Friday, November 15, 2024

టీకారణ్యం!

- Advertisement -
- Advertisement -

Corona Vaccine shortage in India

 

కేంద్రం ప్రకటించిన కార్యక్రమం ప్రకారం దేశంలోని వయోజనులందరికీ కరోనా టీకా పంపిణీ నేడు ప్రారంభం కావాలి. వీరిలో 45 ఏళ్లు మించిన వారికి (30 కోట్ల మంది)కి ఇప్పటికే టీకాలు వేస్తున్నారు. నేటి నుంచి 18 -45 ఏళ్ల (60 కోట్ల మందికిపైగా) వారికి టీకా వేయడం మొదలవ్వాలి. కాని వాస్తవ పరిస్థితి అందుకు బొత్తిగా అనుకూలంగా లేదు. 18 -45 ఏళ్ల వారికి అవసరమైన టీకా, ఉత్పత్తి సంస్థల నుంచి తగినన్ని డోసులు రాష్ట్రాలకు చేరేటట్టు చూడవలసిన బాధ్యత కేంద్రానిదే. ఈ పనిని పూర్తి చేయడంలో అది ఘోరంగా విఫలమైంది. అనేక రాష్ట్రాలు ఈ నూతన టీకా కార్యక్రమం విషయంలో చేతులెత్తేశాయి. అవసరమైనన్ని టీకా డోసుల కోసం ఉత్పత్తి కంపెనీలకు ఆర్డర్లు పంపించి వెంటపడి అర్థించినా ఫలితం కనిపించడం లేదని అవి మొత్తుకుంటున్నాయి. మే నెలాఖరు లేదా జూన్ మాసారంభంలో మాత్రమే సరఫరా చేయగలమని టీకా తయారీ కంపెనీలు తెగేసి చెప్పినట్టు కేరళ ఆరోగ్య శాఖ మంత్రి కెకె శైలజ తెలియజేశారు. జార్ఖండ్ కూడా ఇదే అభిప్రాయం వెలిబుచ్చింది. తమిళనాడు, పంజాబ్, రాజస్థాన్ తదితర కొన్ని రాష్ట్రాల పరిస్థితి ఇదే.

తమిళనాడు కోటి 50 లక్షల డోసుల టీకా సరఫరాకు ఆర్డరు ఇచ్చి ఇంకా ఎదురు తెన్నులు చూస్తున్నది. డబ్బిచ్చి కొందామన్నా వ్యాక్సిన్ అందుబాటులో లేదని జార్ఖండ్ రాష్ట్రం వెల్లడించింది. ఇదిలా ఉంటే ఇప్పటికే పంపిణీ మొదలైన 45 ఏళ్ల పైబడిన వారికి వ్యాక్సిన్ కొరత కారణంగా రెండో డోసు వేయడం దాదాపు ఆగిపోయింది. ముందుగా ఇచ్చిన తేదీల్లో రెండో టీకా వేయడం సాధ్యం కాదని పొట్టి సందేశాల ద్వారా తెలియజేస్తున్నారు. దీని కోసం ఎంత కాలం ఆగాలో తెలియక ప్రజలు అయోమయావస్థను ఎదుర్కొంటున్నారు. 18 ఏళ్లు పైబడిన వారు కొవిన్ యాప్ ద్వారా ముందుగా తమ పేరు నమోదు చేసుకోడం తప్పనిసరి చేశారు. ఇది కోట్లాది మంది గ్రామీణ అణగారిన వర్గాల ప్రజలకు అలవికాని మార్గం. అయినా లక్షలాది మంది ఇప్పటికే యాప్ ద్వారా పేర్లు నమోదు చేసుకొని చాన్తాడు క్యూలో ఉన్నారు. వ్యాక్సిన్ సరఫరా నెల రోజుల ఆలస్యమైతే కొవిడ్ మరింత ఉద్ధృతంగా సోకుతుందని అది చాలా ప్రమాదకరమని కేరళ ఆరోగ్య మంత్రి హెచ్చరించారు.

వ్యాక్సిన్‌ను సకాలంలో అందుబాటులో ఉంచవలసిన బాధ్యత కేంద్రానిదేనని ఆమె స్పష్టం చేశారు. 136 కోట్ల మంది దేశ జనాభాలో 11.5 శాతం మందికి అంటే దాదాపు 12 కోట్ల మందికి ఇంత వరకు టీకాలు అందాయి. వీరిలో రెండు విడతలు వేయించుకున్న వారు రెండున్నర కోట్ల మంది మాత్రమే కావడం గమనార్హం. మిగతా దాదాపు 90 కోట్ల మందికి టీకా ఎప్పుడు పంపిణీ కావాలి? వ్యాక్సిన్‌కు తీవ్ర కొరత ఏర్పడిన ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ప్రశ్న అమిత భీతిని కలిగిస్తున్నది. జనాభాలో అత్యధిక శాతం మందికి టీకా పూర్తిగా పడినప్పుడే సామూహిక రోగ నిరోధక శక్తి (హెర్డ్ ఇమ్యూనిటీ) ఏర్పడి వైరస్ తోక ముడుస్తుందని నిపుణులు భావిస్తున్నారు. ఆ స్థితి ఎప్పుడు కలుగుతుంది? దానిని సాధించడానికి ఏమేమి చర్యలు తీసుకుంటున్నారో దేశ ప్రజలకు సవివరంగా తెలియజేయవలసిన బాధ్యత గల కేంద్ర ప్రభుత్వం అందులో విఫలమైంది. గురువారం నాటికి రాష్ట్రాల వద్ద 1.27 కోట్ల డోసుల వ్యాక్సిన్ ఉందని కేంద్రం తాజాగా చెప్పింది.

కోట్ల డోసుల కిమ్మత్తు గల డిమాండ్‌తో పోలిస్తే ఇది చాలా తక్కువ. అందుకే రాష్ట్రాలు వ్యాక్సిన్‌ను విరివిగా వేయడానికి బదులు అదనపు సరఫరాలు వచ్చే వరకు పొదుపును పాటిస్తున్నాయి. టీకా వేయడానికి తెరిచిన చాలా కేంద్రాలను కొన్ని రాష్ట్రాల్లో మూసివేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రైవేటు ఆసుపత్రులకు వ్యాక్సిన్ సరఫరాను నిలిపివేసింది. దేశం మొత్తమ్మీద గల టీకా అందుబాటు పరిస్థితిని ఒక చోట పెట్టి చూస్తే కొరత ఒక పర్వతంలా కనిపిస్తున్నది. ప్రాణాలను పిట్టలను కాల్చి రాల్చినట్లు కబళిస్తున్న ఈ మహా జాతీయ విపత్తులో కేంద్రమే తలచుకొని దేశ ప్రజలందరికీ ఉచితంగా టీకాలు వేయించవలసి ఉండగా ప్రతి ఒక్కరూ 400 లేక 500 రూపాయలు పెట్టుకుంటే గాని అది లభించని దుస్థితిని కల్పించింది.

45 సంవత్సరాలు పైబడిన వారికి టీకాను సరఫరా చేసే బాధ్యత తీసుకున్న కేంద్ర ప్రభుత్వం 1845 ఏళ్ల వారికి దానిని అందించే కర్తవ్యాన్ని రాష్ట్రాలకు వదిలేసింది. ఆ టీకాకు ధర నిర్ణయించే స్వేచ్ఛను కంపెనీలకు ఇచ్చేసింది. ఈ విధానాన్ని సుప్రీంకోర్టు కూడా తప్పు పట్టింది. టీకాను పలు కంపెనీలలో ఉత్పత్తి చేయడానికి వీలుగా పేటెంట్ చట్టం 92వ సెక్షన్ కింద నిర్బంధ లైసెన్సులను ఎందుకు జారీ చేయలేదని సుప్రీంకోర్టు కేంద్రాన్ని నిలదీసింది. అమెరికాలోనే తక్కువ ధరకు టీకాను వేస్తున్నప్పుడు మన దేశంలో కేంద్రానికి రూ. 150కి, రాష్ట్రాలకు రూ.300, రూ.400లకు టీకాలు విక్రయించడమేమిటని ప్రశ్నించింది. అయినా కేంద్రంలో కదలిక లేదు. ఇందువల్ల దేశ ప్రజలందరికీ ఒకే రీతిలో కనీసం అందుబాటులోని ధరకైనా టీకాను సత్వరమే పంపిణీ చేసే అవకాశాలు మూసుకుపోయాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News