ఐఐటి కాన్పూర్ ప్రొఫెసర్ అగర్వాల్ అంచనా
న్యూఢిల్లీ : దేశంలో కరోనా మూడోవేవ్ మొదలైనట్టేనని వైద్యనిపుణులు అంచనా వేస్తున్న నేపథ్యంలో జనవరి నెలాఖరుకు దేశంలో కరోనా కేసుల సంఖ్య గరిష్ఠ స్థాయి( పీక్) కి చేరుకుంటుందని ఐఐటి కాన్పూర్ ప్రొఫెసర్ మణీంద్ర అగర్వాల్ తాజాగా వెల్లడించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం పీక్ సమయంలో నమోదయ్యే కేసులు .. సెకండ్ వేవ్ ఉధ్ధృత దశలో బయటపడిన కేసుల సంఖ్యను మించే అవకాశం ఉందని తెలిపారు.వారానికి సగటున నాలుగు నుంచి ఎనిమిది లక్షల కేసులు వస్తాయని అంచనా వేశారు. అనంతరం కేసుల తగ్గుదల కూడా అంతే వేగంగా ఉంటుందని భావిస్తున్నామన్నారు.
ఒకవేళ జనవరి చివర్లో గరిష్ఠ స్థాయి నమోదైతే మార్చి మధ్యనాటికి ఈ వేవ్ ముగుస్తుందని చెప్పారు. మహానగరాల్లో కరోనా పరిస్థితులపై అగర్వాల్ మాట్లాడుతూ ఢిల్లీలో జనవరి మధ్య నాటికి గరిష్ఠ స్థాయి నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఈ సమయంలో రోజుకు దాదాపు 40 వేల కేసులు బయటపడతాయని అంచనా వేశారు. ముంబై, కోల్‌కతా లోను ఈ నెల మధ్యనాటికి గరిష్ఠ కేసులు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. అయితే నెలాఖరుకు ఈ నగరాల్లో ప్రస్తుత వేవ్ దాదాపు ముగుస్తుందన్నారు. దేశంలో కరోనా వ్యాప్తిని ట్రాక్ చేసే సూత్ర కంప్యూటర్ మోడల్‌కు అగర్వాల్ నేతృత్వం వహిస్తున్నారు. గణిత సూత్రాల ఆధారంగా కేసులను అంచనా వేశారు.