Thursday, December 26, 2024

మళ్ళీ కరోనా!

- Advertisement -
- Advertisement -

సంపాదకీయం: కొద్ది రోజుల్లోనే కొత్త సంవత్సర వేడుకలు వెలుగులు విరజిమ్మనున్నాయన్న ఊహ ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ బిఎఫ్7 కరాళ నృత్యం చేయబోతున్నదనే సమాచారం ప్రపంచ ప్రజలను భయభ్రాంతులను చేస్తున్నది. రెండేళ్ళ క్రితం 2020లో ప్రారంభమై దేశ దేశాలను కొవిడ్ (కరోనా) ఏ విధంగా మృత్యు ముఖంలోకి చేర్చిందో తలచుకుంటే భయంతో గగుర్పాటు కలుగుతుంది. అధికారిక గణాంకాల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 70 లక్షల మంది ప్రాణాలు కరోనాకు టపటపా రాలిపోయాయి. ప్రజలు ఎంతో మంది ఆప్తులను కోల్పోయి కనీవినీ ఎరుగని జీవన బీభత్సంలో దిక్కులేని స్థితిని అనుభవించవలసి వచ్చింది.

సాంకేతికంగా ఎంతో పురోభివృద్ధి చెందిన అమెరికాలో 10 లక్షల 77 వేల పైచిలుకు మందిని కొవిడ్ పొట్టనబెట్టుకుంది. అక్కడ దాదాపు కోటి మందికి కొవిడ్ సోకింది. ఆసుపత్రుల్లో బెడ్లు దొరక్క, శ్మశానాల్లో ఖాళీ లేక అగ్ర రాజ్యం అతలాకుతలమైంది. వుహాన్‌లో ప్రారంభమైన కొవిడ్ 19 ఈసారి తిరిగి చైనాలోనే విజృంభించింది. ప్రజాగ్రహానికి భయపడి జీరో కొవిడ్‌కు తెర దించిన తర్వాత బీజింగ్‌లో ఇంత వరకు ఏడుగురు మరణించారని వార్తలు చెబుతున్నాయి. మన దేశంలోనైతే ఆనాటి ఆకస్మిక లాక్‌డౌన్ ఉద్యోగాలు కోల్పోడం, వలస కార్మికుల వ్యథలు తలచుకొంటేనే ఆపాదమస్తకం వణుకు కలుగుతుంది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం మంగళవారం నాడు రాష్ట్రాలకు హెచ్చరిక జారీ చేసింది. ప్రస్తుతం తగు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని, పది మందిలోకి వెళ్ళేటప్పుడు మాస్కులు ధరించాలని సూచించింది.

కరోనా పాజిటివ్ కనిపించిన వారి నమూనాలను తదుపరి విశ్లేషణకు జీనోమ్ సీక్వెన్సింగ్ గురి చేయాలని సలహా ఇచ్చింది. పరీక్షించడం, నిఘా వుంచడం, చికిత్స చేయడం, టీకా ఇవ్వడం, కొవిడ్ సంబంధమైన ఇతర జాగ్రత్తలు తీసుకోడం తప్పనిసరిగా చేయాలని సిఫారసు చేసింది. కరోనా వల్ల దేశంలో ఇంత వరకు 5 లక్షల 30 వేల 677 మంది మరణించినట్టు అధికారిక సమాచారం తెలియజేస్తున్నది. అసలు సంఖ్య ఇందుకు మూడు, నాలుగింతలు వుంటుందని అనధికారిక సమాచారం. 98.8% మంది కొవిడ్ నుంచి బయటపడి తిరిగి ఆరోగ్యం పుంజుకొంటున్నందున కొత్త వేరియంట్ పట్ల భయోత్పాతం చెందవలసిన అవసరం లేదని కూడా కేంద్ర ఆరోగ్య శాఖ తెలియజేసింది.అయితే అప్రమత్తంగా వుండవలసిన అవసరాన్ని గుర్తు చేసింది. గతంలో కూడా మనది ఉష్ణ దేశం కాబట్టి కరోనా ఇక్కడ అడుగుపెట్టే సాహసం చేయబోదని తొలి రోజుల్లో ధీమా వహించాము. ఆ తర్వాత అది అబద్ధమని తేలిపోయింది.

తగినన్ని ఆక్సిజన్ సిలిండర్లు అందుబాటులో లేక అనేక మంది ఊపిరి పీల్చుకోలేక బలైపోయారు. ఢిల్లీలో కళ్ళముందే ప్రజలు ఆక్సిజన్ దొరక్క మృత్యువాతబడుతుంటే కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేయవలసి వచ్చింది. తాజా హెచ్చరికలతో విమానాశ్రయాల్లో కనీస జాగ్రత్తలు పాటించనున్నట్టు కేంద్రం వెల్లడించింది. కరోనా ఖతం కాలేదని, ఇంకా అప్రమత్తంగా వుండాలని సూచించింది. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోడానికి సిద్ధంగా వున్నట్టు ప్రకటించింది. బిఎఫ్7 వేరియంట్ చాపకింద నీరులా వ్యాపిస్తుందని చైనాలో దీనిని అదుపు చేయలేకపోతున్నారని వార్తలు చెబుతున్నాయి. ఊపిరి తిత్తులకు సోకి శ్వాస తీసుకోడం కష్టమవుతుందని అంటున్నారు. జ్వరం, దగ్గు, గొంతునొప్పి, ముక్కు కారడం, నీరసంగా వుండడం వంటివి కొత్త వేరియంట్ సంకేతాలని నిపుణులు నిర్ధారించారు.

రోగ నిరోధక శక్తి తక్కువగా వున్న వారిని ఇది తొందరగా కాటు వేస్తుందని అంటున్నారు. అరుదుగా జీర్ణాశయానికి సైతం సోకుతుందంటున్నారు. ఒమిక్రాన్ బిఎఫ్7 వేరియంట్ చైనాలో వ్యాపించినంత తీవ్రంగా అమెరికాలో ఇంత వరకు విస్తరించలేదని సమాచారం. అందుచేత ప్రపంచమంతటా ఒకే విధంగా ఇది ప్రళయాన్ని సృష్టించజాలదు అని భావిస్తున్నారు. మన దేశంలో ఇప్పటికి గుజరాత్, ఒడిశాలలో బిఎఫ్7 వేరియంట్ బయటపడింది. 4 కేసులు నమోదయ్యాయి. ఇందులో రెండు గుజరాత్‌లోను, రెండు ఒడిశాలోనూ రికార్డయ్యాయి. మొత్తం మీద కొవిడ్ పూర్తిగా నిర్మూలన కాకపోడం మళ్ళీ మళ్ళీ విజృంభించే ప్రమాదాలుండడం మానవాళికి తీవ్ర హెచ్చరిక.

ప్రస్తుతానికైతే టీకా ఒక్కటే దీనిని నిరోధించగల సాధనమని శాస్త్రజ్ఞులు అభిప్రాయపడుతున్నారు. ఒమిక్రాన్ వేరియంట్‌ను, అసలు కరోనాను నయం చేసే బూస్టర్ టీకాను బ్రిటన్ ప్రభుత్వ డ్రగ్స్ సంస్థ ఇటీవల అమోదించినట్టు చెబుతున్నారు. ఏ టీకా లేదా మరే ఔషధాన్నైనా కనుగొనడానికి దానిని ప్రపంచమంతటికీ సమాన స్థాయిలో అందుబాటులో తేడానికి తేడా వుంది. వ్యాక్సిన్ అందుబాటులో గతంలోనూ ధనిక, పేద దేశాల మధ్య తీవ్రమైన వ్యత్యాసం కనిపించింది. కొవిడ్‌ను ఎదుర్కోడంలో ప్రపంచమంతా ఒక్క త్రాటి మీదికి రాలేకపోయిన దృశ్యం మళ్ళీ మరొక్కసారి భయపెడుతున్నది. అందుచేత ఎవరికి వారు వ్యక్తిగత జాగ్రత్త తీసుకోడమే శరణ్యం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News