Monday, December 23, 2024

కరోనా మన కంట్రోల్ లోనే: ఎర్రబెల్లి

- Advertisement -
- Advertisement -

మన కంట్రోల్ లోనే కరోనా

ఉధృతి ఎక్కువ తీవ్రత తక్కువ

హాస్పిటల్స్ కి వెళుతున్న కరోనా బాధితుల సంఖ్య అత్యల్పం

ప్రభుత్వ దవాఖానా లలో ఖాళీగా కరోనా బెడ్లు

ఆందోళన అనవసరం…అయినా జాగ్రత్తలు పాటిద్దాం

జ్వర సర్వే ప్రకారంగా కూడా కరోనా బాధితులు తక్కువే, సాధారణ జలుబు బాధితులు ఎక్కువ

సిఎం నిర్ణయం మేరకు త్వరలోనే పంటల నష్టాలకు పరిహారం

Corona virus control in Telangana

జనగామ జిల్లా పరిధిలోని స్టేషన్ ఘనపూర్, జనగామ, పాలకుర్తి నియోజకవర్గాలలోని కరోనా నియంత్రణ, వ్యాక్సినేషన్, కరోనా నివారణకు ప్రభుత్వ పరంగా వైద్యశాలలో చేస్తున్న ఏర్పాట్లు, వ్యాక్సినేషన్, పంట నష్టం అంచనాలు వంటి పలు అంశాలపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమీక్ష

జనగాం: కరోనా నియంత్రణలో తెలంగాణ రాష్ట్రంతోపాటు జనగామ జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లాలు ప్రశంసనీయ స్థానంలో ఉన్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఈనెల 23వ తేదీ వరకు నిర్వహించిన జ్వర సర్వే పూర్తి అయిందన్నారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మీడియాతో మాట్లాడారు. కరోనా నియంత్రణకు అన్ని విధాలుగా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి చెప్పారు. మూడో విడత కరోనా విజృంభణ కాస్త ఎక్కువగా ఉన్నప్పటికీ తీవ్రత మాత్రం చాలా తక్కువగా ఉందని వైద్యశాలల అవసరం లేకుండానే ఇంట్లో ఇసోలేషన్ లో ఉండి వైద్యం చేసుకుంటే సరిపోతుందని మంత్రి తెలిపారు.

పంట నష్టాల అంచనా కూడా పూర్తి అయిందని అన్నారు. జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్, జనగామ, పాలకుర్తి నియోజకవర్గాల పరిధిలో కరోనా నియంత్రణ, వ్యాక్సినేషన్, కరోనా నివారణకు ప్రభుత్వ పరంగా వైద్యశాలలో చేస్తున్న ఏర్పాట్లు, వ్యాక్సినేషన్, పంట నష్టం అంచనాలు వంటి పలు అంశాల మీద మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జనగామ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జనగామ జడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి, జిల్లా ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, తాటికొండ రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, జిల్లా కలెక్టర్, ఆయా శాఖల అధికారులతో కలిసి సమీక్షించారు.

ఈ సారి కరోనా ఉద్ధృతి ఎక్కువగా ఉన్నప్పటికీ దాని తీవ్రత చాలా తక్కువగా ఉందని, దవాఖానా లలో చికిత్స పొందుతున్న వారి సంఖ్య కూడా అతి తక్కువగా ఉందని ఎర్రబెల్లి చెప్పారు. జనగామ జిల్లాలో కేవలం ముగ్గురు మాత్రమే ప్రభుత్వ దవాఖానాలలో చికిత్స పొందుతున్నట్లు మంత్రి తెలిపారు. దీన్నిబట్టి కరోనాకు భయపడాల్సిన పని లేదు అనే విషయం స్పష్టం అవుతుందని మంత్రి ప్రజలకు తెలిపారు. జనగామ జిల్లాలో మూడో విడత కరోనా కారణంగా 1,166 యాక్టివ్ కేసులు ఇప్పటివరకు నమోదయ్యాయని మంత్రి చెప్పారు. కేసుల నమోదు శాతం 11.46% ఉందన్నారు.

అందుబాటులో బెడ్ లు

జనగామ జిల్లాలో 100 ఐసోలేషన్ బెడ్లు, 154 ఆక్సీజన్ బెడ్లు, 15 ఐసియు బెడ్ లు, మరో పది ఐసియు తో పాటు వెంటిలేటర్ గల బెడ్ల ను ప్రజల కోసం సిద్ధంగా ఉంచామని మంత్రి ఎర్రబెల్లి వివరించారు. జనగామ జిల్లా హాస్పిటల్ లో, అలాగే మాతా శిశు హాస్పిటల్ మొత్తం 258 బెడ్ లలో 256 బెడ్స్ ప్రజలకు అందుబాటులోనే ఉన్నాయి అని మంత్రి తెలిపారు.

వ్యాక్సినేషన్
మొదటి డోస్ వ్యాక్సినేషన్ పూర్తయిన వారు నాలుగు లక్షల 15 వేల ఐదు వందల అరవై తొమ్మిది మంది. జిల్లాలో రెండో పూర్తి చేసుకున్న వారి సంఖ్య మూడు లక్షల 55 వేల 488. ఇంకా రెండో తీసుకోవాల్సిన వారి సంఖ్య 60 వేల 81. బూస్టర్ డోస్ తీసుకునే వారి సంఖ్య 4,857. అని మంత్రి వివరించారు.

కిట్స్ పంపిణీ
జిల్లాలో ఇప్పటివరకు 77,255 కరోనా కిట్లను పంపిణీ చేశామని మరో 13 వేల 777 కిట్లు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని మంత్రి చెప్పారు. అలాగే కోటి 5 లక్షల రూపాయలను 200 మందికి ఎక్స్గ్రేషియాగా చెల్లించామని మంత్రి తెలిపారు.

ఫీవర్ సర్వే

ఫీవర్ సర్వేలో లో జనగామ జిల్లా ప్రశంసనీయ స్థానంలో ఉందని మంత్రి అన్నారు. జనగామ జిల్లాలో 453 జ్వర సర్వే బృందాలను ఏర్పాటు చేశామని, వీరిలో 393 బృందాలు గ్రామీణ ప్రాంతాల్లో, 60 బృందాలు పట్టణ ప్రాంతంలో పని చేశాయన్నారు. ఈ బృందాలు జ్వర సర్వే ద్వారా కరోనా లక్షణాలు ఉన్న వారిని 5,916 మంది గా గుర్తించారని వాళ్లకి వెంటనే అక్కడికక్కడే కరోనా కిట్లను పంపిణీ చేశారని తెలిపారు. సర్వే పర్యవేక్షించడానికి 281 మంది అధికారులను గ్రామాల వారీగా నియమించినట్లు మంత్రి వివరించారు.

పంట నష్టాల అంచనా

ఇటీవల కురిసిన అకాల వడగండ్ల వానలకు జరిగిన పంట నష్ట అంచనాలను మంత్రి వివరించారు. జనగామలో 77 ఎకరాలలో, స్టేషన్ ఘన్ పూర్ లో 40 ఎకరాల లో, పంట నష్టాలు జరిగాయని అన్నారు. పాలకుర్తి నియోజకవర్గంలోని పాలకుర్తిలో 197 ఎకరాలలో, దేవరుప్పుల లో 50 ఎకరాలలో, కొడకండ్ల లో 412 ఎకరాలలో పంట నష్టం జరిగిందన్నారు. మొత్తం ఈ మూడు నియోజకవర్గాల్లో కలిపి 776 ఎకరాల్లో పంట నష్టం సంభవించినట్లు అంచనా వేశామని చెప్పారు. త్వరలోనే సిఎంకు నివేదికలు పంపించి పంట నష్ట పరిహారం అందే విధంగా చూస్తామని మంత్రి ఎర్రబెల్లి వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News