కేంద్ర మంత్రి హర్షవర్ధన్ వెల్లడి
చెన్నై: కొవిడ్-19 మహమ్మారిని కట్టడి చేసేందుకు దేశ ప్రజలందరికీ వ్యాక్సిన్ అందచేసే కల సాకారం కానున్నదని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ తెలిపారు. కరోనా వైరస్ బారినపడే అవకాశం ఎక్కువ ఉన్న వ్యక్తులను, గ్రూపులను గుర్తించి ప్రాధాన్యతా క్రమంలో వ్యాక్సిన్ అందచేసేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.
కొవిడ్ వ్యాక్సిన్ డ్రై రన్‌ను శుక్రవారం నాడిక్కది రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆసుపత్రిలో హర్షవర్ధన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ వ్యాక్సిన్ పొందవలసి ఉన్న లబ్ధిదారుల వివరాలను సేకరించేందుకు ఒక కొత్త కొవిడ్ వేదికను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిందని, వారికి ఎలెక్ట్రానిక్ సర్టిఫికెట్స్‌ను అందచేయడం జరుగుతుందని ఆయన చెప్పారు. అత్యంత తక్కువ సమయంలో కొవిడ్ వ్యాక్సిన్లను అభివృద్ధి చేయడంలో భారతదేశం విశేష ప్రతిభను కనబరిచిందని, ప్రస్తుతం అత్యవసరంగా ఉపయోగించేందుకు రెండు వ్యాక్సిన్లకు కేంద్రం అనుమతి ఇచ్చిందని ఆయన చెప్పారు. రానున్న రోజుల్లో దేశ ప్రజలందరికీ కరోనా టీకా అందచేయగలమన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు.