కలకలం రేపుతున్న కొత్త వేరియంట్
మనతెలంగాణ/హైదరాబాద్ : కొవిడ్ వైరస్ పూర్తిగా వెళ్లిపోయిందనుకుని అందరూ సాధారణ జీవితం గడుపుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో మళ్లీ కరోనా కేసులు కలకలం రేపుతున్నాయి. కరోనా రూపాంతరం చెందుతూ జెఎన్ 1 అనే కొత్త వేరియంట్ కేసులతో ప్రమాద ఘంటికలు మోగిస్తుంది. దీనికి సంబంధించిన తొలి కేసును ఈ ఏడాది సెప్టెంబర్‌లో అమెరికాలో గుర్తించగా, ఆ తర్వాత సబ్ వేరియంట్‌కు సంబంధించిన ఏడు కేసులను చైనాలో కూడా గుర్తించారు. ఇప్పుడూ ఆ తరహాలోనే తొలి కేసు మనదేశంలోని కేరళలోని తిరువనంతపురంలో నమోదయ్యింది. కేరళలో 79 ఏళ్ల వృద్ధురాలిలో కొవిడ్ -19 జెఎన్ 1 సబ్ వేరియంట్ బయటపడింది.
భారత సార్స్-కోవ్ -2 జీనోమిక్స్ కన్సార్షియం నిర్వహించిన పరిశీలనలో వృద్ధురాలు కరోనా కొత్త సబ్ వేరియంట్ బారిన పడ్డట్టు తేలింది. ఆమెకు ఆర్‌టిపిసిఆర్ పాజిటివ్‌గా నమోదు చేశారు వైద్యులు. ఇది ఓమిక్రాన్ సబ్ వేరియంట్ బీఏ 2.86 లాంటి వేరియంట్‌గానే పరిగణించారు. అయితే ఈ రెండింటిలో ఒకే ఒక్క మార్పు ఉంది. ఈ జెన్ 1 వేరియంట్‌లో వైరస్ ఉపరితలం చిన్న స్సైక్‌లను పోలి ఉన్నందున స్పైక్ ప్రోటీన్‌గా వ్యవహరించారు. అలాగే ఇది మానవులకు సులభంగా సోకే సామర్థ్యం ఉన్నవ్యాధిగా కనపించడమే శాస్త్రవేత్తలను ఒకింత కలవరపరుస్తోంది. పలు దేశాల్లో జెఎన్ 1 కేసులు పెరుగుతున్నప్పటికీ టీకాలు, చికిత్సలతో ఈ ఉపరకం నుంచి రక్షణ పొందొచ్చని నిపుణులు చెబుతున్నారు. అయినప్పటికీ గత అనుభవాల దృష్టా అందరిలో ఏదో తెలియని ఆందోళన నెలకొంది.
కరోనా కూడా ఇలాగే వ్యాప్తి
కరోనా కూడా ఇలానే నెమ్మదిగా వచ్చి ఆ తర్వాత ఊహకందనీ రీతిలో శరవేగంగా వ్యాపించింది. ఈ నేపథ్యంలో కొత్త వేరియంట్ కేసులు ప్రపంచవ్యాప్తంగా వేగంగా వ్యాపిస్తాయేమోనని శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు. అయితే ఇది మునుపటి వేరియంట్ల కంటే తీవ్రమైన అంటువ్యాది కావొచ్చా..? లేదా అనేది సందిగ్ధంలో ఉంది. ఈ కొత్త వేరియంట్ పట్ల అప్రమత్తంగా ఉండటం అనేది కీలకమే కానీ భయపడాల్సిన అవసరం లేదని పలువురు నిపుణులు పేర్కొంన్నారు. ఇప్పటి వరకు రోగుల్లో దీనికి సంబంధించి.. జ్వరం, ముక్కు కారటం, గొంతు నొప్పి, తలనొప్పి, జీర్ణశయాంతర సమస్యలు వంటి లక్షణాలు కనిపించినట్లు గుర్తించారు. అయితే ఈ కొత్త వేరియంట్ బారిన పడిన రోగులు త్వరగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యి వెళ్లిపోతుండటం అందరిలో ఉపశమనం కలిగిస్తుంది.