సౌతాఫ్రికా-నెదర్లాండ్ సిరీస్ రద్దు, భారత్ పర్యటన కూడా డౌటే!
జోహెన్నస్‌బర్గ్: ప్రపంచ వ్యాప్తంగా పలు ప్రతిష్టాత్మకమైన క్రీడల రద్దుకు కారణమైన కరోనా మహమ్మరి మరోసారి తన పంజాను విసురుతోంది. ఈ మహమ్మరి దెబ్బకు మళ్లీ క్రీడలు ఒక్కొక్కటి రద్దు కాక తప్పడం లేదు. దక్షిణాఫ్రికా, జింబాబ్వే తదితర దేశాల్లో కొవిడ్ కొత్త వెరియంట్ విజృంభిస్తోంది. దీంతో ఈ దేశాలు ఆతిథ్యం ఇస్తున్న పలు క్రీడలను రద్దు చేయడమే లేక వాయిదా వేయక తప్పడం లేదు. కొత్త వెరియంట్ భయంతో జింబాబ్వే వేదికగా జరగాల్సిన మహిళల ట్వంటీ20 ప్రపంచకప్ అర్హత టోర్నమెంట్‌ను అంతర్జాతీయ క్రికెట్ మండలి రద్దు చేసింది.
వరల్డ్‌కప్ కోసం మిగిలిన మూడు బెర్త్‌లను భర్తీ చేసేందుకు ఐసిసి ఈ టోర్నీని ఖరారు చేసింది. అయితే కరోనా విజృంభణ నేపథ్యంలో టోర్నీని ఐసిసి రద్దు చేసింది. దీంతో క్వాలిఫయింగ్ పోటీల ద్వారా వరల్డ్‌కప్‌కు అర్హత సాధించాలని భావించిన కొన్ని జట్లను ఊహించని షాక్ తగిలింది. ఐసిసి నిర్ణయంతో ర్యాంకింగ్స్‌లో టాప్10లో ఉన్న జట్లు నేరుగా ప్రపంచకప్‌కు సాధించే అవకాశం దొరికింది. ఇక అర్హత మ్యాచ్‌ల ద్వారా వరల్డ్‌కప్ బెర్త్‌ను దక్కించుకోవాలనే లక్షంతో ఉన్న జట్లకు ఊహించని షాక్ తగిలింది. గతంలో కూడా కొవిడ్ దెబ్బకు పలు క్రికెట్ టోర్నమెంట్‌లు వాయిదా వేయాల్సి వచ్చింది. మహిళలు, పురుషుల వరల్డ్‌కప్ షెడ్యూల్‌లలో మార్పులు చేయక తప్పలేదు.
అంతేగాక ఐపిఎల్‌ను కూడా వాయిదా వేయాల్సి వచ్చింది. ఒలింపిక్ వంటి విశ్వ క్రీడలను కూడా కరోనా వల్ల ఒక ఏడాది పాటు వాయిదా వేయక తప్పలేదు. ఇక ఇతర క్రీడలతో పాటు క్రికెట్‌పై కూడా కరోనా ప్రభావం బాగానే పడింది. ఈ మహమ్మరి దెబ్బకు ఎన్నో సిరీస్‌లను వాయిదా వేయాల్సిన స్థితి నెలకొంది. పలు సిరీస్‌లు రద్దయ్యాయి. అంతేగాక భారత్‌తో సమా పలు దేశాలు తమ దేశవాళి క్రికెట్‌ను రద్దు చేసుకున్నాయి. కాగా కొత్త వెరియంట్ కారణంగా సౌతాఫ్రికానెదర్లాండ్స్ జట్ల మధ్య జరగాల్సిన వన్డే సిరీస్ అర్ధాంతరంగా రద్దయ్యింది. క్రికెటర్ల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఐసిసి ఈ నిర్ణయం తీసుకుంది. కొవిడ్ కొత్త వెరియంట్ నేపథ్యంలో టీమిండియాదక్షిణాఫ్రికా జట్ల మధ్య జరగాల్సిన సిరీస్ కూడా సందిగ్ధంలో పడింది. వచ్చే నెలలో భారత్ దక్షిణాఫ్రికాలో పర్యటించాల్సి ఉంది. కానీ సౌతాఫ్రికాలో కొత్త వెరియంట్ విజృంభిస్తుండడంతో సిరీస్ జరగడం అనుమానంగా మారింది. ఈ సిరీస్‌కు ఐసిసి అనుమతిచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ఇప్పటికే సౌతాఫ్రికాలో పర్యటించడంపై పలు దేశాలు నిషేదం విధించాయి. ఇలాంటి పరిస్థితుల్లో భారత జట్టు అక్కడ పర్యటించేందుకు ఆసక్తి చూపిస్తుందా అనేది ప్రశ్నార్థకమే. గతంలో కూడా కరోనా దెబ్బకు దక్షిణాఫ్రికాతో జరగాల్సిన సిరీస్‌ను భారత్ మధ్యలోనే రద్దు చేసుకుంది. ఇక వచ్చే నెలలో ఆరంభమయ్యే సిరీస్ కూడా రద్దయ్యే అవకాశాలు కనిసిస్తున్నాయి.
క్రికెట్ బోర్డులకు తీరని నష్టం
ఒక వేళ క్రికెట్ సిరీస్‌లు అర్ధాంతరంగా రద్దయితే ఆయా దేశాల క్రికెట్ బోర్డులకు తీరని ఆర్థిక నష్టం జరిగే ప్రమాదం ఉంది. ఇప్పటికే కరోనా దెబ్బకు పలు టోర్నీలు, సిరీస్‌లు రద్దు కావడంతో ఆయా దేశాల క్రికెట్ బోర్డులు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకు పోయాయి. ఇలాంటి స్థితిలో కొత్త వెరియంట్ పుట్టుకు రావడం, దాని దెబ్బకు ఎక్కడి క్రికెట్ టోర్నీలు అక్కడే నిలిచి పోవడం క్రికెట్ నిర్వాహకులను ఆందోళనకు గురి చేస్తోంది. ఒకవేళ భారత్‌తో జరగాల్సిన సిరీస్ రద్దయితే సౌతాఫ్రికా క్రికెట్ బోర్డుకు పెద్ద మొత్తంలో ఆర్థిక నష్టం కలిగే అవకాశాలున్నాయని విశ్లేషకులు అభిప్రాపడుతున్నారు.