణీ పూర్తి చేసి థర్డ్‌వేవ్ వచ్చి తట్టుకునేలా చేస్తామంటున్నారు. నగర ప్రజలు వైరస్ పట్ల నిర్లక్షం చేయకుండా ముఖానికి మాస్కులు ధరించాలని, జేబుల్లో శానిటైజర్ ఉంచుకోవాలని, ప్రధానంగా మాల్స్, దుకాణాల్లో జనం రద్దీ ఉందని, యాజమాన్యాలు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. కరోనా పుట్టినిల్లు చైనాలో లాక్‌డౌన్ విధించారని, అలాంటి పరిస్దితులు రాకుండా అందరికి కలిసి వైరస్ ఎదుర్కొవాలని పేర్కొంటున్నారు.