రాజ్యాంగ కమిటీలో కీలక పాత్రధారి
న్యూఢిల్లీ : పలు విశిష్టతల 107 సంవత్సరాల వయోవృద్ధుడు కేవల్ క్రిషన్ సోమవారం కొవిడ్ టీకా వేయించుకున్నారు. ఈ పెద్దాయన పలు ప్రత్యేకతల ఘనమైన భారతీయుడు. ప్రాణాంతకపు 1918 స్పానిష్ ఫ్లూ దశలో ఆయన ఐదేండ్ల బాలుడు, తరువాతి క్రమంలో దేశానికి స్వాతంత్య్రం వచ్చిన సమయంలో రాజ్యాంగ అసెంబ్లీ రూపకల్పన కమిటీలో పాలుపంచుకున్నారు. దేశరాజధాని ఢిల్లీలో తన తండ్రి కొవిషీల్డ్ టీకా పొందినట్లు కుమారుడు 72 సంవత్సరాల అనిల్ కృష్ణ సోమవారం తెలిపారు.గత ఏడాది మార్చిలో దేశంలో కరోనా సంబంధిత లాక్‌డౌన్ తరువాత ఆయన ఇంటి నుంచి బయటకు రావడం ఇదే తొలిసారి అని, కొవిడ్ టీకా వేసుకోవడానికి దక్షిణ ఢిల్లీలోని ఇంటినుంచి వైద్య కేంద్రానికి వచ్చారని అనిల్ తెలిపారు.
రెండేళ్ల క్రితం ఆయనకు ఆపరేషన్ జరిగిన ఆసుపత్రికే తీసుకువెళ్లామని, అక్కడనే టీకా వేయించామని వివరించారు. కరోనా దశలోనే తాము తండ్రి నుంచి 1918 నాటి ఫ్లూ గురించి తెలుసుకున్నామని , దీని గురించి ఆయన పెద్దగా చెప్పలేకపొయ్యారని తెలిపారు. తన తండ్రి జలంధర్ జిల్లాలోని కర్తార్‌పూర్‌లో 1913 ఆగస్టు 4వ తేదీన జన్మించారని, 1930లో తాము ఢిల్లీకి తరలివచ్చినట్లు కుమారుడు వివరించారు. తండ్రి చాలా కష్టపడే మనిషి అని, హోం, రక్షణ మంత్రిత్వశాఖలలో పనిచేశారని, తరువాత రాజ్యాంగ నిర్మాణ కమిటీలో కూడా ఉన్నారని తెలిపారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత 1930లో రాజ్యసభ డిప్యూటీ సెక్రెటరీగా కూడా వ్యవహరించారని చెప్పారు. 1948లో రాజ్యాంగ నిర్మాత ఇతర ప్రముఖుల వరుసలో తండ్రి కేవల్ ఉన్నప్పటి పాత ఫోటోను అనిల్ విలేకరులకు చూపించారు.