వ్యాక్సిన్లపై గ్రామీణ ఆరోగ్యసిబ్బంది అనాసక్తి?
తక్షణం దృష్టి సారించిన కేంద్ర ఆరోగ్య శాఖ
ఈ దిశలో రాష్ట్రాలతో సంప్రదింపులు
న్యూఢిల్లీ: గ్రామీణ ప్రాంతాలలో ఆరోగ్య సిబ్బంది వ్యాక్సిన్ల విముఖత వార్తలపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ శుక్రవారం స్పందించింది. ఈ అంశం గురించి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో సంప్రదిస్తున్నట్లు తెలిపింది. సమాజంలోని కొన్ని వర్గాలు ఇప్పటికీ కొవిడ్ వ్యాక్సిన్లు వేసుకోవడానికి తటపటాయిస్తున్నాయి. ఇందుకు పలు కారణాలు ఉన్నాయి. అయితే గ్రామీణ ప్రాంతాలలో హెల్త్ వర్కర్లు టీకాలు తీసుకోవడానికి ఎక్కువగా ముందుకు రాకపోవడం కీలక పరిణామమని పత్రికలలో వార్తలు వెలువడ్డాయి. ఇది నిజంగానే సమస్య అని, దీనిని పరిష్కరించేందుకు అన్ని స్థాయిల్లో చర్యలు తీసుకుంటామని, సంబంధిత పక్షాలతో చర్చిస్తామని కేంద్రం ఈ వార్తలపై స్పందించింది. దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ల పట్ల కొంత విముఖత ఉందనేది ఓ పరిణామం అయిందని ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది.
ఈ ఏడాది జనవరి 16 నుంచి కేంద్రం సమర్థవంతమైన వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని సంపూర్తి ప్రభుత్వ దృక్పధంతో అమలు చేస్తోందని , ఈ దిశలో రాష్ట్రాలు, యుటిలకు ఎప్పటికప్పుడు సహకారం అందిస్తోందని మంత్రిత్వశాఖ తెలిపింది. వ్యాక్సిన్ల తటాయింపుల అంశాన్ని శాస్త్రీయ పద్ధతులలో అధ్యయనం చేయాల్సి ఉంటుంది. సామూహిక సామాజిక స్థాయిల్లో దీనిని పరిష్కరించుకోవల్సి ఉంటుందని తెలిపారు. కేంద్రం సమగ్రరీతిలో కొవిడ్ 19 వ్యాక్సిన్ కమ్యూనికేషన్ స్ట్రాటజీని రూపొందించింది. ఇందులో వ్యాక్సిన్ల పట్ల నెలకొనిఉన్న విముఖత అంశాన్ని కూడా ప్రధానంగా తీసుకోవడం జరిగిందని కేంద్రం తెలిపింది. వ్యాక్సిన్ వ్యూహం వివరాలను కేంద్రం రాష్ట్రాలు , యుటిలతో దేశంలో వ్యాక్సినేషన్ ఆరంభం నాటి నుంచి పంచుకుంటూ వస్తోందని మంత్రిత్వశాఖ తమ అధికారిక ప్రకటనలో తెలిపింది. హోం మంత్రిత్వశాఖ ఎప్పటికప్పుడు వివిధ వర్గాలలో ప్రత్యేకించి హెల్త్ వర్కర్లలో ఉన్న వ్యాక్సిన్ తటపటాయింపు అంశంపై దృష్టి సారించింది. సంబంధిత రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో ఈ విషయం గురించి చర్చిస్తోందని వివరించారు.