నేడు ప్రపంచ వ్యాపితంగా బడా కార్పొరేట్ సంస్థలు ఆధిపత్యం చలాయిస్తున్నాయి. వీటి ఆధిపత్యం ఆర్థిక రంగానికే కాక రాజకీయ, సాంస్కృతిక రూపాల్లోనూ కొనసాగుతున్నది. కార్పొరేట్ శక్తులకు మార్కెట్ విలువ తప్ప ఎటువంటి విలువలు ఉండవు. తమ ఆర్థిక అధికారాన్ని విస్తరింప చేసుకోవటానికి ఎంతటి నీచానికైనా సిద్ధమవుతాయి. కార్పొరేట్ల పూర్తి స్వభావం తెలుసుకోవాలంటే వాటికి ఉండే రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక మూలాలను అర్ధం చేసుకోవాలి. ఒకప్పుడు బ్రిటిష్ సామ్రాజ్యవాద ప్రపంచ ఆదిపత్యం గురించి విన్నాము. ఆ తర్వాత పోర్చుగీస్ దేశం సముద్ర మార్గం కనిపెట్టిన తర్వాత స్పానిస్ వర్తకులు భారత దేశం నుంచి సుగంధ ద్రవ్యాలు, మసాల దినుసులు కారు చవకగా తీసుకు వెళ్ళారు.
వ్యాపారంపై గుత్తాధిపత్యం వహించటం మొదలు పెట్టారు. పోర్చుగీస్, స్పానిష్ పెత్తనం భారత దేశం మీదే కాకుండా మొత్తం ఆసియా అంతటా వ్యాపించింది. స్పానిస్ వ్యాపారాన్ని అడ్డుకోవటానికి బ్రిటన్ వర్తకుల వ్యాపారానికి సర్వాధికార హక్కులు ఇవ్వాలని బ్రిటన్ దేశ ఎలిజిబెత్ రాణి 1 కి వ్యాపారులు విజ్ఞప్తి చేశారు. ఆ విజ్ఞప్తి అర్ధం కేవలం బ్రిటన్ నుంచి ఒక కంపెనీగా ఏర్పడిన వివిధ వాటాదారులు మాత్రమే ఈస్ట్ ఇండియాతో వ్యాపార లావాదేవీలు జరపాలి. ఆ విధంగా వ్యాపారంపై గుత్తాధిపత్యం రాసి ఇవ్వాలని కోరారు. ఇందుకోసం కొద్ది మంది వ్యాపారులు వాటాదారులుగా ఏర్పడి ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పాటు చేశారు. ఫలితంగా స్పానిస్ కంపెనీ, ఈస్ట్ ఇండియా కంపెనీ మధ్య గుత్తాధిపత్య పోటీ ఏర్పడి ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధిపత్యం పొందింది.
ప్రపంచ చరిత్రలో ఏ కార్పొరేట్ సంస్థ కూడా రాజ్యం ప్రోద్బలం, సహకారం లేకుండా మనుగడ, విస్తరణ సాధించటం జరగలేదు.
స్పానిస్ కంపెనీకి పోర్చుగీస్, ఈస్ట్ ఇండియా కంపెనీకి బ్రిటన్ ప్రభుత్వాల సహకారం లభించింది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత పరిమితంగా ఉన్న మానవ వనరులను సరిగా ఉపయోగించుకుని అభివృద్ధిని, సేవలను పెంపొందించాలంటే కార్పొరేటీకరణ, ప్రైవేటీకరణ మార్గమని సామ్రాజ్యవాద పాలకులు ఒక సిద్దాంతాన్ని ముందుకు తెచ్చారు. దానికి అనుగుణంగా ఉనికిలోకి వచ్చిన బ్రిటన్ వుడ్ సంస్థలు ( ప్రపంచ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్య నిధి, ప్రపంచ వాణిజ్య సంస్థ) కార్పొరేటీకరణకు శ్రీకారం చుట్టాయి. దాన్ని ప్రపంచ వ్యాపితం చేశాయి. స్వేచ్ఛా మార్కెట్ రాజకీయ, ఆర్థిక అంశాలను సిద్ధాంతీకరించటానికి కొత్త సంస్థలను, థింక్స్ టాట్స్ పుట్టుకొచ్చాయి. లాటిన్ అమెరికా, ఆసియా, ఆఫ్రికా ఖండాల నుంచి వచ్చే విద్యార్థులకు స్వేచ్ఛ మార్కెట్ ఆలోచనలను నూరిపోసి కొందరిని గుంపును తయారు చేయగలిగారు. వీరినే ‘చికాగో బోయ్స్’ అంటారు. చికాగో బోయ్స్ సలహా ప్రకారం ప్రభుత్వరంగ ఆస్తులను, సేవలను ప్రైవేటీకరించి, కార్పొరేటీకరించిన మొదటి దేశం చిలీ.
అమెరికన్ గూఢచారి సంస్థ, చికాగో బాయ్స్ సమన్వయంతో చట్టబద్ధంగా, ప్రజాస్వామ్యంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చి కార్పొరేటీకరణ, ప్రైవేటీకరణ విధానాలను అమలు జరిపే ప్రభుత్వాలను గద్దె మీద కూర్చొపెట్టాయి. 11- సెప్టెంబర్ -1973 న చిలీలో ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఏర్పడిన సాల్వడార్ అయెండీ ప్రభుత్వాన్ని కూల ద్రోసి నియంతృత్వాన్ని అమలు జరిపిన అగస్టో పినోచ్ అధికారంలోకి రావటానికి సిఐఎ తోడ్పడితే, దేశ ఆర్థిక వ్యవస్థ కొద్ది మంది చేతుల్లోకి పోయేలా చికాగో బోయ్స్ చేయగలిగారు. ఫలితంగా అగస్టో పినోచ్ 1973- 1990 మధ్య కాలంలో రెండు దఫాలుగా దాదాపు దేశంలోని అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేశాడు. బహుళ జాతి కార్పొరేషన్లు ప్రపంచంలోని అన్ని ఉత్పత్తి, వినిమ య, సేవా రంగాలను తమ గుప్పెట్లో పెట్టుకోగలుగుతున్నాయి. బడా ఆరు కార్పొరేట్ సంస్థలు 72% గ్లోబల్ విత్తనాలను కంట్రోల్ చేస్తున్నాయి. 79% పురుగు మందుల తయారీ మార్కెటింగ్ రంగాన్ని 6 సంస్థలు తమ స్వాధీనంలో పెట్టుకున్నాయి.
టాఫ్ పది ఎరువుల మందుల కార్పొరేట్లు 50% మార్కెటింగ్ చేస్తున్నాయి. ఆరు శాతం కంపెనీలు 52% వ్యవసాయ యంత్రాల ఉత్పత్తి, సరఫరా ప్రపంచమంతా చేస్తున్నాయి. కార్పొరేట్ సంస్థలు ఎప్పుడు తమ ఖర్చులు తగ్గించుకోవటానికి కొత్త కొత్త టెక్నాలజీలను పెడతాయి. దీని వలన సేవా రంగంలో కొన్ని పరిమిత ఉద్యోగ అవకాశాలు పెరిగినా, ఉత్పత్తి రంగంలో అవి తీసుకొచ్చే టెక్నాలజీ వలన శ్రామికులు ఉద్యోగాలు కోల్పోతున్నారు. పెట్టుబడిదారీ వ్యవస్థ టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్ ద్వారా శ్రమశక్తిని, ప్రకృతిని కొల్లగొట్టే పద్ధతినే సృజనాత్మక విధ్వంసం అంటారు. వ్యవసాయంలో ఒక ట్రాక్టర్ కనీసం పది మంది రైతు కూలీలకు పని లేకుండా చేస్తున్నది. ఆంధ్రప్రదేశ్‌లో యంత్రాల వినియోగం వలన 140 నుంచి 50 రోజులకు పని దినాలు తగ్గాయి.
కార్పొరేట్ సంస్థలు ఏ దేశంలో కొత్త టెక్నాలజీ ప్రవేశపెట్టినా, దానికి సంబంధించిన పార్ములాను పంచుకోవటం జరగదు. 1980 లో కోకాకోలా కంపెనీ ఇండియాలో తన ప్లాంట్ పెట్టే ప్రయత్నం చేయగా, భారత ప్రభుత్వం పార్ములా చెబితేనే ప్లాంట్ ఏర్పాటుకి అనుమతిస్తానని చెప్పటంతో కోకాకోలా కంపెనీ వెనక్కి పోయింది. ఆ తర్వాత ఆ కంపెనీకి లొంగిపోయిన భారత పాలకులు ఎటువంటి షరతులు లేకుండా ప్లాంట్ ఏర్పాటుకి అనుమతి ఇచ్చారు. అంతర్జాతీయ పెట్టుబడులకు సంబంధించి భ్రమలు కల్పించే ఒక ప్రచారం జరుగుతున్నది. పెట్టుబడుల వలన మెరుగైన టెక్నాలజీ వస్తున్నదని, మానవ వనరులు పెరుగుతాయని, దేశీయంగా ఉత్పత్తుల పోటీ పెరిగి సరుకుల, సేవల నాణ్యత పెరుగుతుందని, ఎగుమతుల వలన విదేశీ మారక ద్రవ్యం పెరుగుతుందని ఫలితంగా దేశం అభివృద్ధి చెందుతుందని కొందరు మాట్లాడుతున్నారు.
ఇలాంటి ప్రచారం బహుళ జాతి కంపెనీల ప్రయోజనాలను కాపాడటమే. బహుళ జాతి కంపెనీలు ఎవ్వరినీ ఉద్ధరించటానికి ఏర్పడలేదని, తమ సొంత లాభమే వాటికి ముఖ్యమని ఇలాంటి వారు గ్రహించటం లేదు. వెనుకబడిన దేశాల్లో బహుళజాతి కంపెనీలు పెట్టుబడులు పెట్టటానికి కారణం అక్కడ చవకగా దొరికే సహజ వనరులు, తక్కువ వేతనాలతో కార్మికులు, బలహీనమైన చట్టాలు, లాభదాయకమైన ట్యాక్స్ పాలసీల వలన తమ దేశాలలో కన్నా వెనుకబడిన దేశాల్లోనే ఈ సంస్థల ఎక్కువ లాభాలు పొందుతున్నాయి.
బహుళ జాతి టాప్ కంపెనీల ఆస్తులను చూస్తే కళ్ళు గిర్రున తిరుగుతాయి. 1990లో 50 టాప్ కార్పొరేషన్ల మార్కెట్ విలువ ప్రపంచ స్థూల దేశీయోత్పత్తిలో 4.7%గా ఉంది. అది 2020 నాటికి 27%కి పెరిగింది. ఈ మొత్తం కార్పొరేషన్ల సంపదలో 69% అమెరికాలో పోగుపడింది. ప్రపంచమంతా పట్టుకలిగిన 100 టాప్ కార్పొరేషన్లలో 59 అమెరికా ప్రధాన కేంద్రంగా కొనసాగుతున్నాయి. ఒక్క ఆపిల్ కార్పొరేట్ సంస్థ మార్కెట్ విలువ 2.7 ట్రిలియన్ డాలర్లు కన్నా ఎక్కువ. వాల్‌మార్ట్ కార్పొరేట్ సంపద 161 దేశాల ఆర్థిక వ్యవస్థ కన్నా పెద్దది. ప్రపంచంలో అతిపెద్ద 100 ఆర్థిక వ్యవస్థల్లో 49 దేశాలు ఉంటే, వాటిల్లో 51 కార్పొరేషన్లు ఉన్నాయి. ఈ కార్పొరేట్ సంస్థలు ప్రజలు ఏమి తినాలి, ఎలాంటి వినోదాన్ని కోరుకోవాలి, ఎలాంటి వార్తలు వినాలి, ఆలోచనలు చేయాలి, ఎక్కడ పని చేయాలి, ఎట్లా బతకాలి, ఎలాంటి సమూహంలో ఉండాలన్న దాన్ని నిర్ణయిస్తున్నాయి. ప్రపంచంలోని అనేక దేశాలను, సమాజాలను శాసిస్తున్నాయి.
నేడు ప్రపంచ దేశాల్లో భారత దేశం బహుళ జాతి సంస్థల వ్యాపారానికి, వాటి దోపిడీకి ప్రధాన కేంద్రంగా ఉంది.1980లో నూతన ఆర్థిక విధానాలను, 1991 సరళీకరణ ఆర్థిక విధానాలను దేశ పాలకులు అమలు చేయటం, 1993లో ప్రపంచ వాణిజ్య ఒప్పందంపై సంతకం చేయటం, వ్యవసాయక ఒప్పందాన్ని ఆమోదించటం ద్వారా విదేశీ పెట్టుబడులకు, బహుళ జాతి సంస్థల వ్యాపారానికి దేశంలో తలుపులు బార్లా తెరవబడ్డాయి. మోన్ శాంటో భారత దేశంలో విత్తన వ్యాపారం ప్రారంభించి ప్రతి సంవత్సరం వెయ్యి కోట్లు లాభాల రూపంలో తరలించుకుపోతున్నది. పత్తి విత్తనం 80% మోన్ శాంటానే విక్రయిస్తున్నది. వంగ, బెండ, మొక్కజొన్న, ఆవాలు మొదలైన విత్తన విక్రయాలకు కూడా పాలకులు ఆ కంపెనీకి అనుమతించారు. విదేశీ పురుగు మందుల వ్యాపారానికి దేశం నిలయమైంది.
తనదైన మార్క్‌తో మోడీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు సేవ చేస్తున్నది. అందుకోసం ప్లానింగ్ కమిషన్‌ను రద్దు చేసి, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్‌పార్మింగ్ ఇండియా ఆయోగ్ (NITI Aayog) ను ఏర్పాటు చేసింది. అది చేసేదల్లా అనేక రంగాల్లో ప్త్రైవేటీకరణకు, కార్పోటీకరణకు, విదేశీ పెట్టుబడులకు మార్గం సుగమం చేయటం. మోడీ ప్రభుత్వ పాలనలో సమస్త రంగాల్లోకి విదేశీ పెట్టుబడులను ఆహ్వానించటం, ప్రభుత్వరంగ పరిశ్రమలను, ఆస్తులను అమ్మివేయటం, వ్యవసాయాన్ని కార్పొరేట్ల పరం చేయటం, అందుకోసం రైతుల భూములు వాటి పరం చేసే వ్యవసాయ విధానాలు అమలు జరపటం చేస్తున్నది. ఫలితంగా భారతదేశంలోని అన్ని రంగాలలోకి బహుళజాతి సంస్థలు ప్రవేశిస్తున్నాయి. ఇవి దేశ రాజకీయ ఆర్థిక వ్యవస్థలను నియంత్రిస్తున్నాయి. ఇవి దేశ ప్రజలకు అత్యంత ప్రమాదకరంగా మారాయి. దేశ ప్రజలందరూ ఈ ప్రమాదాన్ని గ్రహించి బహుళజాతి సంస్థలకు వ్యతిరేకంగా ఉద్యమించాలి.