Monday, November 25, 2024

మోడీని పొగిడిన నోటితోనే..

- Advertisement -
- Advertisement -

గత ఏడాది వచ్చిన కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో భారత ప్రధాని మోడీ అఖండ విజయం సాధించాడని దేశ, విదేశాలు, పాశ్చాత్య మీడియా ప్రశంసించడం మనందరికీ తెలిసిందే. మరి ఈ రోజు దేశ విదేశీ టెలివిజన్ ఛానళ్ళన్నీ మోడీని ఎత్తిపొడుస్తున్నాయి. పొగిడిన నోటనే తిడుతున్నారు. కరోనా అదుపు తప్పిన దేశాలలో భారత్ మొదటి స్థానంలో వుందని న్యూయార్క్ టైమ్స్ 5 రోజుల క్రితం ఓ కథనాన్ని ప్రచురించింది. ఇండియాలో సెకండ్ వేవ్ మరణ మృదంగం మోగిస్తున్నదని, భారత ప్రభుత్వం ఏ విధంగా కంట్రోల్ చేయడంలో దారుణంగా విఫలం చెందిందో వివరిస్తూ ఈ నెల 20న బిబిసిలో ప్రత్యేక కథనం ప్రసారం చేశారు. ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా ఏప్రిల్ 22న భారతదేశంలో 3 లక్షల కేసులు నమోదు అయ్యాయని ఇది ప్రపంచ రికార్డు అని రాయిటర్స్ అన్న వార్తా సంస్థ ప్రచురించింది.

యాహూ న్యూస్‌లో కవితా పటల్ కూడా కరోనా కట్టడిలో మోడీ వైఫల్యాల్ని ఎత్తిచూపింది. ఇలా ప్రపంచంలోని అనేక వార్తా పత్రికలు, వార్తా ఛానళ్ళు కూడా కేంద్రాన్ని దుమ్మెత్తిపోస్తున్నాయి. గత ఏడాది అన్ని దేశాలు మోడీని అభినందించినవారే. భారతదేశానికి ఒక మంచి నాయకుడు లభించాడని విదేశీ ప్రతికలు ఆనాడు మోడీని ప్రశంసిస్తుంటే మనందరం చాలా సంతోషించాం, గర్వపడ్డాం. మరి ఈ సెకండ్ వేవ్ కోవిడ్ విషయంలో మోడీ ఎందుకు ఫెయిల్ అయ్యాడు? మేథా సంపత్తి సంపూర్ణంగా వున్న మోడీ ఎందుకు ఈసారి అంతగా విఫలం చెందాడు. ప్రపంచ పటంపై ఇండియా జెండా ఎగరవేసిన మోడీ ఎందుకిలా చతికిలపడ్డాడు? ఒక్కసారిగా భారతదేశ ప్రతిష్ఠలు ఇలా దిగజారిపోయాయి? భారతదేశంలో ఈ రోజు మరణమృదంగం మ్రోగిస్తున్నది. ఎక్కడ చూసినా బాధితుల ఆర్తనాదాలే.

2019 ఆఖరులో కొవిడ్ మహమ్మారి భారతదేశ ప్రవేశం చేసినపుడు, ఎంతో ముందు చూపుతో, కఠిన చర్యలు, కఠిన నిర్ణయాలు తీసుకొంటూ, ఎప్పటికప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రులకు మోడీ దిశానిర్దేశం చేశారు. లాక్‌డౌన్‌లు, రవాణా ఆంక్షలు అన్నీ ఎంతో పకడ్బందీగా నిర్వహించారు. పార్టీలు, మాల్స్, సినిమా థియేటర్స్, విద్యాలయాలు అన్నీ కూడా మూతపడ్డాయి. మాస్క్‌లు, శానిటైజర్స్, భౌతికదూరం అన్న మూడు అంశాలకు ఎంతగానో ప్రాచుర్యం కల్పించారు. రోడ్లపై మనుషుల జాడే అగుపించేది కాదు. సూపర్ మార్కెట్లు సహితం ఎంత క్రమశిక్షణతో, ఆంక్షలతో నిర్వహించారు.

ఆ పీరియడ్‌లో కాయగూర ధరలు కూడా అందరికీ అందుబాటులో వుండేది. అన్ని చర్యలు తీసుకోవడం వల్లే మన భారతదేశంలో కరోనా చాలా వరకు, కట్టడిలో వుండేది. ఆర్థికంగా చూస్తే దేశం, దేశంలోని వ్యక్తులు కూడా బాగా దెబ్బతినడం మాత్రం వాస్తవమే. వలస కూలీలు దుర్భర జీవితాన్ని అనుభవించిన మాటా వాస్తవమే. అయినా ఆనాడు కరోనా బాధితులు ఈ రోజులా నరకాన్ని చూడలేదు. హాస్పిటల్స్ కోసం, ఆక్సిజన్ కోసం, బెడ్స్ కోసం పరుగులు తీయలేదు. మనం ఎన్ని కట్టుబాట్లు విధించినా, ఎన్ని జాగ్రత్తలు వహించినా ఆనాడూ ఈ కరోనా దాదాపు కోటిమంది భారతీయులకు సోకింది. లక్షా 50 వేల మందిని పొట్టనపెట్టుకున్నది. అమెరికా, బ్రెజిల్, ఆస్ట్రేలియా, రష్యా ఇంకా అనేక దేశాలకన్నా మనమే చాలా బెటర్‌గా నిలిచాం.

లాక్‌డౌన్ నిజంగా కొవిడ్‌కు భారతదేశంలో సంకెళ్ళు వేసింది. ఎన్ని కష్టాలు పడ్డా ఇతర దేశాలతో పోలిస్తే మనకే కొంత లాభం జరిగింది. ఆ రోజుల్లో ప్రధాని మోడీ ఎప్పుడు ఏం సందేశం ఇస్తాడో అని వినడానికి యావత్ దేశం ఎదురు చూసేది. క్లాప్స్ కొట్టమన్నా, ప్లేట్స్ కొట్టమన్నా, చేతులు చాచమన్నా భారతీయులంతా ‘ఏకతాటి’పై నిలిచి మోడీకి సంఘీభావం తెలిపేవాళ్ళం. అదొక చీకటి వెలుగుల అధ్యాయం.
జనవరిలో ఈ కరోనా దరిద్రం పూర్తిగా పోయిందనుకుంటే మళ్ళీ స్ట్రెయిన్ రూపంలో లండన్‌లో పుట్టుకొచ్చింది. దాని ఈనాటి ఉగ్రరూపం గూర్చి చాలా మంది శాస్త్రవేత్తలు హెచ్చరించారు. దీనిని SARS-COV-2 అని, B117 అని కానీ కూడా పిలిచేవారు. ఈ స్ట్రెయిన్ మరొక్కసారి ప్రపంచ దేశాల్ని కుదిపేసింది. ప్రపంచంలోని 30 దేశాలు ఆఘమేఘాలపై బ్రిటన్ దేశానికి తమ దేశాల నుండి రాకపోకల్ని నిషేధించాయి. మనం కూడా బ్రిటన్‌కు విమానాల్ని రద్దుచేశాం కొన్నాళ్ళు. ఆ బాధితుల సంఖ్య మొదట్లో మన దేశంలో 6 నుండి 33 వరకు క్రమక్రమంగా పెరుగుతూ వచ్చింది.

ఢిల్లీ, కర్ణాటక, పుణె, హైద్రాబాద్‌ల్లో ఈ మొదటి కేసులు కనుక్కున్నారు. జనవరిలో ఇంత భయాందోళనకు గురైనా ఎందుకనో తర్వాతి కాలంలో దీని గూర్చి ప్రభుత్వాలు కానీ, ప్రజలు కానీ పట్టించుకోలేదు. వ్యాక్సిన్స్ వచ్చేస్తున్నాయని, ఇవి ‘కొవిడ్’ను భూస్థాపితం చేసేస్తాయని అందరూ ఓ గుడ్డి నమ్మకంతో వుండిపోయారు. మనదేశంలో తయారయిన కోవిషీల్డ్, కోవాగ్జిన్ ప్రక్రియను మోడీ స్వయంగా సందర్శించి, వేగవంతానికి కూడా తోడ్పడ్డాడు.

జనవరి 16, 2021లో భారతదేశంలో ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రాం ప్రారంభించారు. మొదటగా హెల్త్‌కేర్ వర్కర్స్‌కు, ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు, సీనియర్ సిటిజన్స్‌కు ఈ వ్యాక్సిన్ వేయడం జరిగింది. తిరిగి మార్చి 1న సెకండ్ ఫేజ్‌లో వ్యాక్సినేషన్ స్టార్ట్ చేశారు. నెల రోజుల కాలంలో 8.4 మిలియన్లు అనగా 3.4% లక్ష్యాన్ని పూర్తి చేయగలిగారు. వాళ్ల లక్ష్యం జులై నాటికి 250 మిలియన్ల మందికి పూర్తి చేయాలన్నది. ఇక్కడే మోడీ ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందింది. వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తిగా నత్తనడకన సాగింది.
వ్యాక్సినేషన్ వేసుకొనేందుకు ఆదిలో చాలా మంది ఉత్సాహం చూపకపోవడం కూడా ఒక కారణం కావచ్చు. కానీ యుద్ధ ప్రాతిపదికన దీనిని చేపెట్టలేదు. వ్యాక్సిన్ పట్ల ప్రజలలో వున్న అపోహల్ని తొలగించి, ఉద్బోధ చేయడంలో ప్రభుత్వం విఫలమైంది.

సరైన ప్రచారాన్ని కూడా కల్పించలేకపోయారు. తూతూ మంత్రంగా చేశారేగాని మహా యజ్ఞంగా చేయలేదు. విదేశీయుల ప్రేమాభిమానాల్ని అందుకోవాలన్న తపనతో 76 దేశాలకు మన దేశం నుండి 6 కోట్లకు పైగా వాక్సిన్ డోసులు ఎగుమతులు చేశారు. కేంద్ర ఆరోగ్య మంత్రి అశ్విని కుమార్ రాజ్యసభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ఈ విషయం తెలియజేశారు. విదేశాలకు సహాయం చేయాల్సిందే కాదనలేం. కానీ తనకు మాలిన ధర్మం మొదలు చెడ్డ బేరం. మొదటి కరోనా వేవ్‌లో అగ్ర రాజ్యమైన అమెరికా అతలాకుతలమై తల్లడిల్లి అధఃపాతాళానికి పడిపోయింది. అదే అమెరికా సెకండ్ వేవ్‌లో వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తిగా ముగించి మరో ప్రళయాన్ని రాకుండా అడ్డుకోగలిగింది. తమ లక్ష్య సాధనకు వారం ముందే 20 కోట్ల డోసులు పూర్తి చేశామని ఆ దేశ నూతన అధ్యక్షులు బైడెన్ విజయగర్వంతో ట్వీట్ చేశాడు.

ప్రపంచ పటంలో తనకున్న స్థానాన్ని మరోసారి పైకి తీసుకొచ్చాడు. ఇది కచ్చితంగా అభినందించాల్సిందే. ఈ రోజు అమెరికాలోని పౌరులంతా దాదాపు పూర్తిగా వ్యాక్సినేషన్ వేయించుకొన్నారు. 2 రోజుల క్రితం నా మిత్రుడు అమెరికా నుండి ఫోన్ చేసి అక్కడ వ్యాక్సినేషన్ ప్రక్రియలో అనేక ఆసక్తికర విషయాలు తెలిపాడు. అమెరికాలో ఎక్కడ పడితే అక్కడ వ్యాక్సినేషన్ కేంద్రాలు నెలకొల్పి ఉచితంగా, సులువుగా వచ్చిన వారందరికీ వ్యాక్సిన్ కూడా వేశారట. వీధుల్లో కూడా షామియానాలు వేసి వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగించారట. అందరికీ వ్యాక్సినేషన్ అందుబాటులోకి తీసుకురావడమే వాళ్ళ మొదటి విజయం.
ఇలా ఇండియాలో ఎందుకు చేయలేకపోయారు? ఉదాహరణకు 23, 24, 25 తారీఖుల్లో హైదరాబాద్‌లో ఏ హాస్పిటల్‌లో కూడా వ్యాక్సినేషన్ స్టాక్ లేదు.

నేను చూద్దాం అని మెడికేర్ ఆస్పత్రికి ఫోన్ చేసి విచారిస్తే వారం పాటు వ్యాక్సిన్ గురించి చెప్పలేం అన్నారు. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన నిమ్స్‌లో కూడా ఇదే పరిస్థితి. ఇది చెప్పుకోవడానికే సిగ్గుచేటు. మోడీ మాటల్లో చెప్పాలంటే కరోనా ఇండియాలో తుపాన్‌లా వ్యాపిస్తున్నది నిజమే. మరి వ్యాక్సినేషన్ కొరత అన్నది మన దౌర్భాగం కాదా? పాలకులెప్పుడూ ప్రజల కోసమే పని చేయాలి కానీ, పాలనా కుర్చీ కోసం కాదు, భారత ఎన్నికల కమిషన్ కూడా ముందు చూపు లేకుండా, రానున్న విపత్తుని దృష్టిలో పెట్టుకోకుండా ఫిబ్రవరిలో 5 రాష్ట్రాలకు జరగనున్న ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసేశారు. అత్యున్నత న్యాయస్థానాలైనా ఈ దుశ్చర్యకు అడ్డుకట్ట వేయాల్సి ఉండేది. 186 మిలియన్ల ఓటర్లు, రాష్ట్రాలపై పట్టు సాధించుకొనేందుకు అన్ని పార్టీలు విస్తృతంగా ప్రచారాన్ని హోరెత్తించాయి. సభలకు జనం ఎగబడ్డారు.
నాయకుడు, మోడీ సహితం పెద్ద పెద్ద బహిరంగ సభల్లో పాల్గొని ప్రచారం కావించారు. మాస్కులు లేకుండానే జనం పాల్గొన్నారు. అందరు నాయకులు బాధ్యతల్ని విస్మరించారు. ఒక్కరైనా ప్రజారోగ్య భద్రత గూర్చి ఆలోచించకపోవడం మనదేశ దురదృష్టం.

మన రాజకీయ వ్యవస్థ దుర్గంధంలో పడి కొట్టుమిట్టాడుతున్నది. భారత ప్రధాని మోడీ ప్రచారంలో పాల్గొనకుండా వ్యాక్సినేషన్ ప్రక్రియ, కరోనా కట్టడి కార్యక్రమాల్లో నిమగ్నమై ఉండి వుంటే ఎంతో ఆదర్శంగా, మార్గదర్శకంగా ఉండేది. ఆయన కూడా అలా చేయలేదు. ఎన్నికలు జరిగిన రాష్ట్రాలలో 1500 శాతం పైగా కేసులు పెరిగాయని లెక్కలు చెప్తున్నాయి. ఎంత అన్యాయం? ఎంత దుర్మార్గం? ఎన్నికలు ముఖ్యమా? ప్రజల ప్రాణాలు ముఖ్యమా? అంటే కచ్చితంగా ప్రజల ప్రాణాలే ముఖ్యం. మరి అందరూ ప్రాణాల్ని గాలికొదిలేశారు. దిక్కుమాలిన ఎన్నికలకు తోడు ఇండియా, ఇంగ్లండ్ మధ్య రెండు ఇంటర్నేషనల్ క్రికెట్ పోటీలు నిర్వహించారు. అది కూడా గుజరాత్‌లోని మోడీ స్టేడియంలో. ఇందులోకి 1.30 లక్షల మంది ప్రేక్షకుల్ని అనుమతించారు. మాస్కులు లేవు, భౌతిక దూరం లేదు. అలాగే మహమ్మారికి మరో ఆజ్యం పోసింది హరిద్వార్‌లోని కుంభమేళా. కోట్లాది మంది పుణ్య స్నానాలు చేశారు. ఏప్రిల్ 27 ఆఖరు రోజున ఇంకా ఎన్ని కోట్ల మంది స్నానాలు చేస్తారో. రోజు రోజుకు కేసులు విపరీతంగా పెరిగిపోయాయి. వీటన్నిటికీ కేంద్రం అడ్డుకట్ట వేయగలిగి ఉంటే పరిస్థితులు ఈ రోజులా వుండేవి కావు.2019 డిశెంబర్‌లో కొవిడ్ అడుగు పెట్టాక ఏడాదిపాటు కేంద్రం అనేక చర్యలు తీసుకోవాల్సి ఉండేది. మెడికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను బాగా డెవలప్ చేసి వుండాలి.

విస్తృతంగా ప్రభుత్వరంగంలో హాస్పిటల్స్‌ను నిర్మించి అనువగు బెడ్స్, వెంటిలేటర్స్‌పై దృష్టి పెట్టాల్సి ఉండేది. ఆనాటి నుండి ఆక్సిజన్ ఉత్పత్తిపై దృష్టి పెట్టాల్సి వుండేది. విపత్తు కట్టుబాటు చర్యల్ని చేపట్టి వుంటే ఈ రోజు కరోనా నివారణ చర్యలు అవసరం వచ్చేవి కావు. ప్రతి రాష్ట్ర క్యాపిటల్లోనైనా కరోనా 10 వేల నుండి 20 వేల బెడ్సో హాస్పిటల్స్ ఎందుకు కట్టలేకపోయారు? 3 రోజుల క్రితం ప్రధాని దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. యావత్ భారతదేశం ఎప్పటిలా ఆయన ప్రసంగం కోసం ఎదురుచూశాయి. చివరికి ఆయన ప్రసంగం ఎవరినీ సంతృప్తి పరచలేకపోయింది. కఠినమైన నిర్ణయాలేవీ ప్రకటించలేదు. మొన్న సుప్రీంకోర్టు కూడా కేంద్రాన్ని నిలదీసి చీవాట్లు వేసింది. పరిస్థితులు ఎందుకిలా దిగజారాయి..

మోడీలో అతి విశ్వాసం అన్నా కావాలి. లేదా ఆత్మవిశ్వాసం సన్నగిల్లిందనైనా చెప్పాలి. దేశంలోని పరిస్థితులు ఈ రోజు అందర్నీ కంట తడిపెట్టిస్తున్నాయి. ప్రపంచ దేశాలు మనవైపు జాలిగా చూసే స్థితులు సంభవించాయి. ఎక్కడ చూసినా బాధితుల ఆక్రందనలు, స్మశానాల్లో శవాల గుట్టలు ఆస్పత్రి ప్రాంగణాల్లో బెడ్స్ కోసం, ఆక్సిజన్ కోసం అలమటిస్తున్న పేషెంట్లు. పార్కింగ్ లాట్స్‌లో అంబులెన్స్‌ల్లోనే ప్రాణాలు వదులుతున్న జనాలు. ఆక్సిజన్ దొరక్క హరీ మంటున్న వేలాది జనం. నిజంగా చాలా విపత్కర పరిస్థితులు నెలకొన్నాయి. అందరం ప్రమాదపు సుడిగుండాల్లో చిక్కుకున్నాం. కరోనా మరణ మృదంగాన్ని అడ్డుకునేవారు కరువయ్యారు. అందరిలోనూ భయాందోళనలు. బిక్కుబిక్కు మంటూ ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని బ్రతుకుతున్న జీవులు. ఆకలితో అలమటించే దేశాల్ని చూశాం. కానీ ఈ రోజు మనమే ప్రాణాలు కాపాడుకోవడం కోసం తల్లడిల్లుతున్నాం. బెడ్స్ దొరక్క చాలా మంది పగలు, రాత్రులు లేకుండా ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. చాలా చోట్ల బాధితులు ఆక్రోశంతో మంత్రుల్ని, శాసనసభ్యుల్ని నిలదీస్తున్నారు. కాలర్ పట్టుకొంటున్నారు. ఇన్నాళ్ళకు భారతదేశంలో ప్రజలకు ప్రశ్నించే ధైర్యం వచ్చింది.

మరోవైపు దీనంగా వేడుకొంటున్నారు. హెల్త్ సిస్టమ్ పూర్తిగా బ్రేక్‌డౌన్ అయింది. కరోనా గ్రాఫ్ లాగా కర్వ్గా పెరగడం లేదు. ఒక గోడలా నిలువుగా పెరిగిపోతూ ఉంది. అందరినీ భయభ్రాంతులకి గురిచేస్తున్నది. ఇండియా కెళ్ళొద్దంటూ ఫ్రాన్స్, అమెరికా, ఇటలీ, బ్రిటన్ వంటి దేశాలు ఇప్పటికే ప్రకటించాయి. సరైన చర్యలు తీసుకోకుంటే జూన్ మొదటి వారానికి రోజుకు 2300 పైగా మరణాలు ఉంటాయని లాన్‌సెట్ కోవిడ్ కమిషన్ హెచ్చరించింది. పరిస్థితులు బాగా దారుణంగా వున్నాయి. ఢిల్లీ, ముంబై లాంటి నగరాలలో టెస్ట్ చేసిన ప్రతి పదిమందిలో ఒక్కరికి పాజిటివ్ కనిపిస్తున్నది. ఇది దేశానికే ప్రమాద హెచ్చరికలు. ఢిల్లీ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. రోజుకు 1500 మందికి పైగా జనాలు కోవిడ్‌తో చనిపోతున్నారు. అనధికారికంగా లెక్కలేనన్ని మరణాలు. ఢిల్లీ, మహారాష్ట్ర మొదలగు కొన్ని రాష్ట్రాలలో లాక్‌డౌన్ పెట్టేశారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా రాత్రి కర్ఫ్యూ పెట్టేశారు.

పరిస్థితులు రోజురోజుకీ దయనీయంగా మారిపోతుం టే వ్యాక్సిన్ కంపెనీలు కూడా ధరలు విపరీతంగా పెంచేశారు. ఎన్నడూ లేని విధంగా కేంద్ర ప్రభుత్వానికి ఒక రేటు, రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక రేటు, హాస్పిటల్స్‌కు ఒక రేటు నిర్ణయించడం చాలా విడ్డూరం. పనిలో పనిగా హాస్పిటల్స్ కూడా విచ్చలవిడిగా దోపిడీకి తెర లేపాయి. రోజుకు లక్ష, రెండు లక్షలు ఛార్జ్ చేస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు సిఫార్సులకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ బెడ్స్ కేటాయిస్తున్నారు. పేదవాడి పరిస్థితి గూర్చి ఆలోచించే పాలకులే కరువయ్యారు.

ఇప్పటికి మన దేశంలో 12 కోట్లు మందికి వ్యాక్సిన్ వేశారు. అందుబాటలులో రెండవ డోస్ వేసుకొన్నవారు 3 శాతం మాత్రమే. 18-44 సంవత్సరాల మధ్య వయస్సు గల వారికి 70 శాతం మందికి వ్యాక్సిన్ వేయాలంటే కనీసం 31 వేల కోట్ల రూపాయలు కావాల్సి ఉంటుందని బిజినెస్ స్టాండర్డ్ పత్రిక అంచనా వేసింది. మరి కేంద్రం వెనకడుగు వేయకూడదు. ఇంత నత్తనడకగా వ్యాక్సినేషన్ సాగితే ఇండియాలో అందరికీ ఎప్పటికీ పూర్తయ్యేనో? ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మంత్రులు, నాయకులు సంయమనం కోల్పోకూడదు. 3 రోజుల క్రింత ఓ బాధితుడు ఆక్సిజన్ కోసం కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ను నిలదీస్తే ‘ఇలాగే మాట్లాడ్తే చెంప దెబ్బలు తింటావ్’ అంటూ ఆయన ఆ బాధితుడిని హెచ్చరించడం చాలా బాధాకరం. ఇదే హర్షవర్ధన్ మార్చి ఆఖరున ప్రధానిని ప్రశంసలతో ఆకాశానికెత్తేశాడు. కొవిడ్ ఎండ్ ఆఫ్ ది గేమ్ అన్నారు. డిసెంబర్‌లో సెంట్రల్ బ్యాంక్ అధికారులు కూడా మోడీ కరోనా కోరలు పీకేశాడు అన్నారు. మోడీని ‘వాక్సిన్ గురు’ అని కూడా కేంద్ర మంత్రి అభివర్ణించారు. మరి ఈ రోజు పరిస్థితులు ఏంటి? గతంలోనేలాగే కరోనా బాధలు కూడా హృదయ విదారకంగా వున్నాయి.

మహారాష్ట్రలో అతి పెద్ద స్లమ్ ఏరియా అయిన ధారావిలో 81 శాతం పైగా కరోనా సోకింది. ప్రధాని మోడీ జాగ్రత్త చర్యలు ఇప్పటికైనా చేపట్టాలి. ఇక చివరికి ప్రజలే వాళ్ళ ప్రాణాలు వాళ్ళు కాపాడుకోవడానికి నడుం కట్టాలి. ఇల్లు వదలకుండా, మాస్క్ విడువకుండా భౌతిక దూరం పాటిస్తూ జీవనం సాగిస్తే ఎలాంటి విపత్తులయినా మన ఇంటికి రావు. అత్యవసర పరిస్థితుల్లో మందుల కోసం బజార్లకు వెళ్లండి. డాక్టర్లు, దేవుళ్లు అవసరం రాకుండా ఈ జాగ్రత్తలు పాటించండి. రాష్ట్రాల మధ్య ఆక్సిజన్ సరఫరా విషయంలో అంతర్యుద్ధం ఆరంభం అయింది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి తమ రాష్ట్రానికి ఆక్సిజన్ రాకుండా కేంద్రం అడ్డుకుంటున్నది విమర్శించారు. సోనియా, రాహుల్ కూడా కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి కూడా తెలంగాణ రాష్ట్రం పట్ల వివక్షత చూపుతున్నదని సుతిమెత్తగా విమర్శించారు. రాను న్న మే నెల అగ్నిగుండం కానుంది జాగ్రత్త సుమా.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News