నాగోల్ మెనార్టీ సంక్షేమ వసతి గృహాంలో వైరస్ కలకలం
38మంది విద్యార్దులకు పాజిటివ్‌గా నిర్దారణ
గ్రేటర్‌లో రోజుకు 35కు పైగా నమోదైతున్న కేసులు
జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్న వైద్యాధికారులు
హైదరాబాద్: గ్రేటర్ నగర ప్రజలను గత వారం రోజుల నుంచి కరోనా మహమ్మారి ఆందోళనకు గురిచేస్తుంది. పక్కరాష్ట్రమైన మహారాష్ట్రంలో కేసులు పెరిగి పలుపట్టణాలు లాక్‌డౌన్‌కు వెళ్లడంతో ఇక్కడ విజృంభించే అవకాశముందని భయపడుతున్నారు. రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలు పెద్ద ఎత్తున సాగుతుండటంతో వైరస్ ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు. అదే విధంగా ఐదారు రోజుల నుంచి జీహెచ్‌ఎంసీ పరిధిలో 35కు పైగా నమోదైతున్నాయి. మంగళవారం నాగోల్‌లోని బండ్లగూడ మెనార్జీ సంక్షేమ వసతి గృహాంలో ఉండే 38మంది విద్యార్దులకు పాజిటివ్ వచ్చినట్లు కలకలం లేవడంతో ప్రైవేటు పాఠశాల్లో విద్యనభ్యసించే చిన్నారుల తల్లిదండ్రులు స్కూళ్లకు పంపాలంటే వెనకడుగు వేస్తున్నారు. పాఠశాలలు ప్రారంభించినప్పుడు వారం రోజుల పాటు యాజమాన్యాలు కోవిడ్ నిబంధనలు పాటించగా, తరువాత ఫీజుల వేటలో పడ్డారు.
ఇదే విధంగా ఉంటే ఒకరికి వైరస్ సోకిన వందలాది మంది విద్యార్దులకు చుట్టుకుంటుందని పేర్కొంటున్నారు. దీంతో జిల్లా వైద్యాధికారులు వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు జాగ్రత్తలు చేపడుతున్నారు. దీంతో పాటు బస్తీదవాఖానలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పరీక్షలు పెంచాలని అధికారులను ఆదేశించారు. కరోనా అనుమానిత లక్షణాలున్న వారంతా ఖచ్చితంగా పరీక్షలు చేయించుకోవాలని కోరుతున్నారు. ఎట్టి పరిస్దితుల్లో నిర్లక్షం చేయవద్దని హెచ్చరిస్తున్నారు. గ్రేటర్‌లోని 196 పట్టణ ఆరోగ్య కేంద్రాలు,బస్తీ దవాఖానలో సిబ్బంది అందుబాటులో ఉండి , లక్షణాలున్న ప్రతిఒకరికి టెస్టులు చేస్తామని ఆరోగ్య కేంద్రాలు అధికారులు పేర్కొంటున్నారు.రోజుకు 50మందికి టెస్టులు చేసి అరగంటలోనే ఫలితాలు వెల్లడిస్తామని చెబుతున్నారు. లక్షణాలు ఎక్కువగా ఉన్నవారిని గాంధీ,టిమ్స్ ఆసుపత్రులకు తరలిస్తామని, సాధారణ లక్షణాలుంటే హోంఐసోలేషన్‌లో ఉంచి ఉచితంగా మందులు అందజేస్తామంటున్నారు.
రానున్న రోజుల్లో కేసులు పెరిగే చాన్స్ ఉందని వైద్యులు భావిస్తున్నారు. కరోనా వ్యాక్సిన్‌తో వైరస్ తగ్గుతుందని ప్రజలు భావించవద్దని, జాగ్రత్తలు తీసుకుంటే కరోనా కట్టడి చేయవచ్చని, గత ఏడాది నుంచి ప్రజలు ఏవిధంగా బయటకు వెళ్లితే ముఖానికి మాస్కులు ధరించి, భౌతికదూరం పాటించడం, చేతులను శానిటైజర్‌తో కడగడం వంటివి పాటించాలని, వీటిని నిర్లక్షం చేస్తే వైరస్ కాటు వేస్తుందని జిల్లా వైద్యాధికారులు హెచ్చరిస్తున్నారు. అదే విధంగా విందులు, వినోదాలు పరిమిత సంఖ్యలో చేసుకోవాలని, పెద్ద ఎత్తున చేసుకోవాలనుకుంటే మళ్లీ కరోనాకు రెక్కలు తొడిగినట్లేనని, వైద్యులు సూచించిన సలహాలు పాటించి కరోనా కాటుకు బలికాకుండా కాపాడుకోవాలని ప్రభుత్వ అధికారులు సూచిస్తున్నారు.