పసి పిల్లలకు దూరంగా కరోనా
లండన్ : బాలలకు కరోనా వైరస్ పెద్ద ముప్పుగా పరిణమించడం లేదు. కొవిడ్ 19 వైరస్‌తో పిల్లల్లో తీవ్రస్థాయి అనారోగ్యం వాటిల్లడం లేదు, ప్రాణాలకు ముప్పు కూడా తక్కువగానే ఉంటోంది. పిల్లలు, యుక్తవయస్కులలో ఈ పరిణామం ఉందని యూనివర్శిటీ కాలేజ్ లండన్ (యుసిఎల్) పరిశోధకుల అధ్యయనంలో స్పష్టం అయింది. కరోనా వైరస్ ప్రపంచాన్ని చుట్టేసిన నాటి నుంచి కూడా వయో వృద్ధులు, ఇతరత్రా తీవ్రస్థాయి జబ్బులు ఉన్న నడివయస్కులు అత్యధికంగా వైరస్‌తో మృతి చెందారు. సుదీర్ఘ చికిత్సలకు గురి అయ్యారు. పిల్లల్లో ఈ వైరస్ ఎక్కువ ప్రభావం చూపి ఉంటే దీని ఎఫెక్ట్ మరింత దారుణంగా ఉండేదని విశ్లేషణలలో వెల్లడైంది. బ్రిటన్‌లో ప్రజా ఆరోగ్య సంబంధిత గణాంకాలను, సంబంధిత అంశాలను పూర్తి స్థాయిలో అధ్యయనం చేసుకుని పరిశోధకులు పిల్లలపై కరోనా ఎఫెక్ట్ నామమాత్రమే అనే అంశాన్ని నిర్థారించారు.
అయితే యువజనులకు సంబంధించి కూడా ఈ వైరస్‌తో పెద్దగా ముప్పు వాటిల్లకపోయినా, అనారోగ్య సమస్యలు, సరైన జీవనవిధానం లేని వారికి ఇది సోకితే తీవ్రస్థాయిలో నష్టం కల్గిస్తుందని అధ్యయనంలో తేల్చారు. యుసిఎల్‌తో పాటు బ్రిస్టల్, న్యూయార్క్, లివర్‌పూల్ వర్శిటీల పరిశోధకులు కూడా ఈ సంయుక్త అధ్యయనంలో పాల్గొన్నారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని ప్రపంచవ్యాప్తంగా 18 ఏళ్లలోపు వారికి టీకాల కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాల్సి ఉందని సూచించారు. పిల్లలకు వ్యాక్సినేషన్ దిశలో సాగుతోన్న ప్రయోగాలను వేగిరపర్చాల్సి ఉందని పరిశోధకులు అభిప్రాయపడ్డారు. వేర్వేరుగా జరిగిన మూడు అధ్యయనాల నిర్థారణలను మెడ్‌ఆర్‌క్సివ్ ప్రీ ప్రింట్ సర్వర్‌లోపొందుపర్చారు.