మన తెలంగాణ / హైదరాబాద్ : హైదరాబాద్ నగరానికి చెందిన మర్రి లక్ష్మణ్ రెడ్డి ఇనిస్టిట్యూట్ (ఎమ్‌ఎల్‌ఆర్‌ఐటి) ని ప్రతిష్ఠాత్మక ఎస్‌ఎఈ ఇండియా ఫౌండేషన్ 202122 సంవత్సరానికి కార్పొరేట్ అవార్డుతో సత్కరించింది. ఎమ్‌ఎల్‌ఆర్‌ఐటి ప్రిన్సిపాల్ డా.కె. శ్రీనివాస్ రావు, మెకానికల్ హెచ్‌ఓడి ప్రొఫెసర్ ఎం.వెంకటేశ్వర్ రెడ్డి అక్టోబర్ 10న న్యూఢిల్లీలో ఎస్‌ఎఈ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ డా. శ్రీకాంత్ శ్రీనివాస్ నుండి అవార్డును అందుకున్నారు. ఎస్‌ఎఈ ఇండియా ఫౌండేషన్ అవార్డులు ఐదు కేటగిరీలలో ఇవ్వబడుతాయి. మొబిలిటీ ఇండస్ట్రీ(ఆటోమోటివ్ / ఏరోస్పేస్) అభివృద్ధికి వ్యక్తిగత ప్రొఫెషనల్ సభ్యులు, విద్యార్థి సభ్యులు, పరిశ్రమ, విద్యా సంస్థల సహకారం కోసం ప్రతి సంవత్సరం 35 అవార్డులు ఇవ్వబడుతాయి. 202122 సంవత్సరానికి హైదరాబాద్‌కు చెందిన ఎమ్‌ఎల్‌ఆర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకు కార్పొరేట్ అవార్డును ప్రధానం చేయడం జరిగింది.
ఎమ్‌ఎల్‌ఆర్ గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్ కార్యదర్శి మర్రి రాజశేఖర్ రెడ్డి (టిఆర్‌ఎస్ మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జి) ఎస్‌ఎఈ ఇండియా, ఫౌండేషన్ అవార్డు రావడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ అవార్డుతో తమ బాధ్యత మరింత పెరిగిందని అన్నారు. జాతీయ స్థాయిలో చాలా విద్యాసంస్థల నుండి పోటీ ఎదుర్కొని తమ కళాశాల అవార్డుకు ఎంపిక కావడం గర్వకారణమన్నారు. భవిష్యత్తులో ఎస్‌ఎఈ ఇండియా కాలేజీయేట్ క్లబ్ ఆఫ్ ఎమ్‌ఎల్‌ఆర్‌ఐటి ద్వారా ఎస్‌ఎఈ ఇండియా కార్యకలాపాలకు తమ పూర్తి మద్దతు ఉంటుందన్నారు. ఎమ్‌ఎల్‌ఆర్‌ఐటి చైర్మన్ మర్రి లక్ష్మణ్ రెడ్డి మాట్లాడుతూ తమ కళాశాలకు జాతీయ స్థాయిలో అవార్డు రావడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు.
ఈ అవార్డు రావడానికి కృషి చేసిన అధ్యాపకులను, విభాగ అధిపతిని ప్రత్యేకంగా అభినందించారు. ఎమ్‌ఎల్‌ఆర్‌ఐటి ప్రిన్సిపాల్ డాక్టర్ కె. శ్రీనివాస రావు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఎస్‌ఎఈ సుప్రా (ఫార్ములా ఐఐఐ రేస్ డిజైన్), బాజా (ఆల్ టెరైన్ వెహికిల్ డిజైన్), ఎడిసి(ఏరో డిజైన్ ఛాలెంజ్), టిడిసి(ట్రాక్టర్ డిజైన్ కాంపిటీషన్), బిడిసి(బైసైకిల్ డిజైన్ కాంపిటేషన్), వంటి అనేక ఎస్‌ఎఈ ఈవెంట్‌లు, పోటీలలో పాల్గొంటుందని తెలిపారు. అంతర్జాతీయ సమావేశాలు, ఆటో ఎక్స్‌పోస్, వర్క్‌షాప్‌లు, ఉపన్యాస సమావేశాలలో పాల్గొనడం వల్ల విద్యార్థులు తమ నైపుణ్యాన్ని మెరుగుపరుచుకునే అవకాశం లభిస్తుందన్నారు.